కేసీఆర్‌ చంకన ప్రతిపక్షాలు

ABN , First Publish Date - 2022-06-27T08:52:53+05:30 IST

ఎనిమిదేళ్లుగా మోసపూరిత మాటలతో రాష్ట్ర ప్రజలను నిలువునా ముంచుతున్న దిక్కుమాలిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను..

కేసీఆర్‌ చంకన ప్రతిపక్షాలు

మహిళలకు రక్షణ కల్పించలేని 

ముఖ్యమంత్రి ఉరేసుకోవాలి:షర్మిల


చివ్వెంల/పెన్‌పహాడ్‌, జూన్‌ 26: ఎనిమిదేళ్లుగా మోసపూరిత మాటలతో రాష్ట్ర ప్రజలను నిలువునా ముంచుతున్న దిక్కుమాలిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రతిపక్ష నాయకులు ఎందుకు ప్రశ్నించడం లేదని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల నిలదీశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన విపక్షాలు సీఎం కేసీఆర్‌ చంకన చేరాయని ఆమె విమర్శించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా 106వ రోజైన ఆదివారం పెన్‌పహాడ్‌, చివ్వెంల మండలాల్లో ఆమె 14 కిలోమీటర్లు నడిచారు. గుంపుల, తుల్జారావుపేట గ్రామాల మీదుగా పాదయాత్ర చేసిన అనంతరం మాటముచ్చట కార్యక్రమంలో మాట్లాడారు. మద్యం, ఇసుక, భూ కబ్జాలతో టీఆర్‌ఎస్‌ నాయకులు బిజీగా ఉన్నారని, పోలీసులు వారి కోసం పనిచేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. స్థానిక మంత్రి జగదీశ్‌ రెడ్డి ఓ తుగ్లక్‌ మంత్రి అని, దోచుకోవడం దాచుకోవడం తప్ప  ప్రజలకు ఆయన చేసిందేమీ లేదన్నారు. ‘‘. జూబ్లీహిల్స్‌ రేప్‌ కేసులో నిందితులకు  బిర్యానీ పెడుతున్నారంటే సీఎం ఎంత మూర్ఖంగా పాలిస్తున్నాడో అర్థం చేసుకోవాలి. మహిళల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించలేని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉరేసుకోవాలి. హైదరాబాద్‌ నడిబొడ్డున బాలికపై అత్యాచారం జరిగితే నేటికీ నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు’’ అని షర్మిల వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-06-27T08:52:53+05:30 IST