కవిత ఘన విజయం.. కేసీఆర్ తదుపరి స్టెప్ ఇదేనా..?

ABN , First Publish Date - 2020-10-13T15:04:56+05:30 IST

పోయిన చోటే వెతుక్కోవాలనేది నానుడి. ఇప్పుడీ మాట నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు సరిగ్గా సరిపోతుంది. తానెక్కడ, ఏం కోల్పోయారో.. అక్కడ అలాంటి

కవిత ఘన విజయం.. కేసీఆర్ తదుపరి స్టెప్ ఇదేనా..?

పోయిన చోటే వెతుక్కోవాలనేది నానుడి. ఇప్పుడీ మాట నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు సరిగ్గా సరిపోతుంది. తానెక్కడ, ఏం కోల్పోయారో.. అక్కడ అలాంటి పదవిని గెలుచుకున్నారామె. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత భారీ మెజారిటీతో గెలుపొందారు. ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో విజయబావుటా ఎగురవేశారు. మరి సుమారు ఏడాది విరామం తర్వాత తిరిగి ఎమ్మెల్సీగా రాజకీయ కదనరంగంలోకి దిగిన కవితకు ఏ పదవి దక్కనుంది? ఆమెకు గులాబీ శ్రేణులు ఆశిస్తున్న ఆ ఉన్నత స్థానమేంటి?..


గులాబీ శ్రేణుల్లో అంబరాన్నంటిన సంబురాలు..

నిజామాబాద్ జిల్లా కోడలైన కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా మళ్లీ ప్రత్యక్ష రాజకీయ రంగంలోకి దిగారు. స్థానిక సంస్థల కోటాకు చెందిన ఎమ్మెల్సీగా ఘనవిజయం సాధించారు. పోల్ అయిన మొత్తం 823 ఓట్లలో కవితకు 728 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన పోతన్ కర్ లక్ష్మీనారాయణకు 56 ఓట్లు వచ్చాయి. లక్ష్మీనారాయణపై 672 ఓట్ల మెజారిటీతో కవిత విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి సుభాష్‌రెడ్డికి 29 ఓట్లు మాత్రమే దక్కాయి. ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కని స్థాయిలో కవిత జయకేతనం ఎగురవేయడంతో గులాబీ శ్రేణుల్లో సంబురాలు మిన్నంటాయి.


పూర్వవైభవం తేవడానికే...

నిజానికి కవిత విజయం లాంఛనమేనని మొదటి నుండి ప్రచారం జరిగింది. అయినా అధికార టీఆర్ఎస్ ఏ మాత్రం అలక్ష్యం ప్రదర్శించలేదు. బీజేపీ, కాంగ్రెస్ ప్రతినిధులను పెద్దఎత్తున టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. ఈ చేరికల కోసం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు తీవ్రంగా శ్రమించారు. అన్ని రకాల అస్త్రాలు ప్రయోగించారు. మొత్తానికి కవితకు రికార్డు స్థాయిలో మెజారిటీ కట్టబెట్టారు. ఇదంతా కల్వకుంట్ల కవితకు పూర్వవైభవం తేవడానికి జరిగిందనీ, ఎమ్మెల్సీ ద్వారా ఆమె ఉన్నత స్థానానికి చేరుకుంటారనీ స్వపక్షీయులు, విపక్షీయులు గుసగుసలాడుకుంటున్నారు.


నాటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా...

గతంలో కవిత నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు జాతీయస్థాయి వ్యవహారాలకే పరిమితం అయ్యారు. ఢిల్లీలో పార్టీ వ్యవహారాలు చూసుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో, అధికారిక వ్యవస్థలో ప్రత్యక్షంగా పాలు పంచుకోలేకపోయారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మాత్రం ఆమె అన్నీతానై నడిపించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి చెందిన ధర్మపురి అర్వింద్ చేతిలో ఓడిపోయారు. నాటి నుండి కవిత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తిరిగి ఆమెను రంగంలోకి దింపాలని భావించిన కేసీఆర్.. ఎమ్మెల్సీగా పోటీ చేయించారు. పార్టీ పెద్దలు, జిల్లా శ్రేణులు ఆశించినట్లుగా ఆమె ఘన విజయం సాధించడంతో ఇక ఉన్నత స్థానం ఏమిటనే దానిపై చర్చ జరుగుతోంది.


కేసీఆర్‌కు అది పెద్ద కష్టమేమీ కాదు..!

ప్రస్తుతానికి ప్రభుత్వ చీఫ్ విప్ పోస్టు ఖాళీగా ఉంది. ఇది క్యాబినెట్ హోదా గల పదవి కావడంతో కవితకు కేటాయించే అవకాశాలున్నాయి. లేనిపక్షంలో ఏదైనా మంత్రి పదవి ఇస్తారని భావిస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రి వర్గంలో బెర్త్ ఖాళీ లేదు. ఎవరో ఒక మంత్రిని తప్పిస్తే తప్ప కవితకు ఆ కుర్చీ దక్కే సూచనల్లేవు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన కవితకు మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే కేసీఆర్‌కు పెద్ద కష్టమేమీ కాదని జిల్లా టీఆర్ఎస్ నాయకులు చర్చించుకుంటున్నారు.


మరి ఏ స్థానంలో ఉంటారో...

ఇక ఇటు జిల్లా, అటు రాష్ట్ర రాజకీయాల్లో కవిత అవసరం ఎంతో ఉందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారట. ఒకవేళ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే ఈ రాష్ట్రంలో కేటీఆర్‌తోపాటు కవితను కీలకం చేయాలని అనుకుంటున్నారట. ఓ మహిళా నేతగా ప్రమోట్ చేయడంతోపాటు యువతకు ప్రాధాన్యత ఇస్తున్నామని చాటేందుకు కవితను ఉన్నత స్థితిలో ఉంచాలని భావిస్తున్నారట. దీనికోసం మంత్రి పదవే కావాలనుకుంటే కేసీఆర్ స్వయంగా పావులు కదిపే అవకాశాలున్నాయట. ఈ మేరకు ఇందూరు నేతలు సంకేతాలిస్తున్నారు. మొత్తం మీద, కవిత ఉన్నత స్థానంలో ఉంటారని వారు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. అయితే ఆమె ఏ స్థానంలో ఉంటారు.. ఏ పదవి కేటాయిస్తారు.. అనేది తేలాలంటే మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే.

Updated Date - 2020-10-13T15:04:56+05:30 IST