కాంతులు చిమ్మినప్పుడే...

ABN , First Publish Date - 2022-01-15T06:24:24+05:30 IST

ఇళ్ల ముంగిళ్లలో ఇంద్ర ధనుస్సులు రంగవల్లులై పరుచుకునే సంబురం గగనాన బాల్యాలు....

కాంతులు చిమ్మినప్పుడే...

ఇళ్ల ముంగిళ్లలో ఇంద్ర ధనుస్సులు

రంగవల్లులై పరుచుకునే సంబురం

గగనాన బాల్యాలు

గాలిపటమై ఎగురే సంబురం

పల్లెసుద్దుల పలుకులతో

డూ..డూ బసవల విన్యాసపు సంబురం


పాతకు గోరీ కడుతూ..

కొత్తకూ భేరీ కొడుతూ..

భోగి మంటలై ఎగిసే

యువత సయ్యాటల సంబురం


కాల గమనంలో కరిగిపోతున్న

హరిదాసు ఆటపాటల్ని

మచ్చుకు చూస్తున్న సంబురం


అన్నీ మారుతున్నాయ్..

మసక బారుతున్నాయ్..


ఎన్ని రంగుల ఎన్ని హంగుల 

పెద్ద పండుగలొచ్చినా

లెక్కకు చిక్కని బ్రతుకుల పద్దు

పేదకు దక్కని వెలుగుల పొద్దు


కష్టజీవి కడగండ్లు తీరి

కాంతులు చిమ్మినప్పుడే సంక్రాంతి..!!



– కటుకోఝ్వల రమేష్

Updated Date - 2022-01-15T06:24:24+05:30 IST