కథా దీపస్తంభం

ABN , First Publish Date - 2021-06-05T06:18:05+05:30 IST

తెలుగు కథాపతాక శోక భారంతో అవనతమయింది. ఆధునిక తెలుగు సాహిత్యంలోని మహోన్నత శిఖరాలలో ఒకరు, గొప్ప కథకులు, సాహిత్య కార్యకర్తా, సంస్థా నిర్మాత కాళీపట్నం రామారావు కన్నుమూశారు...

కథా దీపస్తంభం

తెలుగు కథాపతాక శోక భారంతో అవనతమయింది. ఆధునిక తెలుగు సాహిత్యంలోని మహోన్నత శిఖరాలలో ఒకరు, గొప్ప కథకులు, సాహిత్య కార్యకర్తా, సంస్థా నిర్మాత కాళీపట్నం రామారావు కన్నుమూశారు. దాదాపు పూర్ణాయుష్షు అనదగ్గ 97 సంవత్సరాల జీవితం గడిపి కాలధర్మం చెందినట్టు అనిపించినా, అక్షరప్రపంచానికి మాత్రం ఆయనది అకాలమరణమే. కథనంలో, మానవ-, సామాజిక సంబంధాల చిత్రణలో, అత్యంత జటిలమైన కఠోరవాస్తవికతను కథాగర్భితం చేయడంలో అసాధారణమైన నేర్పు, పదును చూపిన కాళీపట్నం కథలు సాహిత్య విద్యార్థులకు, రచయితలకు పాఠ్యపుస్తకాల వంటివి. తన రచనలనే నమూనాగా నిలిపి, తనను దాటి వెళ్లగలిగే కథలకు కూడా చేయిపట్టి నడకలు నేర్పిన ఉపాధ్యాయుడు కా.రా. మేష్టారు.


సాహిత్య మహోదయాలకే కాదు, ప్రగతిశీల ప్రభంజనాలకు కూడా పెట్టింది పేరైన ఉత్తరాంధ్రలో, శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన కా.రా. లెక్కల టీచర్‌గా పనిచేశారు. పద్దెనిమిదేళ్ల వయసులోనే రచనలు మొదలుపెట్టినప్పటికీ, 1960ల మధ్య నుంచి కథారచనలో కొత్త మార్గం అందుకున్నారు. అంతకు ముందు మధ్యతరగతి ఇతివృత్తాలను, మానవసంబంధాల సమస్యలను తీసుకున్న కా.రా. అట్టడుగు వర్గాల జీవితాన్ని, క్షేత్రస్థాయి సామాజికార్థిక ఘర్షణలను కథనం చేయసాగారు. సుప్రసిద్ధమైన ఆయన కథలు, యజ్ఞం, తీర్పు, ఆర్తి, చావు, జీవధార, కళ్లు, శాంతి, వీరడు మహావీరడు ఈ కాలంలో రాసినవే. తెలుగు కథాసాహిత్యంలో అతి విస్తృత చర్చ జరిగిన కథగా ‘యజ్ఞం’ను చెప్పుకోవచ్చు. చర్చా వ్యాసాలే రెండు పుస్తకాలుగా వెలువడ్డాయి. అంతటితో సంవాదం ముగియను కూడా లేదు. భారతీయ సమాజం స్వభావాన్ని, పరిణామ క్రమాన్ని నిర్వచించడంలో ఉన్న భిన్నాభిప్రాయాలు, ఒక కథ ప్రాతిపదికగా వ్యక్తంగా కావడం అరుదైన విషయం. ఎందరు ఉద్దండులు ఆ కథ మీద ఎన్ని రకాలుగా చర్చించినా, కా.రా. తన వైపు నుంచి ఏమీ వ్యాఖ్యానించలేదు. కథకుడు చెప్పదలచుకున్నది కథలోనే చెప్పాలనే తత్వం ఆయనది. 


స్వతహాగా మితంగానూ, మృదువుగానూ, తగ్గుస్వరంతోనూ మాట్లాడే కాళీపట్నం రామారావు, కథారచనలో కూడా అదే వినయాన్ని, సంయమనాన్ని, నివురుగప్పిన తనాన్ని అనుసరించారు. నిజానికి, ఆయనను ప్రగతిశీల, ప్రజాకథకుడిగా మార్చినది ఆనాటి రాజకీయ ఉద్యమాల వాతావరణమే. దాని నుంచి, తన పరిశీలనాశక్తి నుంచి ఆయన అనంతరకాలపు కథల వాతావరణం సమకూరింది. ఆ ప్రభావాలలోను, విరసం సభ్యుడిగాను ఉన్న కాలంలో రాసిన ఆయన కథలు కథానుగత సదావేశాలను ప్రేరేపిస్తాయి తప్ప, వాచ్యంగా పరిష్కారాలను నినదించవు. తీవ్రస్వరంతో ఉద్వేగాలను రగిలించాలనుకుంటే, ఆ ప్రయత్నంలో సృజన లోతులు సగటు స్థాయిలోనే మిగిలిపోతాయని ఆయన భయం కాబోలు. ఆయన సంకల్ప పూర్వకంగా ఒక రచనాశైలిని రూపొందించుకున్నారో లేదో తెలియదు కానీ, సామాజిక, మానవ సంబంధాలను, వాటి అంతశ్చలనాలను పట్టుకోగలిగే ఒడుపు ఆయన అలవరచుకోవడం వల్ల, అనేక అంచెల జీవన విశేషాలను ఆయన రచనలోకి తీసుకురాగలిగారు. పాఠకుడు కూడా ఆయన కథలను చదువుతున్నప్పుడు, ఒక పెద్ద సత్యం తనకు అనుభవం అవుతున్న భావనలోకి వెడతాడు. కథలు పదే పదే చదవాలనిపిస్తాయి. చదివినప్పుడల్లా కొత్తగా, ఎక్కువగా అర్థమవుతాయి. 


దాదాపు ఎనభై సంవత్సరాల సాహిత్య ప్రజాజీవితంలో ఆయన తొలి ముప్పై సంవత్సరాలు మాత్రమే క్రియాశీల రచయితగా జీవించారు. ఆ తరువాత కూడా అడపాదడపా కథలు రాసినప్పటికీ, అనంతర తరాల కథకులకు మార్గనిర్దేశం చేయడానికి, కథాప్రక్రియకు సేవ చేయడానికి వెచ్చించారు. ఆయన మొత్తం కథలు యాభై కూడా దాటవు. ఒకటో రెండో నవలలు రాశారు కానీ, అది ఆయన ప్రక్రియ కాదు. ఆయన కథలు చిన్నకథల హద్దులను దాటి విస్తరిస్తాయి కానీ, వాటిని నవలలు అనలేము. ఆర్తి, యజ్ఞం కథలు పరిమాణ రీత్యా చిన్న నవలల కోవలోకి చేర్చవచ్చు. 


కా.రా. సుదీర్ఘ సాహిత్య ప్రజాజీవితంలో ఎక్కువ కాలం గడిపింది, కథా ప్రచారకుడిగా, ఉపాధ్యాయుడిగా, కథానిలయ వ్యవస్థాపకుడిగా. పత్రికలన్నిటిలో వచ్చే తెలుగు కథలను చదివి, వాటి మంచి చెడ్డలను బేరీజువేసి, స్వయంగా ఆయా కథకులతో వాటిని పంచుకునే పని 1970వ దశకంలోనే కా.రా. చేపట్టారు. తమ పరిశీలనలో మంచివిగా భావించిన మూడు కథల పేర్లను, వాటి రచయితల వివరాలను నెలకు ఒకసారి ఆంధ్రజ్యోతి వారపత్రిక ద్వారా ప్రకటించేవారు. కొత్త రచయితలకు కూడా ఆయన లేఖలు అందుతుండేవి. తెలుగులో వచ్చిన కథాసాహిత్యాన్ని ఒక చోట కొలువుదీర్చాలని ఆయనకు ఎప్పటి నుంచో కోరికగా ఉండేది. తనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినప్పుడు, అవార్డు సొమ్ముతో పాటు, మరికొందరి విరాళాలను చేర్చి ‘కథానిలయం’ పని మొదలుపెట్టారు. 60, 70 వేలకు పైగా కథలు నిలయం గ్రంథాలయంలో ఉన్నాయి. మనసు ఫౌండేషన్ సహాయంతో వీటిని డిజిటలైజ్ చేసే పని కొనసాగుతున్నది. ఇప్పటికే అధికంగా ఆన్‌లైన్‌లో నిక్షిప్తమయ్యాయి. కథాపరిశోధకులకు అనువుగా ఉండడానికి వసతి సదుపాయాన్ని కూడా ‘కథానిలయం’లో ఏర్పరచారు. శ్రీకాకుళంలోని విశాఖ ‘ఎ’ కాలనీలో ఉన్న ఈ కథానిలయం తెలుగుసాహిత్యాభిమానులందరూ సందర్శించవలసిన స్థలం. తెలుగు వారు గర్వపడే కూడలి. దీన్ని సువ్యవస్థితం చేయడానికి కా.రా. ఎంతో పరిశ్రమ చేశారు. ఎంతో సమయం వెచ్చించారు. 


గురజాడ అడుగుజాడలో కొత్త పోకడలెన్నో పోయిన తెలుగు కథామార్గంలో రా.వి. శాస్త్రి, కా.రా. తరచు కలిసి వినిపించే పేర్లు. ఇద్దరి కథలలోని సత్యం ఒకటే అయినా, రచనా మార్గం వేరు, స్వభావాలు వేరు. ఆయనంత మంచివాడు స్నేహితుడు కావడం తన అదృష్టమనీ, ఆయనలాంటి గొప్ప కథకులుండడం తెలుగువారి అదృష్టమనీ కాళీపట్నం గురించి రా.వి.శాస్త్రి ఒక పీఠికలో రాశారు. ఆయన కథలను చర్చించే నెపంతో రాజకీయార్థిక, సామాజిక సమస్యలకు పరిష్కారాలను అన్వేషించడం, అనేక అవ్యక్త కథనాలను, ప్రజా కథనాలను ఆవిష్కరించడం కా.రా. నిష్క్రమణ వేళ తెలుగు బుద్ధిజీవులు, సాహిత్య పాఠకులు ఇక ముందు కూడా కొనసాగించాలి.

Updated Date - 2021-06-05T06:18:05+05:30 IST