సాహిత్య విమర్శపై ప్రతి ఆదివారం అంతర్జాల ఉపన్యాస పరంపర

ABN , First Publish Date - 2020-11-21T05:41:38+05:30 IST

తెలుగులో సాహిత్య విమర్శ లేదు, సాహిత్యం వస్తున్నంత నవనవోన్మేషంగా విమర్శ రావటం లేదు అని తరచు ఆరోపణగా వినవచ్చే మాటలు ఉన్నాయి. నిజంగానే సాహిత్య విమర్శ లేదా? లేదు అంటే లేకపోవటానికి కారణాలు ఏమిటి?....

సాహిత్య విమర్శపై ప్రతి ఆదివారం అంతర్జాల ఉపన్యాస పరంపర

తెలుగులో సాహిత్య విమర్శ లేదు, సాహిత్యం వస్తున్నంత నవనవోన్మేషంగా విమర్శ రావటం లేదు అని తరచు ఆరోపణగా వినవచ్చే మాటలు ఉన్నాయి. నిజంగానే సాహిత్య విమర్శ లేదా? లేదు అంటే లేకపోవటానికి కారణాలు ఏమిటి? ఉంటే అది ఎంత? దానిని ఎంతవరకు పరిశీలిస్తున్నారు? పరిగణనలోకి తీసుకొంటున్నారు? వంటి ప్రశ్నలు ఎన్నో మనలను చుట్టుముడతాయి. సాహిత్య విమర్శ పరిణామ చరిత్ర గురించిన మదింపు సమగ్ర స్థాయిలో జరిగితే తప్ప ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. అందుకు ఎవరో ఒకరు ఎక్కడో ఒకచోట ఏదో ఒక స్థాయిలో పని ప్రారంభించటం అవసరం. అందుకే ఇప్పుడీ ప్రయత్నం. ఈ తొలి ప్రయత్నంలో మార్క్సిస్టు విమర్శ మీద దృష్టి పెట్టి పనిచేద్దామని, ఈ ప్రయోగంలో వచ్చే ఫలితాలను బట్టి ఈ నమూనాలో మిగిలిన సాహిత్య విమర్శ సిద్ధాంతాల గురించి, ధోరణుల గురించి ఇలాగే కార్యక్రమాలు రూపొందించి నడుపుకోవచ్చని భావించాం.


జిజ్ఞాసావేదిక, కాకతీయ గవర్నమెంట్ కాలేజీ, తెలుగు విభాగం, వరంగల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వెబినార్ ఉపన్యాస పరంపర కార్యక్రమ నిర్వాహకులు కాత్యాయనీ విద్మహే, వంగాల సంపత్ రెడ్డి, కె.ఎన్. మల్లీశ్వరి, రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, ఖాదర్ మొయినుద్దీన్, వడ్డెబోయిన శ్రీనివాస్, శివరాత్రి సుధాకర్, ఇమ్మడి మహేందర్. సాహిత్య విమర్శకులను, సాహిత్య విమర్శను బోధించవలసిన కళాశాలల విశ్వవిద్యాలయాల తెలుగు అధ్యాపకులను, సాహిత్య విమర్శను ఒక పేపరుగా చదువుతూ సాహిత్య పరిశోధనలోకి దిగే విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని 32 అంశాలతో ఈ ప్రణాళిక రూపొందింది. సాహిత్య విమర్శలో అభిరుచి, అభినివేశం ఉన్న వాళ్ళందరూ నవంబర్ 22 నుంచి ప్రారంభమై ముప్ఫయి రెండు వారాల పాటు జరిగే ఈ వారం వారం అంతర్జాల సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరు కావలసినదిగా కోరుతున్నాం. సాహిత్య విమర్శకు, ప్రత్యేకించి మార్క్సిస్టు విమర్శకు సంబంధించి జరిగే సంభాషణలో భాగస్వాములు కావలసినదిగా విజ్ఞప్తి. 


ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు జరిగే ఈ ప్రసంగాల వరుసలో మొదటిది ‘‘పాశ్చాత్య సాహిత్య విమర్శ సిద్ధాంతాలు- చరిత్ర’’. కుప్పం విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగం ఆచార్యులు బి. తిరుపతిరావు గారు ఈ అంశంపై రేపు (22వతేదీ) ప్రసంగిస్తారు. జామ్ ఐడి 8254545523. పాస్ కోడ్ KGCTEL 75.


కాత్యాయనీ విద్మహే

Updated Date - 2020-11-21T05:41:38+05:30 IST