Abn logo
Sep 27 2021 @ 00:14AM

అమ్ముడుపోతున్నారా?

ప్రభుత్వాలు కవులను కొనేస్తున్నాయన్న కవి నిఖిలేశ్వర్‌ వ్యాఖ్యలతో కవికి రాజ్యానికి, కవికి సత్కారానికి మధ్య సంబంధం మరోమారు చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ఈ అంశాలపై పలువురు ప్రముఖ కవులు, రచయితల అభిప్రాయాలను సేకరించింది ‘వివిధ’. 


కవులూ రచయితలూ అమ్ముడుపోతున్నారు!

‘‘కవికి ఒక క్రియాశీలత, ఏక్టివిజం అవసరం అని నమ్ముతాను. ఈనాడు అది మరింత అవసరం. కానీ దౌర్భాగ్య స్థితి ఏమిటంటే- ఈనాడు రచయితలూ కవులూ విభజించబడ్డారు, తప్పిపోతు న్నారు. ...ఇలాంటివాళ్లకి కొదవ లేదు తెలంగాణలో. సగమంది అమ్ముడుపో యారు. ఆంధ్రలో కూడా మొదలైంది. జగన్మోహన్‌రెడ్డిగారు కూడా ఆ కోవలోకి వచ్చేశాడు. కేసీఆర్‌గారు చాలా తెలివైన వాడు. సంస్కృతినీ భాషనీ నేను కొనేయగలను అనుకున్నాడు. తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ భాష, ప్రాంతీయత... వీటన్నింటినీ ఆయన ప్రజల్లోకి బాగా తీసుకు రాగలిగాడు. ఆ తర్వాత తెలంగాణ సాహిత్య అకాడమీ స్థాపించి, ఉత్సవాలు జరిపి, ఎవరు ఏమాత్రం కవిత రాసినా ఒక శాలువా కప్పి వెయ్యి రూపాయలు చేతిలో పెట్టి పంపించేయడం. ఈ కవులకు కొదవ లేదు. వందలాదిమంది కవితలు రాసేస్తుంటారు అక్కడ. 1960-70 మధ్య, ఆనాడు పరిస్థితి ఇంత ఘోరంగా లేదు.’’ 


(సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన సందర్భంగా నిఖిలేశ్వర్‌కు ఢిల్లీ ఆంధ్రా అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన అభినందన సభలో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలివి.)

నిఖిలేశ్వర్‌

నిరసన గళంగా మొదలై చివరికి...


వ్యవస్థలన్నీ శిథిలమవుతున్న దశలో దిగంబర కవులుగా మేం ప్రశ్నలు సంధిస్తూ రాయటం మొదలుపెట్టాం. మాతోపాటు నిరసన గళంగా వెంట నడిచిన నిఖిలేశ్వర్‌ నేడు ఇలా ప్రభుత్వాల నుంచి అవార్డులు తీసుకోవటాన్ని ప్రజలు అంగీకరిస్తారనుకోను. మిత్రులో, సాహిత్యవేత్తలో, సమాజంలో సాహిత్యం పట్ల గౌరవం ఉన్నవారో ఇచ్చే అవార్డులు వేరు. కానీ ప్రభుత్వం ఇచ్చే అవార్డులు వేటికీ మన దేశంలో గౌరవం లేదు. ప్రజలంటే పట్టని, సాహిత్యం గురించి ఏమీ తెలియని ఈ ప్రభుత్వాల తరఫు నుంచి వచ్చే అవార్డులకు ఏం విలువ ఉంటుంది. నిఖిలేశ్వర్‌ తన అభిప్రాయాలను మార్చుకుని ఈ అవార్డులు తీసుకోవటానికి సంసిద్ధమైతే అది ఆయన వైయక్తికం. దిగంబర కవిగా చాలాకాలం కృషి చేసినవాడు కనుక ఇలాంటి అవార్డులకు అర్హుడే కూడా. కానీ తాను స్వయంగా ప్రభుత్వంనుంచి అవార్డులు తీసుకుంటున్నప్పుడు ఇతరుల్ని ప్రభుత్వాలకు అమ్ముడుపోతున్నారని విమర్శించే అర్హత కోల్పోతాడు కదా. 

