ఇంటర్నెట్ డెస్క్: కౌన్ బనేగా కరోడ్‌పతీలో(కేబీసీ) కోటి రూపాలయలు గెలుచుకుని దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు హిమానీ బుందేలా! చిన్నతనంలోనే కంటి చూపుకు దూరమైనా కూడా పట్టుదలతో చదువు పూర్తి చేసి.. చివరికి కేబీసీలో కోటి గెలుచుకుని ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. అయితే.. షో సందర్భంగా ఆమె తనకు గాయకుడు జుబిన్ నౌటియాల్ అంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సింగర్ ఆమెకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు.
మీ ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఓ రిపోర్టర్ వస్తున్నారంటూ ఇటీవల ఆమెకు ఫోన్ రావడంతో హిమానీ రెడీ అయ్యారు. ఆ తరువాత...ఆమె ఇంటికి రిపోర్టర్ వెళ్లారు. చాలా సేపు.. ఆమెను అనేక ప్రశ్నలు అడిగారు. హిమానీ కూడా చాలా ఆసక్తిగా సమాధానాలు ఇచ్చారు. ఇంటర్వ్యూ చివర్లో.. మీ ఇష్టమైన సింగర్ ఎవరని రిపోర్టర్ అడగ్గా.. జుబిన్ అని హిమానీ ఠక్కున జవాబిస్తారు. మరి జుబిన్ పాడిన ఓ పాట పాడమంటే ఆమె పాడతారు.
ఇవీ చదవండి..
ఈ పాట నాకూ వచ్చునన్న రిపోర్టర్ ఆ పాట పాడి వినిపిస్తారు. అప్పుడు హిమానీ ..తన ఎదురుగా ఉన్నది రిపోర్టర్ కాదని.. జుబిన్ అని గుర్తించి ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఆమె కుటుంబ సభ్యులు కూడా సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను జుబిన్ నౌటియాల్ ట్విటర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతోంది.