Bharat Rashtra Samithi: బీఆర్ఎస్ ప్రకటన వేళ కవిత గైర్హాజరు.. విభేదాలే కారణమా?

ABN , First Publish Date - 2022-10-07T01:16:09+05:30 IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్రీయ సమితిగా మారుస్తూ అధికారికంగా ప్రకటన చేసిన వేళ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్సీ కవిత గైర్హాజరయ్యారు.

Bharat Rashtra Samithi: బీఆర్ఎస్ ప్రకటన వేళ కవిత గైర్హాజరు.. విభేదాలే కారణమా?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ అధికారికంగా ప్రకటన చేసిన వేళ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్సీ కవిత గైర్హాజరయ్యారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు సహా 283 మంది ప్రతినిధులు హాజరైనా కవిత మాత్రం సమావేశానికి హాజరు కాలేదు. అంతేకాదు మునుగోడు ఉప ఎన్నిక కోసం ప్రకటించిన ఇంఛార్జ్‌ల జాబితాలోనూ కవిత పేరు లేదు. అయితే తాను ఇంట్లో ఆయుధ పూజ చేసుకుంటున్నట్లుగా కవిత సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.






2001 ఏప్రిల్ 27న టీఆర్‌ఎస్‌ను కేసీఆర్ ప్రకటించారు. ఆ రోజు ఆయన పెద్ద సంఖ్యలో తెలంగాణ ఉద్యమకారులతో తన సొంతూరు చింతమడక నుంచి హైదరాబాద్ వచ్చారు. పెద్ద సంఖ్యలో హైదరాబాద్ చేరుకున్న కేసీఆర్.. నాంపల్లి దర్గా నుంచి తన ఉద్యమ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. అసెంబ్లీ ముందు ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. అక్కడి నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసానికి కేసీఆర్ వెళ్లారు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ను ప్రకటించారు. ఇదిగో ఇప్పుడు సరిగ్గా 21 ఏళ్ల టీఆర్‌ఎస్ ప్రస్థానం తర్వాత ఆ పార్టీ జాతీయ పార్టీగా రూపాంతరం చెందింది. ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా ఏర్పాటైన టీఆర్‌ఎస్ ఇప్పుడు బీఆర్‌ఎస్‌గా మారి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది.






వాస్తవానికి తెలంగాణ భవన్‌లో నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో తొలుత టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రవేశపెట్టారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు బలపర్చారు. ఈ తీర్మానాన్ని కేసీఆర్ ఆమోదించారు. కొత్త పార్టీ బీఆర్‌ఎస్‌ను కేసీఆర్‌ అధికారికంగా ప్రకటించారు. జాతీయ పార్టీ జెండా, ఎజెండాపై తమ పార్టీ నేతలకు కేసీఆర్ వివరించారు. 



కవిత గైర్హాజరుపై ఊహాగానాలు మొదలయ్యాయి. కుటుంబంలో విభేదాలున్నాయేమోననే ప్రచారం జరుగుతోంది. సర్వ సభ్య సమావేశానికి మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, హరీశ్ రావు కూడా హాజరయ్యారు. కవిత మాత్రమే గైర్హాజరు కావడంపై ప్రతిపక్ష నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.         

Updated Date - 2022-10-07T01:16:09+05:30 IST