తాగునీటికి కటకట

ABN , First Publish Date - 2021-05-06T04:43:12+05:30 IST

రామవరం పంచాయతీ పరిధి రెడ్డివానివలస గ్రామంలో తాగునీటి ఎద్దడి నెలకొంది. గత నెలరోజులుగా ఈ సమస్య ఉన్నా పట్టించుకునే వారే కరువయ్యారు.

తాగునీటికి కటకట
రెడ్డివానివలసలో తాగునీటి కోసం మహిళల ఎదురుచూపు

సీతానగరం : రామవరం పంచాయతీ పరిధి రెడ్డివానివలస గ్రామంలో తాగునీటి ఎద్దడి నెలకొంది.  గత నెలరోజులుగా ఈ సమస్య ఉన్నా పట్టించుకునే వారే కరువయ్యారు. అసలే వేసవి కావడంతో బిందెడు నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. సమీపంలోని పొలాల్లోకి వెళ్లి నేలబావి నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. బోర్లు ఉన్నా.. వాటి నుంచి ఉప్పు నీరు రావడంతో తాగడానికి పనికిరావడం లేదు. బగ్గందొరవలస పైలెట్‌ ప్రాజెక్టు నుంచి శివారు ప్రాంతమైన ఈ గ్రామానికి పూర్తిస్థాయిలో నీరు రావడం లేదు. దీంతో కొళాయిలు దిష్టిబొమ్మాల్లా మారాయి. దీనిపై అధికారులకు గ్రామస్థులు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని ఆ ప్రాంతవాసులు,  సీపీఎం  నాయకులు ఆర్‌.ఈశ్వరరావు, ఆర్‌.రమణమూర్తి కోరుతున్నారు. దీనిపై ఆర్‌డబ్ల్యూఎస్‌ జేఈ పవన్‌కుమార్‌ని వివరణ కోరగా... వేసవి సమయంలో  బగ్గందొరవలస పైలెట్‌ ప్రాజెక్టుకు సరిగ్గా నీరు అందడం లేదని, విద్యుత్‌ సరఫరా సమస్య కూడా దీనికి తోడైందన్నారు. త్వరలోనే పై సమస్యలను పరిష్కరించి ఆ గ్రామానికి తాగునీరు అందేటట్లు చేస్తామన్నారు. అవసరమైతే నేలబావికి మోటారు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.  


Updated Date - 2021-05-06T04:43:12+05:30 IST