టీఆర్‌ఎస్‌లో కట్టప్పలు

ABN , First Publish Date - 2022-07-09T10:03:21+05:30 IST

తెలంగాణలోనూ మహారాష్ట్ర తరహా రాజకీయ పరిణామాలు సంభవిస్తాయని బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్‌ అన్నారు.

టీఆర్‌ఎస్‌లో కట్టప్పలు

  • సర్కారును కూల్చడానికి ఎప్పుడైనా సిద్ధం
  • తెలంగాణలో ‘మహా’ సీన్‌ రిపీట్‌ కావచ్చు
  • బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
  • పుత్ర వాత్సల్యంతోనే టీఆర్‌ఎస్‌ పతనం
  • దక్షిణాదిపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
  • కాంగ్రెస్‌, మజ్లిస్‌ అంతా తోడు దొంగలే
  • తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయమని స్పష్టం


న్యూఢిల్లీ, జూలై 8(ఆంధ్రజ్యోతి): తెలంగాణలోనూ మహారాష్ట్ర తరహా రాజకీయ పరిణామాలు సంభవిస్తాయని బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌లో కూడా కట్టప్పలున్నారని, వాళ్లు ప్రభుత్వాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుత్ర వాత్సల్యం కారణంగా మహారాష్ట్ర, బీహార్‌ ప్రభుత్వాలు ఎలా కూలిపోయాయో తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా అలాగే కూలిపోతుందని చెప్పారు. బీజేపీలో కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి చేరిక కేవలం ట్రైలర్‌ మాత్రమేనని అసలు సినిమా ముందున్నదని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికైన లక్ష్మణ్‌ శుక్రవారం ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, ఇతర సీనియర్‌ నేతలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ పట్ల జాతీయ నాయకత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని లక్ష్మణ్‌ తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ద్వారా దక్షిణాదికి సరైన ప్రాతినిధ్యం కల్పించలేకపోతున్నామని భావించిన బీజేపీ రాష్ట్రపతి కోటాలో దక్షిణాది నుంచి నలుగురికి రాజ్యసభ సీట్లు ఇచ్చిందన్నారు. ప్రధాని మోదీ దక్షిణాదికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో చెప్పడానికి ఈ నలుగురితో పాటు తన ఎంపికే నిదర్శనమన్నారు. 


తెలంగాణ గేట్‌ వే ఆఫ్‌ సౌత్‌

తెలంగాణలో పదవులను కుటుంబ పార్టీ అంగట్లో సరుకుల్లాగా అమ్ముకుంటోందని లక్ష్మణ్‌ మండిపడ్డారు. మోదీ, అమిత్‌ షా, నడ్డాలు తెలంగాణను ‘గేట్‌ వే ఆఫ్‌ ఆఫ్‌ సౌత్‌’గా భావిస్తున్నారని చెప్పారు. దుబ్బాక, హుజురాబాద్‌, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని చూసి కుల పార్టీలు, కుటుంబ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు. ‘ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి నిచ్చెన వేసినట్లు’ కేసీఆర్‌ రాష్ట్రంలో దోచుకున్నది చాలక జాతీయ పార్టీ పెడతానని, చక్రం తిప్పుతానని బీరాలు పలుకుతున్నారని లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు, అమరుల ఆకాంక్షలు నెరవేర్చడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోందని చెప్పారు. మోదీని విమర్శించే స్థాయి కేసీఆర్‌కు లేదన్నారు. అవినీతిలో కూరుకుపోయిన కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామన్నారు. కాంగ్రెస్‌, ఎంఐఎం అంతా తోడు దొంగలే అని రాష్ట్రంలో బీజేపీనే టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌, ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడు అజయ్‌ నిష్రత్‌, ఈటల రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 


ఎస్‌ఎల్‌బీసీ భేటీ ఎప్పుడు: పొంగులేటి

హైదరాబాద్‌: వర్షాకాలం వచ్చినా వ్యవసాయ ప్రణాళికపైన ప్రభుత్వానికి ఇప్పటి దాకా స్పష్టత లేదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్‌ ఎస్‌ఎల్‌బీసీ సమావేశం ఊసే ఎత్తట్లేదన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన ఫీల్డ్‌ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యమానికి శ్రీకారం చుడతామని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్‌ హెచ్చరించారు.

Updated Date - 2022-07-09T10:03:21+05:30 IST