ఆరేళ్ల కింద అనాథ.. ఇప్పుడు పసిడి పంటల తెలంగాణ :కేసీఆర్

ABN , First Publish Date - 2020-05-29T20:12:47+05:30 IST

తెలంగాణ ఇంజినీర్ల ప్రతిభకు ప్రత్యక్ష తార్కాణం కాళేశ్వరం ప్రాజెక్టు అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కొనియాడారు. తెలంగాణ ఇంజినీర్లు ఎంత

ఆరేళ్ల కింద అనాథ.. ఇప్పుడు పసిడి పంటల తెలంగాణ :కేసీఆర్

మెదక్ : తెలంగాణ ఇంజినీర్ల ప్రతిభకు ప్రత్యక్ష తార్కాణం కాళేశ్వరం ప్రాజెక్టు అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కొనియాడారు. తెలంగాణ ఇంజినీర్లు ఎంత శక్తిమంతులో, నైపుణ్యవంతులో రుజువు చేసిందని కొనియాడారు. కాళేశ్వరానికి 4,800 మెగావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నామని, పేరున్న కంపెనీలన్నీ ఈ ప్రాజెక్టు కోసం పనిచేశాయని పేర్కొన్నారు. దీంతో తెలంగాణకు 165 టీఎంసీల నూతన సామర్థ్యం వచ్చి చేరిందని, తెలంగాణ రైతులకు త్వరలోనే తీపి కబురు కచ్చితంగా చెబుతామని, దేశమే నివ్వెర పోయే మాట చెబుతామని ఆయన వెల్లడించారు.


లక్ష కోట్ల రూపాయల పంటను సంవత్సరానికి తెలంగాణ రైతాంగం పండించబోతోందని, దేశంలో 83 లక్షల టన్ను వరి ధాన్యం సేకరిస్తే... 53 లక్షల టన్నుల కేవలం తెలంగాణ నుంచే వచ్చిందని సాక్షాత్తూ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే పేర్కొందని ఆయన ఉటంకించారు. ఆరేళ్ల కింద అనాథలా ఉన్న తెలంగాణ.. నేడు మాత్రం పసిడి పంటల తెలంగాణగా ఆవిర్భవించిందని హర్షం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే, ప్రాజెక్టు పూర్తైందని అన్నారు.


 48 డిగ్రీల ఉష్ణోగ్రతలో ప్రాజెక్ట్‌ కోసం పనిచేసిన..ఇతర రాష్ట్రాల కూలీలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని ఆయన ప్రకటించారు. తెలంగాణ కోసం చావు నోట్లో తలపెట్టి వచ్చానని, అందరి కష్టాల ఫలితమే తెలంగాణ అద్భుతంగా తయారు కావాలని, అందరూ ఆశించిన రీతిలో ఫలితం కళ్లముందు కనిపిస్తోందని కేసీఆర్ ప్రకటించారు. 

Updated Date - 2020-05-29T20:12:47+05:30 IST