కవీంద్రుడు, కర్మవీరుడు

ABN , First Publish Date - 2022-08-05T10:11:11+05:30 IST

రవీంద్రుడు, మహాత్ముడి మధ్య అనుబంధం ‘ఒక ఉమ్మడి ధ్యేయానికీ, సౌభ్రాతృత్వానికీ సంబంధించిన మహత్తర ఆధ్యాత్మిక బంధం’ అని దత్తాత్రేయ బాలకృష్ణ కాలేల్కర్...

కవీంద్రుడు, కర్మవీరుడు

రవీంద్రుడు, మహాత్ముడి మధ్య అనుబంధం ‘ఒక ఉమ్మడి ధ్యేయానికీ, సౌభ్రాతృత్వానికీ సంబంధించిన మహత్తర ఆధ్యాత్మిక బంధం’ అని దత్తాత్రేయ బాలకృష్ణ కాలేల్కర్ (1885–1981) అభివర్ణించారు. మహారాష్ట్రీయుడు అయినప్పటికీ గుజరాతీ, హిందీ, మరాఠీ సాహిత్యాలలో ఉత్తమ వచన రచయితగా ఆయన సుప్రసిద్ధులు. 1953లో నెహ్రూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి బీసీ కమిషన్‌కు కాకాసాహెబ్ నేతృత్వం వహించారు.


‘ఈ ప్రస్తుత యుగంలో మనందరి మధ్యా సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తున్న మహాత్ముణ్ణి మన అగ్రజుడిగా జాతి మొత్తం అంగీకరిస్తున్న తరుణమిది’ అని టాగూర్, ‘ప్రపంచం దృష్టిలో భారతదేశాన్ని సమున్నతంగా నిలబెట్టగలిగిన కవీశ్వరుడి ప్రజ్ఞకీ, ఆయన జీవిత స్వచ్ఛతకీ ఈ దేశంలోని కోట్లాది ప్రజలతో పాటు నేను కూడా సమానంగా ఋణపడి ఉంటాను’ అని గాంధీజీ పరస్పరం గౌరవించుకున్నారు. స్వాతంత్ర్య జాగృతికాలంలో ఈ మహోన్నతుల నుంచి నాటి భారతీయ యువత స్ఫూర్తి పొందిన తీరును కాకాసాహెబ్ కాలేల్కర్ చక్కగా విశదీకరించారు. ఆయన ఇలా రాశారు:


‘‘నేనప్పట్లో, శాంతినికేతన్‌లో గౌరవ ఉపాధ్యాయుడిగా పని చేస్తూ ఉన్నాను. విద్యారంగంలో కవీశ్వరుడు చేపట్టిన మహత్తర ప్రయోగాలను అధ్యయనం చేస్తున్న ఆ రోజుల్లో, అంటే 1915 ప్రారంభంలో, దక్షిణాఫ్రికా నుండి ఫీనిక్స్ బృందం వారు శాంతినికేతన్ వచ్చినప్పుడు మొదట వారినీ, తరువాత మహాత్ముణ్ణీ నేను కలుసుకోగలిగాను. మా వంటి యువకులు మాతృభూమిని అర్థం చేసుకుని సేవించడమెట్లానో తెలియక సతమతమవుతున్న రోజుల్లో మన మాతృదేశ సాంస్కృతిక సౌందర్యం పట్లా, గాఢత పట్లా, సనాతనత్వం పట్లా మా కళ్లు తెరిపించింది రవీంద్ర కవీంద్రుడే. నిరంతరం నిరర్థకమైన అవమానాల తాకిడికి గురవుతూ వస్తున్నా కూడా ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోకుండా హుందాగా మసలడమెట్లానో ఆయనే నేర్పారు. మొత్తం భారతదేశమంతా వంగ భూమికి శాశ్వతంగా ఋణపడి ఉంటుంది. ఎందుకంటే భారతమాతను అర్థం చేసుకోవటానికీ, ఆమె సేవకు మనల్ని అంకితం చేసుకోవటానికీ మనకు స్వామి వివేకానందులు, శ్రీ అరవిందులు, రవీంద్ర గురుదేవుల ద్వారా తోవ చూపించింది వంగ దేశమే. వారి ద్వారానే మనం రాజారామమోహన్ రాయ్, కేశవ చంద్రసేన్, రామకృష్ణ పరమహంస వంటి ఎందరో ఉదాత్త దేశభక్తుల గురించీ, బెంగాల్‌కు చెందిన సాధు సత్పురుషుల గురించీ తెలుసుకోగలిగాం. బేలూరు మఠమూ, శాంతి నికేతనమూ, పాండిచ్చేరి నవ భారతదేశపు నవీన పుణ్యక్షేత్రాలు. శ్రీలంకకు చెందిన ఆనంద కుమారస్వామి, పంజాబ్‌కు చెందిన లాలా హరదయాళ్, ఉత్తమ ఇంగ్లీషు వనిత సోదరి నివేదితలు భారతీయ వారసత్వం గురించి మనకు తెలియపర్చారు. శ్రీమతి అనిబిసెంట్, బాబూ భగవాన్‌దాస్‌ల మహత్తర రచనలు ఎలానూ ఉండనే ఉన్నాయి. జస్టిస్ రనడే, డా.భండార్కర్, లోకమాన్య తిలక్‌లు మాతృభూమి పట్ల మన సేవా తత్పరతకు పునాది వేశారు. లాలాలజపతి రాయ్, బాల గంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్ త్రిమూర్తులై మనలో దేశభక్తిని ఉద్దీపనం చేశారు. లాల్–బాల్–పాల్‌గా పిలవబడ్డ ఈ ముగ్గురి చిత్రపటాలు ప్రతి కళాశాల విద్యార్థి ఇంటి గోడమీద దర్శనమిచ్చేవి. అప్పుడు మేమొక స్వప్నలోకంలో జీవించామని చెప్పవచ్చు. బెంగాల్ విభజనకు ప్రతిస్పందనగా బ్రిటిష్ వస్త్ర బహిష్కరణకై స్వదేశీ మహోద్యమం పిలుపునిచ్చింది. యువత ఉద్విగ్నభరితమయింది. దేశం తన లోపలికి చూపు సారించి తననుతాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అంతవరకు ఊహించడానికి వీలులేని సాంద్రశక్తితోనూ, ఆత్మ బలిదానంతోనూ భారతీయాత్మ ఎక్కడో సుదూరంలో దక్షిణాఫ్రికాలో నవీన రూపంలో అభివ్యక్తమవుతూ ఉంది. సాక్షాత్తూ భగవంతుడే విస్మరించిన ఆ సుదూర దేశంలో శ్వేతజాతీయుల అణచివేత నుండి భారతీయులను బయటపడేయడానికి కొన్ని వేల మంది భారతీయ శ్రామికులతో మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఒక అహింసాయుత పోరాటం చేపట్టారు. నిరక్షరాస్యులూ, అశిక్షితులూ అయిన కొద్దిమంది కార్యకర్తలతో ఆ కర్మవీరుడు చేపట్టిన పోరాటం వైపు అందరి దృష్టీ మళ్లింది.


1909లో నేను మరాఠీ దినపత్రిక ‘రాష్ట్రమత్’లో పనిచేస్తున్నప్పుడు మహాత్ముడి పోరాటం గురించి ఎప్పటికప్పుడు చదువుతూ వచ్చాను. మన దేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మనం చేపడుతున్న పోరాటానికి దక్షిణాఫ్రికాలో జరుగుతున్న పోరాటం ఎంతో కొంత పూరకమో లేదా ప్రత్యామ్నాయమో కాగలదని ఊహిస్తూ వచ్చాను. శాంతినికేతన్‌లో టాగూర్ విద్యా ప్రయోగాల ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని కూడా నేను అంచనా వేయగలిగాను. గురుదేవులూ, కర్మవీరుడూ కూడా నా హృదయాన్ని లోబరచుకున్నారని నా ఆత్మ గ్రహించింది. ఆ ఇద్దరి పట్లా నాకు సమాన గౌరవం ఏర్పడింది. శాంతినికేతన్‌లో మామిడి తోటలో వారిద్దరినీ కలిసినప్పుడు నా సంతోషానికి అవధుల్లేక పోయింది.


మహాత్మా గాంధీ తన సత్యాగ్రహ ఉద్యమాల ద్వారా మాతృదేశ స్వాతంత్ర్య సముపార్జనకు ఒక అవకాశాన్ని మా ముందు ఉంచినప్పుడు, శాంతి సమయ కార్యక్రమాల్ని పక్కన పెట్టి ఒక స్వాతంత్ర్య యోధునిగా పోరాటంలో ముందుకు దూకటానికి నాకెటువంటి సంకోచం లేక పోయింది. మేమే కార్యక్రమం పట్ల విధేయత చూపించాలన్న ప్రశ్న వచ్చినప్పుడు కూడా, నాకూ, నా మిత్రులకీ ఈ క్రియాశీల పోరాట కార్యక్రమమే దారి చూపించింది. కవీంద్రుణ్ని మేం ప్రేమిస్తాం, ఆరాధిస్తాం. కాని కర్మవీరుడి పోరాటాన్ని అనుసరిస్తాం’’.

Updated Date - 2022-08-05T10:11:11+05:30 IST