నగ్నముని

అన్ని సార్లూ అమ్ముడుబోవడమే కానక్కరలేదు


రాజ్యం ఎప్పుడూ కవిని కబళించాలనే చూస్తుంది. చిక్కడమా చిక్కకపోవడమా అన్నది కవి ఇచ్ఛ. ప్రజాస్వామ్యం అత్యున్నత పాలనా విధానం అనుకున్నపుడు రాజ్యం ఇచ్చే పదవుల్నీ, రాజ్యం పోషించే సంస్థలు ఇచ్చే బహుమతుల్నీ అంగీకరించి కూడా కవి స్వేచ్ఛగానే ఉండొచ్చు. ప్రభుత్వాలు కవిని తమలో కలిపేసుకోవడానికే ప్రయత్నిస్తాయి. కవి కలిసి కూడా విడిపోయి ఉండొచ్చు. లొంగిపోవడం ప్రశ్నించలేకపోవడం కవి బలహీనత. వీటిని అధిగమించిన కవులూ రచయితలూ అన్ని చోట్లా ఉన్నట్లే తెలుగులోనూ ఉన్నారు. తనను ధిక్కరించగలడనుకున్న కవికి రాజ్యం ముందు గానే వల వేస్తుంది. ప్రజాభిప్రాయాన్ని మార్చగల శక్తివంతమైన వాగ్గేయకారులకు ఆ ప్రమాదం మరింత పొంచి ఉంటుంది. నిజానికి ఒక poetని acknowledged legislatorగా మార్చడం ద్వారా రాజ్యం తన ఉచ్చును తనే బిగించుకునే అవకాశం ఉంది. దెబ్బతినే అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోనూ దెబ్బతీసే అవకాశం కూడా ఉంటుంది. అంటే కత్తితో వేటు వెయ్యాలంటే తాను కూడా కత్తి వేటుకు గురయ్యేంత దగ్గరకు వెళ్లాల్సిందే. కవిని శాసనసభ్యుణ్ణి చేసి నోరు నొక్కాలనుకుంటే నోరు నొక్కుతున్నప్పుడు చేసే ధిక్కార ప్రతిఘటనా స్వరం మరింత బిగ్గరగా భిన్నంగా వినిపిస్తుంది. అప్పుడు ప్రభావాలూ పర్యవసానాలూ అన్నీ ద్విగుణం, బహుళమే. అయితే ఇదంతా కవి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. రాజ్యాన్ని నిందించి లాభం లేదు. రాజ్య స్వభావమే అంత. 


కవిని మెచ్చి ప్రభుత్వం పది లక్షల నజరానా ఇస్తే తీసుకోకపోతే ఇంకెవరో తెచ్చి ఇవ్వరు. అయితే పుచ్చుకున్నాక కవి లేదా రచయిత తన స్వేచ్ఛను నిలబెట్టుకు న్నారా అన్నది ప్రశ్న. కవిది ఎప్పుడూ ప్రతిపక్షమే, ప్రజాపక్షమే. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికీ, ప్రతిపక్షానికీ ప్రజాహితం అనే ఒకే లక్ష్యం ఉంటుంది, ఉండాలి. అదే కవి లక్ష్యం కూడా. కవి, ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని నెత్తికెత్తుకునే పార్టీ కార్యకర్త కానీ, విమర్శించే ప్రత్యర్థి కానీ కాదు. కవి ప్రజాస్వామ్య పరిరక్షకుడు. నిరంకుశ పోకడల్ని పసికట్టాల్సిన గూఢచారి. లౌకికత్వ కాపరి. మౌలికంగా సామ్యవాది. అంతే కానీ, ప్రభుత్వానికీ ప్రతిపక్షానికీ నిత్యం జరిగే కీచులాటల్లో తల దూర్చడు. పదవులూ, నగదు బహుమతులూ స్వీకరించడం అన్ని సార్లూ ప్రభుత్వానికి అమ్ముడుబోవడం కానక్కరలేదు. కానీ ప్రభుత్వం నుంచి ప్రయో జనాలు పొందే కవులకు నిఖిలేశ్వర్‌ వ్యాఖ్యలు హెచ్చరికలు. వాటిల్లో సత్యం లేదని నిరూపించాల్సిన బాధ్యత వారి మీద ఎప్పటికీ మిగిలే ఉంటుంది. 

