కావటి కల నెరవేరేనా

ABN , First Publish Date - 2021-03-05T14:50:56+05:30 IST

కావటి శివనాగ మనోహర్‌నాయుడు. రెండు పదుల వయస్సులోనే నగర రాజకీయాల్లో తెరంగేట్రం చేసి ఓటమి ఎరుగని నాయకుడిగా..

కావటి కల నెరవేరేనా

రెండు దశాబ్దాలకుపైగా క్రియాశీలక పాత్ర

2019 ఎన్నికలకు ముందు మేయర్‌ పదవి ఇస్తామని హామీ

పోలింగ్‌కి ముందే మనోహర్‌ పేరుని ప్రకటిస్తుందని అనుచరుల ఎదురుచూపు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): కావటి శివనాగ మనోహర్‌నాయుడు. రెండు పదుల వయస్సులోనే నగర రాజకీయాల్లో తెరంగేట్రం చేసి ఓటమి ఎరుగని నాయకుడిగా గుర్తింపు తెచ్చుకొన్నారు. ఒకప్పుడు టీడీపీకి కంచుకోట అయిన నల్లచెరువులో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి గెలుపొందడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే యువజన కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడిగా ఎంపికై దీర్ఘకాలం కొనసాగారు. 2000, 2005లో వరుసగా రెండు సార్లు వేర్వేరు డివిజన్ల నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికై  తన సత్తా చాటారు. తొలుత ఎంపీ రాయపాటి సాంబశివరావు వర్గంలో కీలకంగా, ఆ తర్వాత 2009 సార్వత్రిక ఎన్నికలకు ముందు కన్నా లక్ష్మీనారాయణకు అండగా నిలిచారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరారు. వైసీపీలోనూ యువత విభాగానికి అధ్యక్షుడిగా నాయకత్వం వహించి ప్రతిపక్షంలో ఉండగా ఎన్నో ఆందోళనలు, నిరసనలను విజయవంతం చేశారు. కాగా 2014 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైన అనంతరం ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ ఆదేశాల మేరకు పెదకూరపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు స్వీకరించారు. అప్పటివరకు నగర రాజకీయాలకే పరిమితమైన కావటి మనోహర్‌ పెదకూరపాడు నియోజకవర్గంలో అడుగు పెట్టి గ్రామగ్రామాన పార్టీకి పునాది వేశారు. ఇంచుమించు నాలుగేళ్లు పెదకూరపాడులో పర్యటించి వైసీపీని బలోపేతం చేశారు.


2019 ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గం టిక్కెట్‌ తనదేనని భావిస్తున్న తరుణంలో సామాజిక సమీకరణల్లో టిక్కెట్‌ని అధిష్ఠానం నంబూరి శంకరరావుకు కేటాయించింది. ఆ సందర్భంలో ప్రస్తుత మునిసిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఇతర వైసీపీ నాయకులు మనోహర్‌ ఇంటికి వచ్చి పార్టీ అధికారంలోకి రాగానే నగరపాలకసంస్థ మేయర్‌ అభ్యర్థిగా టిక్కెట్‌  ఇస్తామని హామీ ఇచ్చారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంతో అక్కడ ఎంపీ వల్లభనేని బాలశౌరి గెలుపు కోసం కృషి చేశారు. అయితే ప్రస్తుతం మేయర్‌ పీఠం హామీని సీఎం జగన్‌ ఏ మేరకు అమలు చేస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎన్ని ఒత్తిడులు వచ్చినా హామీ నుంచి జగన్‌ వెనక్కు పోరన్న నమ్మకం, విశ్వాసంతో పార్టీ కార్యక్రమాల్లో కావటి చురుగ్గా పాల్గొంటూ వచ్చారు.   నగరపాలకసంస్థ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడటంతో మనోహర్‌ తాను నివాసం ఉంటున్న ప్రాంతం నుంచే ఎన్నికల బరిలోకి దిగారు. కొద్ది రోజులుగా ఆయన తను పోటీ చేస్తోన్న నియోజకవర్గంలోనే కాకుండా నగరంలో మరికొన్ని డివిజన్లలోనూ పర్యటిస్తూ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తోన్నారు. పోలింగ్‌ తేదీకి ముందే మేయర్‌ అభ్యర్థిగా తమ నాయకుడు మనోహర్‌ పేరుని అధిష్ఠానం ప్రకటిస్తుందని ఆయన అనుచరులు, వర్గీయులు ఎదురు చూస్తున్నారు.

Updated Date - 2021-03-05T14:50:56+05:30 IST