TDP Mahanadu: మహానాడులో వైసీపీపై తొడగొట్టి మరీ దుమ్మురేపిన ఈ యువతి ఎవరంటే..

ABN , First Publish Date - 2022-05-29T02:52:14+05:30 IST

టీడీపీ మహానాడుకు అనూహ్య స్పందన వచ్చింది. జనం ఉప్పెనలా తరలివచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ కీలక నేతలంతా..

TDP Mahanadu: మహానాడులో వైసీపీపై తొడగొట్టి మరీ దుమ్మురేపిన ఈ యువతి ఎవరంటే..

టీడీపీ మహానాడుకు అనూహ్య స్పందన వచ్చింది. జనం ఉప్పెనలా తరలివచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ కీలక నేతలంతా మహానాడు సక్సెస్ కావడంతో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పసుపు జెండా ఎగరడం ఖాయమని ధీమాగా ఉన్నారు. మహానాడుకు వచ్చిన స్పందన చూసి అధికార వైసీపీలో కూడా ఓటమి భయం పట్టుకుందని మహానాడు వేదికగా టీడీపీ నేతలు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తమ సత్తా ఇది అని చాటి చెప్పినట్టుగా మహానాడు సాగింది. ఈ మహానాడులో కొందరు యువ నేతలు కూడా తమ ప్రసంగాలతో కార్యకర్తల్లో జోష్ నింపారు. అలాంటి యువ నేతలిచ్చిన స్పీచుల్లో కావలి గ్రీష్మ ప్రసాద్ ప్రసంగం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వైసీపీ పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తికి, కసికి రూపం అంటూ ఉంటే గ్రీష్మలానే ఉంటుందేమో అన్నట్టుగా మహానాడులో ఆమె ప్రసంగం సాగింది.



గ్రీష్మ మైక్ అందుకుని మాట్లాడుతుంటే తెలుగు తమ్ముళ్లు ఈలలు, కేకలతో ఆమె ప్రసంగానికి జేజేలు పలికారు. తొడగొట్టి మరీ వైసీపీకి ఆమె చేసిన హెచ్చరిక తెలుగు తమ్ముళ్లలో జోష్ నింపింది. ఉద్వేగంగా సాగిన ఆమె ప్రసంగానికి తెలుగు తమ్ముళ్లు ఫిదా అయ్యారు. గ్రీష్మ ప్రసంగం తెలుగు యువతను ఉర్రూతలూగించింది. అసలు ఎవరీ యువ మహిళా నేత అని చాలా మంది గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఈమె మరెవరో కాదు. తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘ సేవలందించిన సీనియర్ నేత కె.ప్రతిభా భారతి కుమార్తె. ఉమ్మడి ఏపీకి తొలి మహిళా స్పీకర్‌గా సేవలందించిన ప్రతిభా భారతి వారసురాలిగా గ్రీష్మ 2017లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.



గెలుపోటములతో సంబంధం లేకుండా టీడీపీ ఓడినా, గెలిచినా పార్టీ కార్యక్రమాల్లో గ్రీష్మ చురుగ్గా ఉంటూ వస్తున్నారు. ఆమె సేవలను మరింతగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా గ్రీష్మను పార్టీ అధిష్టానం నియమించింది. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఆమె నియామకం జరిగిన రోజుల వ్యవధిలోనే మహానాడు జరిగింది. దీంతో.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, రాజాం నియోజకవర్గ తెలుగు తమ్ముళ్ల ఆకాంక్ష బలంగా వినిపించేలా మహానాడులో కావలి గ్రీష్మప్రసాద్ ప్రసంగించారు. ఈ యంగ్ అండ్ డైనమిక్ యువ మహిళా నేతకు సోషల్ మీడియాలో కూడా ఆదరణ ఉంది. ట్విట్టర్‌లో ఆమె చురుగ్గా ఉన్నారు. మహానాడు ఏర్పాట్లను మొదలుకుని సభ సజావుగా సాగేంతవరకూ గ్రీష్మ తన వంతు పాత్ర పోషించారు. రాజాం నుంచి ఒక యువ గళం తెలుగుదేశం పార్టీలో కీలకంగా మారబోతోందని మహానాడు రుజువు చేసింది.

Updated Date - 2022-05-29T02:52:14+05:30 IST