రూ.35 కోట్లతో కావేరీ సీడ్స్‌ పరిశోధన కేంద్రం

ABN , First Publish Date - 2021-11-28T08:03:49+05:30 IST

కావేరీ సీడ్స్‌... రూ.35-40 కోట్లతో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. వచ్చే ఒకటి, రెండేళ్లలో ఈ పెట్టుబడులు పెట్టనుంది.

రూ.35 కోట్లతో కావేరీ సీడ్స్‌ పరిశోధన కేంద్రం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కావేరీ సీడ్స్‌... రూ.35-40 కోట్లతో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. వచ్చే ఒకటి, రెండేళ్లలో ఈ పెట్టుబడులు పెట్టనుంది. ఎగుమతులపై దృష్టి కేంద్రీకరించనున్నామని.. సమీప భవిష్యత్తులోనే ఎగుమతుల నుంచి గణనీయమైన ఆదాయం రానుందని కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే మొత్తం ఆదాయంలో నాన్‌ కాటన్‌ విత్తనాల ఆదాయం 60 శాతానికి చేరిందని, భవిష్యత్తులో ఇది మరింత పెరగనుందని పేర్కొంది. మార్జిన్లను పెంచుకోవడానికి పత్తి విత్తనాల విక్రయాల నుంచి క్రమంగా ఇతర విత్తనాల విక్రయాలలోకి మారాలని, వాటి ఆదాయాన్ని పెంచుకోవాలని కావేరీ సీడ్స్‌ భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా పత్తితో పోలిస్తే అధిక మార్జిన్లు ఉండే ధాన్యం, కూరగాయల వైపు కంపెనీ మొగ్గు చూపుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో కూరగాయల విత్తనాల విక్రయాలు 17 శాతం పెరిగాయి. ఎంపిక చేసిన ధాన్యం రకాల అమ్మకాలు కూడా 15.6 శాతం పెరిగాయి. మొత్తం విక్రయాల్లో కొత్త రకం హైబ్రిడ్‌ విత్తనాల వాటా 67 శాతం నుంచి 75 శాతానికి చేరిందని కావేరీ సీడ్స్‌ వెల్లడించింది. 

Updated Date - 2021-11-28T08:03:49+05:30 IST