TRS లో చేరడానికి అసలు కారణం చెప్పిన కౌశిక్ రెడ్డి..

ABN , First Publish Date - 2021-07-20T18:23:40+05:30 IST

కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన కౌశిక్ రెడ్డి బుధవారం నాడు కారెక్కనున్నారు.

TRS లో చేరడానికి అసలు కారణం చెప్పిన కౌశిక్ రెడ్డి..

హైదరాబాద్ : కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన కౌశిక్ రెడ్డి బుధవారం నాడు కారెక్కనున్నారు. ఈ సందర్భంగా మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. అసలు కాంగ్రెస్‌కు ఎందుకు రాజీనామా చేశారు..? టీఆర్ఎస్‌లోనే ఎందుకు చేరాలనుకుంటున్నారు..? మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యక్తిత్వం ఎలాంటిది..? అనే విషయాలపై కౌశిక్ రెడ్డి మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హుజురాబాద్ ఎన్నికలను పట్టించుకోలేదని.. అందుకే తాను కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి గులాబీ కండువా కప్పుకుంటున్నట్లు కౌశిక్ స్పష్టం చేశారు.


నన్ను చంపించే ప్రయత్నం చేశారు!

మిత్రులతో చర్చించి టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నాను. అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్‌లో చేరాలని మిత్రులు, అనుచరులు, అభిమానులు కోరారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం కేసీఆర్‌గారి సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరుతున్నాను. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కూడా నేను టీఆర్ఎస్‌లో చేరడానికి కారణం. హుజురాబాద్‌లో దళిత బంధు ప్రారంభించడం చాలా సంతోషం. ఏడున్నరేళ్లు ఈటల రాజేందర్ మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. తనను తాను వ్యక్తిగతంగా అభివృద్ధి చేసుకున్నారే తప్ప ఆయన చేసిందేమీ లేదు. ఈటల తనమీద ఆరోపణలు వచ్చిన తర్వాత రాజీనామా చేసి ఆత్మగౌరవం అంటున్నారు. 2018 లో మర్రిపల్లిగూడ గ్రామంలో ఈటెల రాజేందర్ నన్ను చంపించే ప్రయత్నం చేశారు. మాజీ ఎంపీటీసీ బలరాజ్‌ను హత్యచేపించిన చరిత్ర ఈటెల రాజేందర్‌ది.. అదీ ఆయన వ్యక్తిత్వంఅని కౌశిక్ రెడ్డి చెప్పుకొచ్చారు.


టికెట్ ఇస్తారా..!?

అయితే.. కౌశిక్ టీఆర్‌ఎస్‌లో చేరితే ఉపఎన్నికలో ఆయనకు హుజురాబాద్ టికెట్ ఇస్తారా..? ఇవ్వరా..? అనే విషయం తెలియరాలేదు. కాగా.. టీఆర్ఎస్ టికెట్ ఎవరికో ఇప్పటికే తేలిపోయిందని.. అయితే కౌశిక్‌కు మాత్రం ఇవ్వట్లేదని గత వారం రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు గుప్పుమంటున్నాయి. మరోవైపు.. టీఆర్‌ఎస్‌కు అభ్యర్థే లేడని, ఈటలను ఢీకొనే సత్తా కలిగిన అభ్యర్థి ఎవరని వెదుకుతూ అధికార పార్టీ ఇతర పార్టీలవైపు చూస్తున్నదని ప్రచారం జరుగుతున్న తరుణంలో కొత్తపేరు తెరపైకి వచ్చింది. గతంలో కరీంనగర్‌ ఎస్పీగా పనిచేసిన, ప్రస్తుతం రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా ఉన్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. ఇంకా సర్వీస్‌ ఉండగానే తన ఉద్యోగానికి స్వచ్ఛందంగా సోమవారం సాయంత్రం ఆయన రాజీనామా చేసిన విషయం విదితమే.



Updated Date - 2021-07-20T18:23:40+05:30 IST