పీలేరులో చిట్లాకుప్ప ఉత్సవం
పీలేరు, జనవరి 15: సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఆదివారం పీలేరులో సందడిగా కాటమరాజు ఉత్సవాలను నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణ సమీపంలోని కామాటంవారిపల్లె వద్ద జరిగిన కనుమ ఉత్సవాలకు సుందరంగా ముస్తాబైన పశువులతో రైతులు అధికసంఖ్యలో తరలి వచ్చారు. ఈ సందర్భంగా మ్యూజికల్ చైర్స్, పతంగుల పోటీలు నిర్వహించారు. విజేతలతోపాటు, పశువుల అలంకరణకూ నిర్వాహకులు ప్రత్యేక బహుమతులిచ్చి అభినందించారు. కాగా, ఉదయమే పశువులను రైతులు రంగురంగుల పూలతో అలంకరించి తిరుపతి-మదనపల్లె మార్గంలోని కామాటంవారిపల్లె వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన చిట్లాకుప్ప చుట్టూ పశువులు, గోవులను ప్రదక్షిణ చేయించారు. కట్టుకాలువ వీధిలోని చిట్లాకుప్ప వద్దకూ వేలాది పశువులతో జనం తరలి వచ్చారు. దీంతో కలికిరి-తిరుపతి మార్గం రద్దీగా మారడంతో, ఇబ్బందులు రాకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.