Abn logo
May 20 2020 @ 04:12AM

కెసిఆర్‌ వ్యాఖ్యలు

కరోనా వ్యాప్తి వల్ల ఏర్పడిన పరిస్థితులను అధిగమించడానికి కేంద్రప్రభుత్వం గొప్పగా ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ మంచిచెడ్డలపై ఇప్పుడిప్పుడే సమగ్ర విశ్లేషణలు, విమర్శనాత్మక వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బాధిత వర్గాల వారికి నేరుగా అందే సాయం ఏదీ లేకపోవడమే కాక, ఇప్పటికే అమలవుతున్న పథకాలను, మునుపే ప్రకటించిన ఆలంబనలను, యథావిధిగా కొనసాగే కార్యక్రమాలను కూడా కట్టగట్టి ఆ ఇరవై లక్షల కోట్ల కిందికి జమవేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. జాతీయస్థాయిలో ప్రతిపక్ష స్వరం అంటూ బలమైనది ఏదీ లేకపోవడం వల్ల, ఆ విమర్శకు పెద్ద గొంతు సమకూరలేదు. దేశంలో అనేక రాష్ట్రాలలో ప్రతిపక్షపార్టీలు అధికారంలో ఉన్నాయి.ఆయా ప్రభుత్వాలు కేంద్రంతో రకరకాల స్థాయిలలో సంబంధాలు కలిగి ఉన్నాయి. రాజకీయంగా ప్రత్యర్థి పక్షానికి చెందిన ప్రభుత్వాలతో పాటు, అనేక ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు కూడా కేంద్రం విషయంలో వినయవిధేయతలతో ఉంటున్నాయి. భారతీయ జనతా పార్టీకి ఉన్న తిరుగులేని మెజారిటీతో పాటు, ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షా స్వభావాలు, వ్యూహరచనా శైలి కారణంగా కూడా రాష్ట్రప్రభుత్వాలు తగినంత జాగ్రత్త వహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రప్రభుత్వంపై విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించడానికి సాహసించడం లేదు. అందుకు కారణం తెలిసిందే. ఎప్పుడైనా ఏ విషయంలోనైనా భిన్నవైఖరి ప్రదర్శించవలసి వచ్చినా, ఆ విషయాన్ని ముందుస్తుగా తెలిపి అనుమతి తీసుకుంటారని కూడా రాజకీయ పరిశీలకులు అంటుంటారు. తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రంతో సాధ్యమైనంత సఖ్యంగా ఉండాలని ప్రయత్నిస్తూ వచ్చింది. భారతీయ జనతాపార్టీ గురిపెట్టిన రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఉండడంతో, 


ఆ పార్టీ నేతలు రాష్ట్రంలో చురుకైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రయత్నించడం, ఇటీవలి ఎన్నికలలో కొన్ని అనూహ్య విజయాలు సాధించడంతో ఆ ఉత్సాహం ద్విగుణీకృతం కావడం చూస్తున్నాము. అయినప్పటికీ, తెలంగాణలో బిజెపికి పెద్ద భవిష్యత్తు లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ భావిస్తున్నారు కాబట్టి, రాజకీయంగా కూడా పెద్దగా వాదవివాదాల్లోకి ఆయన కానీ, ఆయన పార్టీగానీ దిగరు. అయితే, సోమవారం నాడు కెసిఆర్‌ కేంద్ర ప్రభుత్వంపై చేసిన విమర్శలు ఆశ్చర్యకరమైన తీవ్రతతో ధ్వనించాయి. కరోనా పరిస్థితి మొదలైనప్పటినుంచి, ఆయన తగిన ఆర్థిక, విధాన సహాయం కోసం కేంద్రాన్ని అభ్యర్థిస్తూ వచ్చారు. కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతో ఆయన స్వరం కూడా క్రమంగా పెరుగుతూ వచ్చింది. కెసిఆర్‌ మొదటినుంచి చేస్తున్న డిమాండ్‌ ఎఫ్‌ఆర్‌బిఎమ్‌ పరిమితి పెంచమని. 20 లక్షల కోట్ల ప్యాకేజీ వివరాలను విడతల వారీగా ప్రకటించే క్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఎఫ్‌ఆర్‌బిఎమ్‌ పరిమితిని 3 శాతం నుంచి 5 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు. ఆ రెండు శాతం హెచ్చింపు, అందులో ప్రతి 0.5 శాతం హెచ్చింపుకు ఒక షరతు చొప్పున, నాలుగు షరతులతో కూడి ఉన్నది. పరిమితి పెంపు వల్ల రాష్ట్రాలకు సమకూరేది రుణసదుపాయం మాత్రమే. తీసుకున్న రుణాన్ని తిరిగి తీర్చవలసింది రాష్ట్రాలే. అయినప్పటికీ, రుణసేకరణ పరిమితిని పెంచేందుకు షరతులు పెట్టడం రాష్ట్రాలకు గౌరవప్రదమైన విషయం కాదు. ఆ విషయం దగ్గరే కెసిఆర్‌ కేంద్రం మీద ధ్వజమెత్తారు. కేంద్రం పెడుతున్న షరతులు ఆర్థిక సంస్కరణలకు సంబంధించినవి, ఆ షరతులలో అనేకం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం అమలుచేసినవి, చేస్తున్నవి. పైగా కెసిఆర్‌ సంస్కరణలకు పూర్తి అనుకూలురు. అయినప్పటికీ ఈ షరతుల విధానం ఆత్మాభిమానాన్ని భంగపరిచే విధంగా ఉన్నదని ఆయన విమర్శించారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్‌ బిల్లుపై మాత్రం ఆయనకు తీవ్ర అభ్యంతరం ఉన్నది. దాన్ని అంగీకరించడం కూడా రుణపరిమితి హెచ్చింపు షరతులలో ఒకటి.


