సీఏఏపై కేసీఆర్‌కు సొంత అభిప్రాయం లేదు

ABN , First Publish Date - 2020-02-25T08:55:19+05:30 IST

సీఏఏపై సీఎం కేసీఆర్‌కు సొంత అభిప్రాయం లేదని, దారుస్సలాం ఆదేశాలనే అమలు చేస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు.

సీఏఏపై కేసీఆర్‌కు సొంత అభిప్రాయం లేదు

దారుస్సలాం ఆదేశాలనే ఆయన అమలు చేస్తున్నారు..

ఒవైసీ చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తున్నారు

చట్టంపై అభ్యంతరాలుంటే కేంద్రం దృష్టికి తీసుకురావాలి: కిషన్‌ రెడ్డి


హైదరాబాద్‌, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): సీఏఏపై సీఎం కేసీఆర్‌కు సొంత అభిప్రాయం లేదని, దారుస్సలాం ఆదేశాలనే అమలు చేస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. అసదుద్దీన్‌ ఒవైసీ చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తున్నారని ఆరోపించారు.  సోమవారం హైదరాబాద్‌ రామంతాపూర్‌లోని కేంద్ర గూఢచార శిక్షణ సంస్థలో(సీడీటీఐ) నేషనల్‌ సైబర్‌ రిసెర్చ్‌ ఇన్నోవేషన్‌, కెపాసిటీ బిల్డింగ్‌ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. సైబర్‌ దాడులు ప్రపంచానికి సవాలుగా మారాయని, వాటిని అరికట్టేందుకు పోలీసులు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ నేరాలను అరికట్టాలంటే ప్రజల్లో కూడా స్వీయ అవగాహన అవసరమన్నారు. అనంతరం ఆయన రాష్ట్ర బేజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశంలోని 130 కోట్ల మందిలో ఏ ఒక్కరికీ సీఏఏ వల్ల నష్టం లేనప్పుడు ఆ చట్టానికి వ్యతిరేకంగా తెలంగాణ కేబినెట్‌ ఎందుకు తీర్మానం చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. సీఏఏపై అభ్యంతరాలుంటే కేంద్రం దృష్టికి తీసుకురావాలని, దుష్ప్రచారం చేయొద్దని కోరారు. సీఏఏలో మార్పులు, చేర్పులు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు త్వరలోనే తగిన గుణపాఠం చెప్తారన్నారు. మార్చి 15న కేంద్ర హోంమంత్రి అతిషా ముఖ్య అతిథిగా ఎల్బీ స్టేడియంలో సీఏఏకు అనుకూలంగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని, ప్రజలందరూ భారీ సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 


ట్విటర్‌ పిట్ట కేటీఆర్‌: లక్ష్మణ్‌

రోహింగ్యాలకు మజ్లిస్‌ మద్దతివ్వడంపై ట్విటర్‌ పిట్ట కేటీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో దేశ ద్రోహులు ఉన్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్‌ నేతృత్వంలో బీజేపీ నాయకులు సోమవారం డీజీపీ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. పాముకు పాలుపోసి పెంచినట్లుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మజ్లి్‌సను పెంచి పోషిస్తోందని లక్ష్మణ్‌ అన్నారు. దేశ వ్యతిరేక శక్తులు హైదరాబాద్‌లో తిష్టవేసి భూములు కబ్జా చేస్తున్నా ప్రభుత్వం నిద్రమత్తులో జోగుతోందన్నారు. డీజీపీని కలిసిన వారిలో ఎమ్మెల్సీ ఎన్‌.రామచందర్‌రావు, బీజేపీ నాయకుడు పొన్న వెంకటరమణ తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-02-25T08:55:19+05:30 IST