చమురు బావులు తవ్వితే.. ఆత్మహత్యకూ వెనుకాడబోం

ABN , First Publish Date - 2021-04-13T06:07:57+05:30 IST

తమ గ్రామంలో చమురు బావుల తవ్వకాలను జరగనీయబోమనీ, కాదని ముందుకెళ్తే మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకుంటామని మొవ్వ మండలం కాజ గ్రామస్థులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

చమురు బావులు తవ్వితే..  ఆత్మహత్యకూ వెనుకాడబోం

కాజ ప్రజాభిప్రాయ సేకరణలో హెచ్చరిక

ముక్తకంఠంతో నినదించిన రైతులు, పర్యావరణవేత్తలు

కూచిపూడి, ఏప్రిల్‌ 12 : తమ గ్రామంలో చమురు బావుల తవ్వకాలను జరగనీయబోమనీ, కాదని ముందుకెళ్తే మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకుంటామని మొవ్వ మండలం కాజ గ్రామస్థులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాజ బ్లాక్‌గా రూ.650 కోట్ల అంచనాలతో 35 చమురు బావులు తవ్వేందుకు వేదాంత లిమిటెడ్‌ సంస్థ ప్రభుత్వ అనుమతి కోరింది. ఈ మేరకు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సోమవారం కాజ జడ్పీ పాఠశాలలో పర్యావరణ సంబంధిత ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. మొవ్వ మండలంలో 16, గూడూరు మండలంలో 18, పామర్రు మండలంలో 1 మొత్తం 35 చమురు బావులు తవ్వేందుకు సంస్థ పరిశోధనలు నిర్వహించింది. డీఆర్‌వో ఎం.వెంకటేశ్వరరావు, ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ప్రాంతీయ అధికారి మురళీ ఈ సందర్భంగా ప్రజలు, రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. రైతులు, ప్రజల నుంచి ఒకే అభిప్రాయం వ్యక్తమైంది. ‘మీ వ్యాపారాల కోసం మా జీవితాలు నాశనం చేయవద్దు. సహజ వనరుల మధ్య సంతోషంగా జీవిస్తున్నాం. రైతుల జీవితాలను నాశనం చేయొద్దు. భయం గుప్పిట్లో బతికే బతుకులు మాకొద్దు. చమురు బావులు తవ్విన జిల్లాల్లో అక్కడి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మేము కళ్లారా చూశాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎంపిక చేసుకున్న 35 ప్రాంతాల్లో చమురు బావుల తవ్వకాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం’ అని రైతులు హెచ్చరించారు. ఈ సందర్భంగా వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే...

ఆమరణ దీక్షకూ సిద్ధమే  

సహజ వనరుల మధ్య సంతోషంగా జీవిస్తున్నాం. రంగు కాగితాలు ఆశ చూపి మా భూములు నాశనం చేయొద్దు. భూమిని సహజ సిద్ధంగా ఉంచుకుంటాం. ఆరోగ్యకరమైన వాతావరణం, పంటలు సృష్టించుకుంటాం. మీ గ్యాస్‌లు మాకొద్దు. కాదని ముందుకెళ్తే ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నాం.

-ఎం.విజయరావు,  ప్రకృతి వ్యవసాయ రైతు

రైతుల జీవితాలు పాడవుతాయి

మా బతుకులు చిన్నాభిన్నం చేయొద్దు. మీ వ్యాపారాల కోసం మా జీవితాలు నాశనం చేయొద్దు. చమురు బావులు తవ్విన ప్రాంతాల్లో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో మేము చూశాం. రైతుల జీవితాలు పాడవుతాయి. చమురు బావుల తవ్వకాన్ని వ్యతిరేకిస్తున్నాం.  

- కాశిరెడ్డి, వైసీపీ నేత

పచ్చటి వాతావరణంలో చిచ్చుపెట్టొద్దు 

బావులు తవ్వుకుంటూపోతే పంట భూములు మిగులుతాయా? పచ్చటి వాతావరణంలో చిచ్చు పెట్టొద్దు. బావులు తవ్విన జిల్లాలు అభివృద్ధికి నోచుకోలేదు. రైతులు, కూలీలు నిరుపేదలుగా మారతారు. 

- దగాని సంగీతరావు, సీపీఐ నేత 

ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వానికి నివేదిస్తాం 

   వీరి అర్జీల పరిశీలనలో భాగంగా ప్రజాభిప్రాయాన్ని  ఆడియో, వీడియో రూపంలో సేకరించాం. దీన్ని ప్రభుత్వానికి ఉన్నది ఉన్నట్లుగా నివేదిక అందిస్తాం. తుది నిర్ణయం ప్రభుత్వానిదే.

- మురళి, ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ప్రాంతీయ అధికారి  

Updated Date - 2021-04-13T06:07:57+05:30 IST