కేసీఆర్‌ నా యాత్రకు రా!

ABN , First Publish Date - 2022-04-26T07:25:00+05:30 IST

తనతో కలిసి సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఒకరోజు పాదయాత్ర

కేసీఆర్‌ నా యాత్రకు రా!

  • ప్రజా సమస్యలను నేను చూపిస్తే.. దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలి
  • సవాల్‌ విసిరిన వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల..
  • పార్టీ ‘ఆదివాసీ డిక్లరేషన్‌’పై ప్రకటన


భద్రాచలం/బూర్గంపాడు, ఏప్రిల్‌ 25 : తనతో కలిసి సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఒకరోజు పాదయాత్ర చేస్తే ప్రజాసమస్యలు చూపిస్తానని వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఒకవేళ వారికి సమస్యలను చూపించలేకపోతే ముక్కు నేలకు రాసి వెళ్లిపోతానని.. వాస్తవంగా సమస్యలుంటే మీరు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి, దళితుడిని సీఎం చేయాలని కేసీఆర్‌, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర 66వ రోజైన సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని ఇరవెండి కొత్తూరు కాలనీ, ఇరవెండి, మోతెపట్టీనగర్‌, సారపాక మీదుగా జరిగింది. ఈక్రమంలో ఇరవెండి గ్రామంలో నిర్వహించిన రైతుగోస దీక్షలో షర్మిల మాట్లాడారు.


సాయంత్రంకల్లా భద్రాచలం చేరుకున్న ఆమె.. అక్కడి అంబేద్కర్‌ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలోనూ ప్రసంగించారు. ‘పోడు భూములకు పట్టాలిస్తామన్న కేసీఆర్‌ ఎక్కడికి పోయారు? ఎక్కడ తిరుగుతున్నారు? ఒక్క ఎకరానికి పట్టా ఇవ్వకపోగా ఉన్న భూములను లాక్కుంటున్నారు. పట్టాలివ్వాలన్న మహిళలను నిర్దాక్షిణ్యంగా జైల్లో పెట్టారు’ అని షర్మిల మండిపడ్డారు. భద్రాచలం ఏరియా వైద్యశాలలో సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందిస్తామని కేసీఆర్‌ ప్రభుత్వం పేర్కొనగా.. ప్రస్తుతం ఒకే ఒక్క గైనకాలజిస్టే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 


యాదాద్రి, భద్రాద్రి రెండు కళ్లన్న సీఎం కేసీఆర్‌.. భద్రాద్రిపై సవతి తల్లి ప్రేమ ఎందుకు చూపిస్తున్నారని వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు చేసిన సీఎం, భద్రాద్రికి కనీసం రూ.100 కోట్లు కూడా ఇవ్వలేరా ? అని అడిగారు. ‘‘ గంగానది ప్రక్షాళన కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు.. గోదావరిపై ఎందుకు దృష్టిసారించడం లేదు. వాళ్ల దృష్టిలో అయోధ్య రాముడు, భద్రాద్రి రాముడు వేర్వేరా?’’ అని వ్యాఖ్యానించారు. ఈసందర్భంగా వైఎ్‌సఆర్‌టీపీ తరఫున ఆదివాసీల డిక్లరేషన్‌ను ప్రకటించిన షర్మిల.. తాము అధికారంలోకి వస్తే పోడు భూములకు పట్టాలిస్తామని, అక్రమ కేసులు ఎత్తివేస్తామని వెల్లడించారు. ఇటీవల కూతురిని కోల్పోయిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లును ఆమె పరామర్శించారు. 


నేటి పాదయాత్ర ఇలా..

సోమవారం బూర్గంపాడు మండలం సారపాకలో రాత్రి బసచేసిన షర్మిల.. మంగళవారం ఉదయం సారపాక నుంచి రెడ్డిపాలెం, నాగినేనిప్రోలు, బూర్గంపాడు, సంజీవరెడ్డిపాలెం గ్రామాల్లో పాదయాత్ర నిర్వహిస్తారు. ఇందులో భాగంగా బూర్గంపాడులో నిరుద్యోగ నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొంటారు. సంజీవరెడ్డిపాలెం గ్రామానికి చేరుకుని రాత్రి బస చేస్తారు.


‘ప్రజాప్రస్థానం’ నిర్వాహకులపై కేసు

వైఎస్‌ షర్మిల ఎలాంటి అనుమతులు తీసుకోకుండా భద్రాచలంలోని అంబేద్కర్‌ సెంటర్‌లో బహిరంగ సభను నిర్వహించి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించారంటూ భద్రాచలం పోలీసులు కార్యక్రమ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి సోమవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.


Updated Date - 2022-04-26T07:25:00+05:30 IST