కేంద్రాన్ని సూటిగా విమర్శించడానికి ఈ రుణపరిమితి హెచ్చింపు అంశం అనువుగా దొరికింది కానీ, నిజానికి కరోనా పరిస్థితి నెలకొన్నప్పటి నుంచి కేంద్రం అనుసరిస్తున్న తీరు సరిగా లేదని పరిశీలకులు గుర్తిస్తూ ఉన్నారు. ప్రత్యేక పరిస్థితులను అనువుగా తీసుకుని, రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసే పేరిట, ఆదేశాలు ఇస్తున్నదన్న భావన నెలకొన్నది. వలసకార్మికుల సమస్యపై వెంటనే స్పందించకపోవడం, స్పందించిన తరువాత కూడా వారి కోసం ఆర్థిక కేటాయింపులు చేయకుండా రాష్ట్రాలపై భారం వేయడం, రాష్ట్రాలు కోరుతున్న ప్రత్యేక సాయాల విషయమై పెదవి విప్పకపోవడం, 20 లక్షల కోట్ల ప్యాకేజి పేరిట ప్రత్యక్ష ప్రయోజనం లేని ప్రకటనలు చేయడం, లాక్‌డౌన్‌ పరిస్థితిని అనువుగా తీసుకుని వివాదాస్పదమైన విధాననిర్ణయాలను ప్రకటించే ప్రయత్నం చేయడం– ఇవన్నీ కేంద్రంపై సందేహాలను కలిగించేవే. జాతీయస్థాయి పక్షాలు ఈ అంశాలను చర్చకు తీసుకుని వస్తే బాగుండేది. ప్యాకేజీ పైన ఇప్పుడిప్పుడే అవి మేలుకొంటున్నాయి. కానీ, కేంద్రం విధానాలు క్షేత్రస్థాయిలో ఎటువంటి స్పందనలను కలిగిస్తున్నాయో కెసిఆర్‌ మాటలను బట్టి తెలుస్తున్నది. సహజంగానే ముక్కుసూటిగా, ధైర్యంగా మాట్లాడగలిగిన కెసిఆర్‌, కేంద్రం పెత్తనం మితిమీరితే తాను సహించబోనని స్పష్టం చేశారు. ఈ విషయమై జాతీయ అధికారపక్షం నేతల నుంచి ప్రతివిమర్శలు రావడం సహజమే. కానీ, కెసిఆర్‌ లేవనెత్తిన అంశాలను పట్టించుకోవలసిన అవసరం మాత్రం జాతీయ అధికారపార్టీకి, ప్రతిపక్షపార్టీలకు, ప్రాంతీయపార్టీలకు కూడా ఉన్నది.