కొప్పర్తి వెంకటరమణమూర్తి

మన కీర్తి కోసం మందిని చులకన చేయటం మంచిది కాదు


అవార్డు తీసుకుంటూనే అందరి మీదా రాళ్లు రువ్వటం అనైతికం. అకాడమీలను ‘అగాధమీ’ లని ద్వేషించిన కవిత్వ ప్రతినిధి అకాడమీ అవార్డు ధరించటం కాలపరిణామానికి సంకేతం. పైగా- అకాడమీ స్వతంత్ర సంస్థ అని సమర్థించుకోవటం అవార్డు పట్ల కవి మోహానికి గుర్తు. అప్పటివరకు ఏమోగానీ- మోదీ ప్రభుత్వం ఆ ముసుగు కూడా తొలగించి అకాడమీకి ముందు ‘సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం’ అని స్పష్టంగా ముద్రించుకుంటున్న దశ. ఎందరో ప్రజాస్వామికవాదులను, రచయిత లను గొంతులు తీయించో, మూయించో అణచివేస్తున్న స్థితి. రాష్ట్రాల, ప్రజల అస్తిత్వాల్ని, హక్కుల్ని హరిస్తూ సాగుతున్న కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి. అవార్డు వాపసీ దృశ్యాలు. ఇవేవీ పట్టించుకోకుండా అవార్డు గ్రహీత స్థానీయ రచయితల్ని అవమానించటం దేనికి సంకేతం? సంచలనాల కోసమే అయితే విలువలు వికసించవు. కవిత్వం బతుకదు. మన కీర్తి కోసం మందిని చులకన చేయటం మంచిది కాదు. 

నందిని సిధారెడ్డి

సాహిత్యాచరణే అన్నిటికీ ప్రమాణం


సంక్లిష్ట సామాజిక సందర్భాల్లో రచయితలు ఎక్కడ నిలబడాలో తేల్చుకోగ లిగితే ప్రభుత్వ (ప్రభుత్వేతర) అవార్డుల విషయంలో సందిగ్ధత ఉండదనుకుం టాను. ‘రచయితల కొనుగోలు’ అనేది ప్రభుత్వాలకు ప్రధాన విషయం కాదు. వాటి ప్రాథమ్యాలు వేరుగా ఉంటాయి. రచయితల పట్ల గౌరవంతోనో, కళా పోషకులుగా కనపడాలనో, మరేదో కారణం చేతనో ప్రభుత్వాలు అవార్డులు ప్రకటిస్తుంటాయి. వాటిని తీసుకో వటం, తీసుకోకపోవటం రచయితల వ్యక్తిగత విషయం. తీసుకోగానే అమ్ముడుపోయినట్టో, పోనట్టో నిర్ధారించలేం. అయితే వాటి కోసం వెంపర్లాడకుండా తమ కృషి ఏదో తాము చేసుకుంటూ పోవటమే రచయితల కర్తవ్యం. 


రచయితలు చూడాల్సింది ప్రభుత్వ పాదాలవైపు కాదు; ప్రజల వైపు, ఉత్తమ సామాజిక సంస్కృతి నిర్మాణం వైపు. ఒక పురస్కారం గ్రహించక ముందు రచయిత ఏ ప్రజాస్వామిక విలువలతో, స్వతంత్ర వ్యక్తిత్వంతో ఉన్నాడో, లేదా ఉన్నట్టు తన రచనల ద్వారా ప్రకటిస్తున్నాడో, ఆ తర్వాత కూడా అవే విలువలతో, స్వతంత్ర వ్యక్తిత్వంతో నిలవాలని భావిస్తాను. సాహిత్యాచరణే అన్నిటికీ ప్రమాణం. 

పాపినేని శివశంకర్‌

గుర్తింపును కొనడంగా అర్థం చేసుకుంటే ఏం చేయలేను!


