‘‘సరైన ప్రణాళిక, శ్రమించే తత్త్వం ఉంటే ఎవరైనా మంచి ఫలితాలు సాధించవచ్చు. మనం చదువుతున్న దాని మీద ఇష్టాన్ని పెంచుకోవడమే విజయానికి కీలకం’’ అంటోంది కావ్యా చోప్రా.
ఢిల్లీకి చెందిన పదిహేడేళ్ళ కావ్య జేఈఈ మెయిన్స్‌లో నూటికి నూరు మార్కులు సాధించిన ఏకైక అమ్మాయిగానే కాదు, తొలి అమ్మాయిగానూ చరిత్ర సృష్టించింది. మరో 0.01 శాతం మార్కుల కోసం రెండోసారి పరీక్షకు వెళ్ళి రికార్డు సృష్టించిన ఆమె పట్టుదల, ప్రతిభ సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ఈ విజయం గురించి ఆమె మాటల్లోనే...
‘‘ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన జేఈఈ పరీక్షలో నాకు వచ్చిన స్కోర్ బాగుందని అందరూ అంటున్నా, నాకెందుకో సంతృప్తి కలగలేదు. అప్పుడు నేను 99.97 శాతం సాధించాను. కానీ కానీ 99.98 శాతాన్ని మించి సాధించాలన్నది నా లక్ష్యం. అందుకే మార్చిలో మళ్ళీ మెయిన్స్‌కు హాజరయ్యాను. అయితే, ఈ ఏడాది మార్చిలో జేఈఈ రాసిన వారిలో.... నూటికి నూరు శాతం స్కోర్ సాధించిన పదమూడు మందిలో నేనూ ఉంటాననీ మాత్రం అనుకోలేదు. ఇదో రికార్డ్ అవుతుందని కూడా తెలీదు.
నేను పుట్టిందీ, పెరిగిందీ ఢిల్లీలో. మా నాన్న కంప్యూటర్ ఇంజనీర్, మా అమ్మ లెక్కల టీచర్. నాకు చిన్నప్పటి నుంచీ లెక్కలన్నా, ఫిజిక్స్ అన్నా ఇష్టం. మా నాన్నలా ఇంజనీర్ కావాలన్నది నా కల. దానికి ఆ రెండు ఆ సబ్జెక్ట్స్‌లో మంచి పట్టుండాలి. తొమ్మిదో తరగతి నుంచీ వరుసగా రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్‌లో క్వాలిఫై అవుతున్నా. పదో తరగతిలో 97.6 శాతం మార్కులు వచ్చాయి. టెన్త్‌లో ఉన్నప్పుడు ఇండియన్ నేషనల్ జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ (ఐఎన్జెఎస్ఓ) పరీక్ష రాసి, హోమీబాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ (హెచ్బిసిఎస్లో) ఇంటర్లో చేరాను. అలాగే నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామ్ ఇన్ ఆస్ట్రానమీ (ఎన్ఎస్ఈ)లోనూ, ఇండియన్ ఒలింపియాడ్ క్వాలిఫయర్స్‌లో కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్... ఈ మూడిటిలో క్వాలిఫై అయ్యాను. అయితే నా దృష్టంతా జేఈఈ మీదే ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన మెయిన్స్‌కు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎక్కువగా ఫిజిక్స్, కెమిస్ట్రీల మీద దృష్టి పెట్టాను. కానీ కెమిస్ట్రీలో తక్కువ మార్కులు వచ్చాయి. మరికాస్త ఎక్కువ వస్తాయని నేను అనుకున్నాను. అందుకే మార్చి పరీక్షలకు మరింతగా శ్రమించాను. పదిహేను రోజుల పాటు అదే పనిగా చదివాను. 300కు 300 మార్కులు వచ్చి టాపర్‌గా నిలుస్తాననీ, అలాగే నూరుశాతం స్కోర్ సంపాదించిన తొలి మహిళా అభ్యర్థిగా చరిత్ర సృష్టిస్తానని ఊహించలేదు.
ఒక అమ్మాయి సాధించిన విజయంగా దీన్ని అందరూ అభినందిస్తూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. నా తల్లిదండ్రులు నన్నూ, ఇప్పుడు తొమ్మిదో తరగతి చదువుతున్న మా తమ్ముణ్ణీ ఒకేలా చూశారు. సమానమైన అవకాశాలు ఇచ్చారు. నేను అమ్మాయిననే కారణంగా వివక్షను ఇంట్లో ఎప్పుడూ ఎదుర్కోలేదు. కానీ మన దేశంలో చాలా మంది అమ్మాయిలకు ఇలాంటి పరిస్థితి లేదని నాకు తెలుసు. వివక్షకు గురవుతున్న అమ్మాయిలను నేను చూశాను కూడా! నూరు శాతం మార్కులు సాధించడం గొప్ప అని అనుకోవడం లేదు. అయితే సంతోషంగా ఉంది. ఎందరో అమ్మాయిలకు ఇది ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని నేననుకుంటున్నా. పత్రికల్లోనూ, సోషల్ మీడియాలోనూ నన్ను అభినందిస్తూ వస్తున్న వార్తలూ, పోస్టులూ... ఇదంతా కొత్తగా ఉంది.
ఏ పరీక్షలోనైనా మంచి మార్కులు తెచ్చుకోవాలంటే ప్రణాళిక ముఖ్యం, అలాగే ఆ ప్రణాళిక విజయవంతంగా అమలు చేయాలంటే శ్రమపడాలి. నేను రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు చదువుతాను. కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్. ఈ మూడు సబ్జెక్ట్స్కూ ఆ సమయాన్ని సమానంగా కేటాయిస్తాను. సందేహాలేవైనా ఉంటే వాటిని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. అవే నన్ను మంచి స్కోర్ సాధించేలా చేశాయనుకుంటున్నా. కంప్యూటర్ సైన్స్ అంటేనే మ్యాథమెటిక్స్ అప్లికేషన్. దీనికి సంబంధించిన కోర్సులు చదివితే కెరీర్ బాగుంటుంది. ఆర్థిక స్థిరత్వం కూడా ఉంటుంది. అందుకే బొంబాయి ఐఐటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదవాలనుకుంటున్నా. ఇప్పటికైతే మే నెలలో జరగబోయే ట్వల్త్ బోర్డ్ ఎగ్జామ్స్కూ, ఆ తరువాత జరిగే జేఈఈ అడ్వాన్స్కూ ప్రిపేర్ అవుతున్నాను.’’