కైఫీయత్తుల పరిష్కర్త కట్టా నరసింహులు కన్నుమూత

ABN , First Publish Date - 2021-05-16T06:20:29+05:30 IST

ప్రముఖ సాహితీవేత్త కట్టా నరసింహులు (73) కరోనాతో శనివారం కన్నుమూశారు.

కైఫీయత్తుల పరిష్కర్త కట్టా నరసింహులు కన్నుమూత
కట్టా నరసింహులు

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), మే 15: ప్రముఖ సాహితీవేత్త కట్టా నరసింహులు (73) కరోనాతో శనివారం కన్నుమూశారు.గత నెలలో కరోనా బారిన పడిన నరసింహులు 27వ తేదీ నుంచీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు.కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చిన్నకొత్తపల్లెకు చెందిన కట్టా నరసింహులు సొంత జిల్లాలో పలు చోట్ల తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేశారు. కడప పట్టణం ఎర్రముక్కపల్లెలో వున్న సీపీ బ్రౌన్‌ గ్రంథాలయాధికారిగా సేవలు అందించారు. జానుమద్ది హనుమచ్చాస్త్రి తర్వాత ఆ గ్రంథాలయాన్ని తీర్చిదిద్దడంలో ఈయన కృషి ఎంతో ఉంది.కడప జిల్లాలోని మెకంజీ కైఫీయత్తులను పరిష్కరించి పుస్తక రూపంలో ప్రచురించారు.పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జీవిత చరిత్రకు సంబంధించిన అనేక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చి పుస్తకాలుగా ప్రకటించారు. వేమన, వీరబ్రహ్మం, పోతన పద్యాలకు సరళ వ్యాఖ్యానం చేసి పుస్తకాలుగా తీసుకొచ్చారు.కడప జిల్లా ఒంటిమిట్ట రామాలయానికి సంబంధించిన ప్రాచీన విశేషాలను వెలుగులోకి తీసుకొచ్చారు.ఒంటిమిట్ట రామాలయంలో రాష్ట్రప్రభుత్వం అధికారికంగా సీతారాముల కల్యాణం నిర్వహించడంలో కట్టా నరసింహులు నిర్వహించిన చారిత్రాత్మక కృషి దాగుంది. ఇందుకు కట్టా నరసింహులు రాసిన ఒంటిమిట్ట వైభవం అనే పుస్తకం ప్రధాన ఆధారంగా నిలిచింది.మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ కూడా ఆయన చేత కృష్ణా జిల్లా కైఫీయత్తులను పరిష్కరింపజేశారు. కొంతకాలం తిరుపతిలోని టీటీడీ సప్తగిరి కార్యాలయంలో ప్రాచీన వాఙ్మయ పరిష్కర్తగా పనిచేశారు. వీరి చివరి పుస్తకం ‘కైఫియత్‌ కతలు తరతరాల సంస్కృతికి దర్పణం’ గత ఏడాది వచ్చింది. బద్దెన కళాపీఠం అవార్డు, మైనంపాటి వెంకటసుబ్రమణ్యం సాహిత్య పురస్కారం తదితర అవార్డులు అందుకున్న ఈయన పదేళ్ళ క్రితం రిటైరయ్యాక తిరుపతిలో స్థిరపడ్డారు.కరకంబాడి రోడ్డులో వున్న రెడ్డి భవన్‌ సమీపంలో గల బృందావన్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండేవారు.శనివారం రాత్రి 9 గంటల సమయంలో మృతి చెందిన కట్టా నరసింహులు అంత్యక్రియలు ఆదివారం తిరుపతిలోనే నిర్వహించనున్నారు. టీటీడీ సప్తగిరి మాసపత్రిక ప్రత్యేక ఉప సంపాదకులు డాక్టర్‌ కంపల్లె రవిచంద్రన్‌, డాక్టర్‌ కొస్సం నరసింహాచార్య, రచయిత ఎలమర్తి మధుసూదన్‌,అవధాని ఆముదాల మురళి తదితరులు కట్టా నరసింహులు మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.

Updated Date - 2021-05-16T06:20:29+05:30 IST