Flood terror: వరద కావేరి

ABN , First Publish Date - 2022-08-05T14:17:25+05:30 IST

కావేరీ నది(Kaveri river)కి వరద పోటెత్తింది. ఎగువ నుంచి వచ్చిన జలాలను దిగువకు విడుదల చేయడంతో వందలాది గ్రామాలు నీటమునిగాయి. వాగులు,

Flood terror: వరద కావేరి

- మేట్టూరు డ్యాం నుంచి నీరు విడుదల

- మునిగిన లోతట్టు ప్రాంతాలు

- 12 జిల్లాలు అతలాకుతలం

- రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు


చెన్నై, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కావేరీ నది(Kaveri river)కి వరద పోటెత్తింది. ఎగువ నుంచి వచ్చిన జలాలను దిగువకు విడుదల చేయడంతో వందలాది గ్రామాలు నీటమునిగాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. 12 జిల్లాల్లోకి నీరు ప్రవేశిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళన(Extreme anxiety) చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమంతా సహాయక చర్యలకు దిగినా, ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఆయా ప్రాంతాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

కర్ణాటకలోని కృష్ణరాజసాగర్‌, కబిని డ్యాంల నుంచి అదనపు జలాలు విడుదల చేయడంతో కావేరి(Kaveri) ఉధృతంగా ప్రవహిస్తోంది. సేలం జిల్లా మేట్టూరు డ్యామ్‌లో నీటిమట్టం ప్రమాద స్థితికి చేరుకోవడంతో నాలుగేళ్ల తర్వాత 2.05లక్షల ఘనపుటడుగుల మేర అదనపు నీటిని విడుదల చేయడంతో కావేరి పరీవాహక ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన ఆయా ప్రాంతాలను ఖాళీ చేయిస్తోంది. కావేరి పరీవాహక జిల్లాలైన సేలం, నామక్కల్‌, ఈరోడ్‌, కరూరు, తిరుచ్చి, తంజావూరు, నాగపట్టినం, తిరువారూరు, అరియలూరు, పెరంబలూరు, కడలూరు, మైలాడుదురై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సేలం జిల్లా భవానీసాగర్‌(Bhavanisagar) నుంచి విడుదలవుతున్న నీటి కారణంగా కందన్‌నగర్‌, కావేరినగర్‌, పరమేశ్వరివీధి, పళయపాళయం ప్రాంతాల్లో సంభవించిన వరదలకు 2 వేలకు పైగా గృహాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ ప్రాంతాలకు చెందిన వెయ్యిమందికి పైగా ప్రభుత్వ శిబిరాలకు తరలించారు. కావేరి వాగు జలాలు పొంగి ప్రవహించడంతో నామక్కల్‌ జిల్లా కుమారపాళయం, ఇందిరానగర్‌, కలైమగళ్‌ వీథి, మణిమేగలై వీధి తదితర ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరద నీరు ప్రవహించింది. పళ్ళిపాళయం ప్రాంతం లో 50 నివాసగృహాల్లోకి వరదనీరు చొరబడింది. ఈరోడ్‌ జిల్లాలో 200 ఇళ్లు నీట మునిగినట్లు అధికారులు ప్రకటించారు. ఇదే విధంగా తిరుచ్చి ముక్కొంబు డ్యామ్‌లో 1.40లక్షల ఘనపుటడుగుల మేర జలాలు ప్రవేశిస్తుండటంతో 55 వేల ఘనపుటడుగుల చొప్పున అదనపు జలాలు విడుదల చేస్తున్నారు. దీంతో కావేరి వాగు సమీపం ప్రాంతాల్లో వరద పరిస్థితి నెలకొంది. తిరునల్వేలి జిల్లాలోని మణిముత్తారు జలాశయంలోకి కావేరి  జలాలు ప్రవేశిస్తుండటంతో ఆ జలాశయానికి చేరువగా ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జలాశయం నుంచి అదనపు జలాలు విడుదల చేస్తుండడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కృష్ణగిరి జిల్లా దక్షిణ పెన్నానదిలో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరింది. ఆ నది నుంచి కూడా అదనపు జలాలను విడుదల చేస్తుండటంతో సమీపంలోని నాలుగు జిల్లాలకు వరద హెచ్చరికలు జారీ చేశారు. ఇదే రీతిలో పశ్చిమకనుమల ప్రాంతాల్లోని ఆళియారు, వాల్‌పారై, కాటంపారై, అప్పాఆళియారు వాగులన్నీ పొంగి ప్రవహిస్తుండడంతో ఆ ప్రాంతాల్లో నివసిస్తున్నవారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.


హొగెనేకల్‌లో...

హొగెనేకల్‌ జలపాతం వద్ద గురువారం ఉదయం నుంచి క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. గురువారం ఉదయం సెకనుకు 1.75లక్షల ఘనపుటడుగుల మేర కర్ణాటకలో విడుదలైన నీరు ఈ జలపాతంలోకి ప్రవేశిస్తోంది. హొగనేకల్‌, ఊట్టమలై(Hoganekal, Oottamalai), సత్తిరం, నాడార్‌ కొట్టాయ్‌ తదితర ప్రాంతాల్లో జనవాస ప్రాంతాల్లో వరదనీరు చొచ్చుకొచ్చింది. ఈ పరిస్థితుల్లో కావేరి వాగుకుసమీపంలో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపడుతున్నారు. సాయంత్రానికి 2.40 లక్షల ఘనపుటడుగుల చొప్పున జలపాతంలోకి నీరు ప్రవేశించడంతో చుట్టుపక్కలి ప్రాంతాలకు వరద హెచ్చరికలు జారీ చేశారు.



Updated Date - 2022-08-05T14:17:25+05:30 IST