కాటికీ కాసులేనా!?

ABN , First Publish Date - 2021-05-13T05:21:43+05:30 IST

గత ఏడాది.. లాక్‌డౌన మొదలైన రోజు నుంచి రాజకీయ నాయకులు ప్రజలకు అండగా నిలబడ్డారు. వీధి వీధికి వెళ్లి ఉచితంగా కూరగాయలు, నిత్యావసర సరుకులు ఇంటింటికి అందేలా పంపిణీ చేశారు.

కాటికీ కాసులేనా!?

మోయలేని భారంగా అంత్యక్రియలు

ఆసుపత్రి నుంచి అంత్యక్రియల వరకు ప్యాకేజీలు

ముఠాగా ఏర్పడి పిండుకుంటున్న వైనం

బాధ్యతల నుంచి తప్పుకున్న ప్రభుత్వం

గతేడాదిలా ముందుకురాని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు


సరిగ్గా గత ఏడాది ఇదే సమయం. కరోనా పంజా విసిరిన తొలి సందర్భం. మహమ్మారి మానవాళికి చేసిన గాయంపై మానవీయ సాయంతో ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, పలు స్వచ్ఛంద సంస్థలు పోటీపడి సాయం అందించాయి. మేమున్నామంటూ ఎందరో ముందుకు వచ్చి ప్రజలకు అండగా నిలిచారు. 

మరి ఇప్పుడు...

కరోనా దాడి విషయానికి వస్తే గత ఏడాదికంటే తీవ్రం. మరణాల శాతం విపరీతం. కోవిడ్‌ బాధితులు.. వారి కుటుంబ సభ్యుల బాధలు వర్ణనాతీతం. కానీ మానవీయ సాయంలో మాత్రం గత ఏడాది కనిపించిన స్ఫూర్తి ఇప్పుడు కనుమరుగైంది. పుట్టెడు కష్టాల్లో ఉన్న కరోనా బాధితులకు చేతనైన సాయం అందించే విషయంలో ప్రభుత్వం తప్పుకుని, దృష్టినంతా చికిత్సల మీదే కేంద్రీకరించింది. సాయం విషయాన్ని విస్మరించింది. మానవీయ విలువవ విషయంలో గత ఏడాదిని ప్రస్తుత పరిస్థితిని బేరీజు వేసుకుంటే చెప్పలేనంత వ్యత్యాసం కనిపిస్తోంది. 


నెల్లూరు. మే 12 (ఆంధ్రజ్యోతి) : గత ఏడాది.. లాక్‌డౌన మొదలైన రోజు నుంచి రాజకీయ నాయకులు ప్రజలకు అండగా నిలబడ్డారు. వీధి వీధికి వెళ్లి ఉచితంగా కూరగాయలు, నిత్యావసర సరుకులు ఇంటింటికి అందేలా పంపిణీ చేశారు. ఉపాధి కోల్పోయిన పేదలకు తామున్నామంటూ ఆకలి బాధలు తీర్చే విషయంలో ఎందరో దాతలు తమ ఔదార్యం చాటుకున్నారు. మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు లెక్కకు మించి పంచిపెట్టారు. వాహన రాకపోకలు స్తంభించడంతో కాలినడకన బయలుదేరిన వలస కూలీలకు రహదారుల వెంబడి తోడుగా నిలిచి కడుపునింపారు. అన్ని చోట్ల, అందరికీ ఏదో ఒక రూపంలో మానవత్వం పుష్కళంగా కనిపించింది. ఇప్పుడు ఆ మానవీయ సాయాలు మచ్చుకైనా కనిపించలేదు. పూర్తి లాక్‌డౌన లేని కారణంగా ప్రజలు యధావిధిగా వారి కార్యకలాపాలు చేసుకొంటున్నారు కాబట్టి, వాహన రాకపోకలు యఽథావిధిగా సాగుతున్నాయి కాబట్టి రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు ఇప్పటి వరకు ఇలాంటి సాయాలకు శ్రీకారం చుట్టలేదు అనుకోవచ్చు. ఈ విషయంలో ఇప్పటివరకు తమ అవసరం రాలేదు కాబట్టి ప్రజాప్రతినిధులు, దాతలు ముందుకు రాలేదని సరిపెట్టుకోవచ్చు.


మరి ప్రభుత్వం..


 రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే తొలి విడత తొలి  రోజుల్లో కరోనా బారినపడిన వారికి నయమై ఇంటికి వెళ్లే సమయంలో మనిషికి రూ.2వేలు ఇచ్చింది. కేసులు పెరిగిపోవడంతో ఆ తరువాత నగదు పంపిణీ మానేసినా ప్రజలకు ఆర్థికంగా సాయపడాలనే ప్రయత్నం అయితే కొంత మందికైనా చేసింది. ఇక వైరస్‌ బారిన పడినవారిని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. బాధితులను ఆసుపత్రులకు, క్వారంటైన సెంటర్లకు తరలించడంతోపాటు నయమైన వారిని తిరిగి 104, 108 వాహనాల్లో వారి ఇళ్లకు చేర్చారు. ఆసుపత్రుల్లో, క్వారంటైన సెంటర్లలో ఉన్న వారికి మంచి ఆహారం అందించారు. అన్నింటికన్నా మించి కరోనాతో మృతి చెందిన వారిని అంత్యక్రియల బాధ్యతను సైతం ప్రభుత్వమే తీసుకుంది. మిగిలిన సాయాల విషయం పక్కన పెడితే ఇప్పుడు ఇంటి మనిషిని కరోనా మింగేస్తే, వారిని కాటికి పంపడానికి అయ్యే ఖర్చు భరించలేక కుమిలిపోయే పరిస్థితి వచ్చింది. అంత్యక్రియల బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకోవడంతో ఇదే అవకాశంగా కొంతమంది ముఠాలుగా ఏర్పడి చితిపేరు చెప్పి బతికున్నవారిని పీక్కుతింటున్నారు. కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు ఇప్పుడు అత్యంత ఖరీదైన కార్యక్రమంగా మారింది. ఆసుపత్రి నుంచి శ్మశానం వరకు అన్ని చోట్ల దోపిడీ ఎదురవుతోంది. మృతదేహాలను ఆసుపత్రి వార్డు నుంచి మార్చురీకి తరలించడానికి తప్పనిసరిగా ఆసుపత్రిలో కొంతమంది చేయి తడపాల్సి వస్తోంది. మృతదేహాన్ని అక్కడి నుంచి శ్మశానానికి చేర్చడం సామాన్యులకు మోయలేని భారంగా మారుతోంది. గత ఏడాది మృతదేహాలను మహాప్రస్తానం వాహనంలో ప్రభుత్వమే శ్మశాన వాటికలకు చేర్చేది. ఈసారి ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి తప్పుకోవడంతో ఆత్మీయులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధితులను పిండుకోవడమే పనిగా మారింది. ఉదాహరణకు జీజీహెచ నుంచి నెల్లూరు బోడిగాడితోట శ్మశాన వాటికకు మృతదేహాన్ని తీసుకెళ్లాలంటే మనిషిని బట్టి, డిమాండ్‌ను బట్టి ఐదు నుంచి పదివేల వరకు వసూలు చేస్తున్నారు. రెండో విడతలో మరణాలు ఎక్కువ కావడంతో వీరి డిమాండ్‌ మరింత పెరిగింది. మార్చురీ నుంచి వాహనం ఎక్కించడానికి వెయ్యి, శ్మశానంలో మృతదేహాన్ని దించిపెట్టాలంటే వెయ్యి,  గొయ్యి తవ్వడానికి నాలుగువేలు...ఇలా ఒక్కో పనికి  ఫిక్సిడ్‌ రేట్లు పెట్టి పిండుకొంటున్నారు. ఇక్కడ కూడా ప్యాకేజ్‌ దహనాలు అమలులోకి వచ్చాయి. పాతిపెట్టడానికి 15నుంచి 20వేలు, ఖననానికి అయితే 25నుంచి 30వేలు చొప్పున వసూళ్లు చేస్తున్నారు. ధనవంతులకైతే ఇది పెద్ద లెక్క కాదు. మధ్య, పేద తరగతి ప్రజలకే ఇది పెద్ద భారమైంది. కరోనాతో శ్మశానాలకు వచ్చే మృతదేహాల సంఖ్య పెరగడంతో కాటికి కూడా దందా చేసే ముఠాలు ఏర్పడ్డాయి. పిండుకున్న దానిలో సగం వీరు నొక్కేసి, మిగిలిన సగం అక్కడ కష్టపడే శ్రామికులకు ఇస్తున్నారు. శవాల మీద కాసులేరుకోవడం ఇప్పుడు మంచి వ్యాపారంగా మారిపోయింది. కరోనా మృతదేహం అంత్యక్రియల ప్రక్రియలో పాలుపంచుకునే ఏ ఒక్కరిలోనూ జాలి దయ అనేది కనిపించడం లేదు. ప్రభుత్వం కరోనా అంత్యక్రియల విషయంలో జోక్యం చేసుకోకపోతే దోపిడీ మరింత పెరిగే ప్రమాదం ఉంది. 

Updated Date - 2021-05-13T05:21:43+05:30 IST