కవిత్వానికి బహుముఖ పార్శ్వాలున్నవి. ప్రకృతి ఉన్నది, జీవితాంతరాలు ఉంటై, దుఃఖం ఉంటది. మానవుడిని ఉన్నత మానవుడిగా సంస్కరిం చేందుకు కవిత్వం ఉపయోగపడుతుంది. పట్టు పురుగు సహజంగానే దారాన్ని సృష్టించినట్టు, మిణుగురు వెలుగును ప్రసరించినట్టు, బింగన్న రెక్కలతో నాదాన్ని వినిపించినట్టు, కవి తన స్వాభావిక స్వప్న జగత్తులో నుండి సృజనను లోకానికి అందిస్తాడు. అదే కవి ఉనికి. దానికి ఏ తూకం లేదు. కవుల సృజన ఉత్పత్తి కాదు కొనటానికి. కవులను కొనాల్సిన అవసరం కేసీఆర్‌కు లేదు. పాట ద్వారా, ఆట ద్వారా, ధూమ్‌ధామ్‌ ద్వారా పదేళ్లపాటు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో కలిసి నడిచాను. 2001 నుంచీ ఇతర ప్రజాస్వామిక ఉద్యమాలతోపాటు కేసీఆర్‌తో నాకు అనుబంధం ఉంది. కేసీఆర్‌లో ఒక ఉద్యమ కారుడు, ప్రజానాయకుడే కాదు, గొప్ప సాహిత్య అభినివేశి కూడా ఉన్నాడు. 


సాంప్రదాయ కవుల వందలాది పద్యాలను కేసీఆర్‌ నోటి వెంట విన్నాం. అందుకే ఆయనతో మైత్రి కుదిరింది. ‘‘సాహిత్య అభినివేశం ఉన్నవాళ్లు ప్రభుత్వంలో ఉంటే ఆ పాలనా దక్షత బాగుం టుంది’’ అని అన్నాడు జె.పి.గిల్‌. కేసీఆర్‌ పాలకుడే కాదు, తెలంగాణ సంస్కృతిని పునరుజ్జీవింప చేయగల సత్తావున్న నాయకుడు. కవులు రచయితలంటే ఆయనకు అపారమైన వాత్సల్యం. అందుకనే మొట్టమొదటిసారిగా తెలంగాణ సాహిత్య అకాడెమీని ఏర్పాటు చేసినారు. మొట్టమొదటిసారిగా అభ్యుదయ, ప్రజాస్వామిక భావాలున్న కవులను, రచయితలను తన ప్రభుత్వంలో భాగస్వాములను చేశారు. గత ప్రభుత్వంలో ఎపుడన్నా కాళోజీ పేరుతో, దాశరథి పేరుతో, భాగ్యరెడ్డివర్మ పేరుతో, సురవరం ప్రతాపరెడ్డి పేరుతో అవార్డులున్నయా? తెలంగాణ వచ్చినాకనే కదా కవులకు గుర్తింపు? ఇదివరకూ జాషువా, వానమామలై వరదాచార్యులు, విశ్వనాథ సత్యనారాయణల వంటి పద్య కవులకు లభించిన గుర్తింపు, నేడు ప్రజాసాహిత్య పరంపరలో నడిచిన నాకు లభించింది. ఇలా గుర్తించడం కేసీఆర్‌ గొప్పదనం. దాన్ని కొనడంగా అర్థం చేసుకుంటే నేనేం చేయలేను. ‘‘కవులు అనధికార శాసనకర్తలు’’ అన్నాడు పిబి షెల్లీ. మరి ‘‘అధికార శాసనకర్తలు’’గా ఉండే అవకాశం వచ్చినప్పుడు ఏమన్నా మనవల్ల జరిగే మంచి ఉంటే చేస్తాం కదా, చెప్తాం కదా. జావేద్‌ అక్తర్‌ లాంటి గొప్ప కవులు రాజకీయాల్లో ఉన్నారు కదా. కర్ణాటకలో రెండుసార్లు విధానమండలి సభ్యుడైన సిద్ధ లింగయ్య పీడితుల తరఫున ప్రజా కవిత్వం రాశారు. నిఖిలేశ్వర్‌కు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినప్పుడు శుభా కాంక్షలు తెలిపినవాళ్లలో నేను కూడా ఒకడినే. నాదైన అంతర్ముఖ ప్రపంచమే నాది. వ్యక్తిగతంగా ఎవరిపైనా నిందలు, అభియోగాలు మోపే స్వభావం నాకు లేదు. అంత పెద్దాయన అలా మాట్లాడటం.. వారి వివేకానికే వదిలి పెడ్తాను.

