హైదరాబాద్: సీఎం కేసీఆర్ వ్యూహాలు ఎవరికీ ఓ పట్టాన అర్థం కావు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఎంపీగా పోటీ చేసి హస్తినలో చక్రం తిప్పారు. పార్లమెంట్ తెలంగాణ వాణీని బలంగా వినిపించారు. తెలంగాణ ఏర్పడ్డాక గజ్వేల్ నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. అయితే ఈ సారి మాత్రం గజ్వేల్ నుంచి తప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి ఇప్పుడిప్పుడే తాకుతోంది. ముందస్తు ఎన్నికలు ఖాయమని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ పోటీ చేయబోయే స్థానంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. ఇప్పటివరకు గజ్వేల్ నుండి ప్రాతినిధ్యం వహించిన ఆయన ఇక మీదట నల్గొండ జిల్లా మునుగోడు నుండి పోటీ చేయాలని ఎందుకు భావిస్తున్నట్లు చెబుతున్నారు. సొంత జిల్లాను వదిలి పరాయి జిల్లాకు కేసీఆర్ వెళ్లాలనుకోవడం వెనుక అసలు కథ ఏంటన్న చర్చ మొదలైంది.
మునుగోడు నుంచి పోటీ చేస్తే ఈ ప్రభావం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతో పాటు పక్కనే ఉన్న ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలపై కూడా ఉంటుందని భావిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రభావం చాలా ఉంది. మునుగోడు నుంచి గెలిచి.. కోమటిరెడ్డి బ్రదర్స్ హవాకు బ్రేకులేయాలని కేసీఆర్ అనుకుంటున్నారంట. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా స్థానికేతరుడైనప్పటికీ ఇక్కడ పోటీ చేసి గెలిచారు. అయితే మునుగోడు ప్రజలు ఆయనపై అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కరోనా కారణంగా గత మూడేళ్లుగా రాజగోపాల్‌రెడ్డి నియోజకవర్గంతో అంటీముట్టనట్టుగా ఉన్నారు. మునుగోడు నుంచి పోటీ చేసి ఒక దెబ్బకు రెండు పిట్టలను కొట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే గజ్వేల్ నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనే అభిప్రాయం ఉంది. అలాంటప్పుడు కేసీఆర్ గజ్వేల్‌ను వదులుకోరని, అక్కడి నుంచే పోటీ చేస్తారనే మరికొందరు అంటున్నారు.
ఇవి కూడా చదవండి