జన్మభూమి రక్షణలో కట్కూర్‌ సైన్యం

ABN , First Publish Date - 2022-08-14T05:15:29+05:30 IST

సరిహద్దుల్లో కాపలా కాస్తూ దేశ రక్షణలో జన్మధన్యం చేసుకుంటున్నారు ఈ గ్రామ యువకులు. ఒకే గ్రామం నుంచి 130మందికిపైగా సైన్యంలో విధులు నిర్వర్తిస్తుండడం విశేషం. వీరంతా సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూర్‌ గ్రామానికి చెందిన యువకులు. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్లో భాగస్వాములవుతున్నందుకు వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

జన్మభూమి రక్షణలో కట్కూర్‌ సైన్యం

ఒకే ఊరి నుంచి 130మందికిపైగా జవాన్లు

సరిహద్దులో విధులు నిర్వహించే కట్కూరు జవాన్లు


అక్కన్నపేట, ఆగస్టు 13 : సరిహద్దుల్లో కాపలా కాస్తూ దేశ రక్షణలో జన్మధన్యం చేసుకుంటున్నారు ఈ గ్రామ యువకులు. ఒకే గ్రామం నుంచి 130మందికిపైగా సైన్యంలో విధులు నిర్వర్తిస్తుండడం విశేషం. వీరంతా సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూర్‌ గ్రామానికి చెందిన యువకులు. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్లో భాగస్వాములవుతున్నందుకు వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కట్కూర్‌ గ్రామం ఒకప్పుడు పీపుల్స్‌వార్‌ ఖిల్లాగా ఉండేది. ఈ గ్రామం ఇప్పుడు ఆర్మీ జవాన్ల ఇలాకాగా మారింది. ఈ ఊరి జనాభా 3,500 కాగా 900 కుటుంబాలున్నాయి. అందులో 170 మంది వరకు ఆర్మీ ఉద్యోగులు. వారిలో 40 మంది విరమణ పొందారు. ప్రస్తుతం 130 మంది విధులు నిర్వహిస్తున్నారు. కట్కూరు నుంచి 40 ఏళ్ల క్రితం జేరిపోతుల డేనియల్‌ మిలిటరీలో జవాన్‌గా చేరాడు. ఆయన స్ఫూర్తితో గ్రామంలోని యువకులు సైన్యం బాటపట్టారు. జవాన్‌స్థాయి నుంచి లాంచ్‌నాయక్‌, నాయక్‌, హావల్దార్‌, నాయక్‌ సుబేదార్‌ స్థాయి వరకు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. కట్కూరు గ్రామ పరిధిలోని రాజుతండాకు చెందిన గిరిజన యువకుడు నరసింహనాయక్‌ మిలటరీలో జవానుగా పని చేస్తూ తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందాడు. ఈ ఘటన తర్వాత గ్రామంలో తీవ్ర విషాదం అలుముకున్నా ఆ గ్రామ యువత మనోధైర్యాన్ని మాత్రం దెబ్బతీయలేదు. ఆయన మరణానంతరం గ్రామానికి చెందిన మరో 25 మందికిపైగా యువత మిలటరీలో చేరారు. 


ఎనిమిదేళ్లుగా సైన్యంలో

మా ఊరిలో సైన్యంలో చేరిన వాళ్లను చూసి నేను కూడా సైన్యంలో చేరాలని నిర్ణయం తీసుకున్నా. జవాన్‌గా సెలెక్ట్‌ అయి సైన్యంలో టెక్నికల్‌ ఇంజనీరింగ్‌ గ్రూప్‌లో పనిచేస్తున్నాను. ఎనిమిదేళ్లుగా సైన్యంలో సేవలందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. 75 వసంతాల కార్యక్రమంలో భాగస్వాములు కావడం ఆనందంగా ఉంది.

- గడ్డం హరీష్‌ కుమార్‌, జవాన్‌, కట్కూర్‌


గర్వపడుతున్నా

దేశ రక్షణ కోసం సైన్యంలో పని చేస్తున్నందుకు గర్వపడుతున్నా.కోట్లాది మంది భారతీయుల తరఫున దేశ రక్షణ కోసం ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో పనిచేస్తున్నా.ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దేశం కోసం పని చేయడం ఆనందంగా ఉంది.

- చుంచు వినోద్‌ కుమార్‌, జవాన్‌, కట్కూర్‌


Updated Date - 2022-08-14T05:15:29+05:30 IST