గోరటి వెంకన్న

ప్రశ్నలు పాతవే - సమాధానాలే కొత్తగా లేవు


నాకు వచ్చిన అవార్డు మినహా మిగతావన్నీ పైరవీలతో వచ్చినవే అనే మాటను తెలుగు సాహిత్య సమాజంలో ఒక సెటైర్‌గా వింటూనే ఉన్నాం. రచయితలను పాలకులు కొంటున్నారు అనే నిఖిలేశ్వర్‌ వాఖ్యలు సాహితీ లోకానికి కొత్తకాదు. ఇదే బీజేపీ పాలనలో పెరుగుతున్న అసహనాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో చాలా మంది రచయితలు అకాడెమీ అవార్డులని తిరిగి ఇచ్చేశారు. నిఖిలేశ్వర్‌కి అవార్డు వచ్చేనాటికి ఆ అసహనం ఫాసిజం అనదగిన స్థాయికి చేరింది. విరసం సభ్యులపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నిర్బంధానికి నిరసనగా సంస్థ సభ్యుడిగా ‘యజ్ఞం’ కథకు వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించిన కారా బయటకి వచ్చిన తర్వాత అదే కథతో పాటు తొమ్మిది కథలకు కలిపి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందు కున్నాడు. రాష్ట్ర సాహిత్య అకాడమీకి లేని స్వయంప్రతిపత్తి కేంద్ర సాహిత్య అకాడెమీకి ఏముందో అందుకున్నవాళ్లకే తెలియలి. పదవు లైనా, అవార్డులయినా రచయితల గొంతులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకే అనుకున్నప్పుడు, ప్రభుత్వం లేదా ‘స్వయంప్రతిపత్తి’ కలిగిన అకాడెమీలు ఇచ్చే అవార్డులలో పైరవీ ఉంటుందా, ఉండదా అనే చర్చ అనవసరం. ఆ ప్రశ్నకు సమాధానం సాహితీ సమాజం ఎరుగును.


ఒక రచనకు, రచయితకు గీటురాయి పాఠకుల ఆదరణ తప్ప అవార్డు కాదు. అవార్డులు రాని, అవార్డులని తిరస్కరించిన రచయితల రచనలూ ఉన్నాయి. నోబెల్‌ లిటెరరీ అవార్డుల్లోనూ యూరప్‌ వైట్‌ సెంట్రిక్‌ రాజకీయాలు ఉన్నాయి అనే వాదనలు బలంగా వినబడుతున్న చోట అవార్డు కమిటీల స్వయం ప్రతిపత్తి కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత ఉత్తమం. అయితే, ఎప్పుడో చుక్క రాలిపడ్డట్టు మాకు వచ్చే అవార్డులనూ తిరిగి ఇచ్చేయమంటే ఎలా అని పీడిత సమూహాలు అడిగితే ఆ ప్రశ్నను తోసిపుచ్చలేం. 


పోంగ మిగిలినోడే పెద్దకొడుకు అన్నట్లుగా ఉన్నవాళ్ళని కలుపుకుపోవడమే. అయితే, తమలో ఈర్ష్య ద్వేషాలను వొదిలి రచయితలు అంతా ఒక్కటై పాలకులకు వ్యతిరేకంగా గొంతు విప్పుతారా అనేది ఇప్పుడు రచయితల ముందున్న ప్రశ్న.

అరుణాంక్‌ లత

అమ్ముడుపోవడం ఒకసారితో ఆగదు


కవులు కళాకారులు ప్రజాపక్షం వహించాలి, కమ్యూనిస్ట్‌ సర్కారీ వచ్చినాసరే ప్రతిపక్షం వహించాలి. ఇది ఒక విలువ. దాన్ని ఎప్పుడో తుంగలో తొక్కేసి ప్రభుత్వం కోసమే కలం పట్టినవారు, గజ్జెకట్టినవారు తయారయిన చోట దేన్ని మాత్రం ఆశించగలం? ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ ఇలానే వుంది. అయి దేళ్ళ వుండి పోయే ప్రభుత్వం విదిలించే తాయిలాలకోసం ఏళ్ల తరబడి పోగు చేసు కున్న అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని అవలీలగా వదులుకుంటున్నారు. సాహిత్య వస్తువులు, వ్యక్తీకరణలు దిశనే మార్చుకుంటున్నాయి. ఈ అమ్ముడుపోవడం ఒక సారితో ఆగదు. ఎన్ని ప్రభుత్వాలు మారితే అన్నిసార్లు అమ్ముడుపోతూనే వుంటారు.

కొండేపూడి నిర్మల

కవీ! చరిత్రలో నీ స్థానం ప్రజలు నిర్ణయిస్తారు


శ్రీకాకుళ ఉద్యమ నేపథ్యంలో కవుల నిబద్ధత నిమగ్నత లాంటి చర్చలు మొదల య్యాయి. కవులు ఎవరి పక్షం ఉండాలో, కవిత్వం అంతిమ లక్ష్యం ఏమిటో, పాలక వర్గం పట్ల ఏ అవగాహన ఉండాలో, రాజ్య కనుసన్నల్లో నడిచే సాహిత్య అకాడమీ ఇస్తున్న పురస్కారాల పట్ల ఎటువంటి వైఖరితో ఉండాలో ఒక అవ గాహన స్థిరపడింది. పురస్కారాలను సన్మానాలను ధిక్కరించినవారిపై కత్తిగట్టిన రక్తసిక్తమైన సంక్షోభాలు చరిత్రలో నమోదయ్యే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మాట్లాడుకోవాలసిన అవసరం లేదు. కాకుంటే ఇటీవల ఒకనాటి దిగంబర కవి నిఖిలేశ్వర్‌ కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు అభినందన సభలో- కవులు పదవులకు, అధికారానికి అమ్ముడుపోతున్నారనీ పాలకులు కవులను కొనేస్తు న్నారనీ అన్నారు. ఈ దుస్థితి ఇప్పటిది కాదు. ఉన్మత్త ఉద్వేగంలో ఒక నాడు జనాలను ఉర్రూతలూగించిన సూక్తులనే ఎలకల్లా కొరికేసుకున్న కవులు ఇవ్వాళే కాదు, రాజరికం భూస్వామ్య యుగాలు దాటి అర్ధవలస అర్ధభూస్వామ్య కాలం దాకా ఉన్నారు.


నిక్కచ్చిగా ఉన్నామని చెప్పుకునే, నిబద్ధత లాంటి ప్రవచనాలు వల్లించే సంఘాలే తమ తమ కోటరీ, కుల, సామాజిక అవసరాల ప్రకారం మాత్రమే మాట్లాడే ఊదాసీన వైఖరి ఇప్పటిది కాదు. దాని మూలాలు ఇరవై సూత్రాలకు చిలక పలుకులు పలికిన నాటి నుండే ఉన్నాయి. అవి ‘నిదురించే శవాలను వీపు తట్టి లేపాయి’. ఒకవైపు కవులు, కళాకారులు, ప్రజానాయకుల మీద దమన నీతిని కొనసాగిస్తున్న ఫాసిస్టు పాలకులు ఇచ్చిన పురస్కారాలను ఎందరో తిరిగి ఇచ్చేస్తుంటే నిఖిలేశ్వర్‌ అవార్డు తీసుకుని మరీ అమ్మకపు విలువల గురించి మాట్లాడడం వంచన తప్ప మరేమీ కాదు. విషాదం ఏమిటంటే అది శ్రీశ్రీతో మొదలు కాలేదు గోరటి, నిఖిలేశ్వర్‌తో అంతం కాబోదు. 


‘చరిత్ర నిద్రా సముద్రం మీద తుఫానులా’ వచ్చారు దిగంబర కవులు, కసితో స్వార్థం శిరస్సును గండ్ర గొడ్డలితో నరికి ప్రజలను సాయుధం చేసిన వాళ్ళు విప్లవ కవులు. శంభూకుని హత్యకూ, ఏకలవ్యుని బొటనవేలుకూ కారణం కులమే అన్న కవులు ఈ విషమ పరీక్షను ఎదుర్కొన్నారు. అందులో కాసుల కక్కుర్తితో జన గీతాన్ని తన భుక్తి కోసం వాడుకుంటున్న వాగ్గేయ పరంపర ఉంది. ప్రజా విముక్తి కోసం రాయాల్సిన కవితలను జనుల కుత్తుకలు తెంపిన కంటకుల ప్రాపకం కోసం అమ్ముకున్న కవులున్నారు. వీరెవ్వరూ చరిత్ర గమనానికి గులక రాళ్ళు తప్ప పారే సెలయేరు ఎప్పటికీ కాలేరు.


పోరాటాల పునాదిగా ఏర్పడ్డ తెలంగాణా పాట ఇప్పుడు గోసి గొంగడి వదిలి గడీల కీర్తనలు మొదలుపెట్టింది. దోపిడీ పీడన గుర్తెరిగిన బుద్ధిజీవులు కాసులకు తక్కెడలో ఒదిగిపోయారు. ఒక నాటి ఉద్యమ కీర్తి ఇప్పుడు స్వీయ అస్తిత్వానికి పెట్టుబడి అయ్యింది. ఏ రోటి కాడ పాట ఆ రోటి కాడ పాడడం ఇప్పుడు కవులకు అదనపు అర్హత అయ్యింది. కాలానికి దివిటీలా ఉండాల్సిన కవీ... నువ్వు ప్రజల పక్షం ఉంటావా? హంతక పాలక కరస్పర్శ కోరుకుంటావా? దీని ఆధారంగానే రేపటి చరిత్రలోను, సంస్కృతిలోను నీ స్థానం నిర్ధారించబడుతుంది.

గుఱ్ఱం సీతారాములు

ప్రజల కన్నా ప్రచారం ముఖ్యమైపోయింది!


నిఖిలేశ్వర్‌ గారు సాహిత్య అకాడమీ అవార్డు స్వీకరిస్తూ ‘‘కవులు అవార్డుల కొరకు పాకులాడుతున్నారు’’ అన్నారు. ఈ మాట పూర్తిగా నిజం. చాలామంది కవులు కీర్తి కాముకులు. ఒక పుస్తకం రాయగానే తానొక ప్రముఖ కవిననుకొంటారు. ఫేస్‌బుక్‌లోను, వాట్సాప్‌లోను కవితలు పెట్టి ప్రచారం చేసు కొంటున్నారు. అంతేగానీ ప్రజలపక్షాన నిలచి అక్షరాన్ని ఆయుధంగా మలచుకోవడం లేదు. కవులెప్పుడూ రెండు పక్షాలు. ప్రజల పక్షాన నిలిచే ప్రజాకవులు, పాలకుల అనుగ్రహం కోసం పాకులాడే ప్రభుత్వం కవులు. పూర్వ కాలంలో పోతన, ధూర్జటి లాంటి కవులు తమ కావ్యాలను రాజులకు అంకితమివ్వ కుండా ‘రాజుల్మత్తుల్‌’ అని పొలందున్ని ఆత్మగౌరవంగా బతుకుతామని రాజుల అహంకారాన్ని ధిక్కరించారు. నియం తృత్వం, హింస నిండిన నేటి ప్రపంచంలో, ప్రజాస్వామ్యం కరువైపోతున్న పరిస్థితుల్లో కవి తన కలాన్ని పదును పరుచుకొని ప్రజల్లో చైతన్యం కలిగించేలా ధిక్కార స్వరమై నిలవాలి. ఈనాడు ప్రపంచమంతా స్త్రీలపై హింస పెరిగిపోతున్నది. మూడేళ్ల పసిమొగ్గ నుంచి ముడుతలు పడ్డ ముసలివగ్గు వరకు అత్యాచారాలకు గురి అవుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో స్త్రీల చదువులపై వస్త్రధారణపై అనేక నిషేధాలు నియమాలు విధిస్తున్నారు. బలహీనులపై బలవంతుల పట్టు కొనసాగుతూనే ఉంది. ప్రశ్నించిన కవులపై నిఘా ఎక్కువవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కవులు మరింత జాగరూకులై ఉండాలి.

మందరపు హైమవతి