నిఘా అధిపతిగా కసిరెడ్డి

ABN , First Publish Date - 2020-08-12T09:36:09+05:30 IST

రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగం అధిపతిగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కసిరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మరోవైపు విశాఖపట్నం పోలీస్‌

నిఘా అధిపతిగా కసిరెడ్డి

  • ఆర్కే మీనాకు పోస్టింగ్‌ ఇవ్వని ప్రభుత్వం

అమరావతి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగం అధిపతిగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కసిరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మరోవైపు విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌కే మీనాను బదిలీ చేసింది. ఆయనకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. మీనా స్థానంలో ఆ బాధ్యతలను ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ అధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మనీశ్‌ కుమార్‌ సిన్హాకు అప్పగించింది. ఈమేరకు ఆయనను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన పలు వ్యవహారాలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధిపతిగా కసిరెడ్డి రాజేంద్రనాథ్‌ రెడ్డి పలు కీలక నివేదికలు ఇచ్చారు. ఈఎ్‌సఐ స్కామ్‌ సహా పలు కేసుల్లో రిపోర్టులు ప్రభుత్వానికి సమర్పించారు. ప్రస్తుతం ఆయన అడిషనల్‌ డీజీ హోదాలో ఉన్నారు.


ఆయనను ఇంటెలిజెన్స్‌ అధిపతిగా నియమించాలన్న ఆలోచనతోనే ప్రభుత్వం అప్పట్లో విజిలెన్స్‌ బాధ్యతలు ఇచ్చింది. కొత్త బాధ్యతలతోపాటు విజిలెన్స్‌ చీఫ్‌గానూ అదనపు బాధ్యతలు నిర్వర్తించాలని తన ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇంటెలిజెన్స్‌ అధిపతిగా ఐజీ హోదాలో ఉన్న సిన్హాను పాలనాపరమైన రాజధానిగా ప్రభుత్వం దాదాపు ఖరారు చేసిన విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌గా నియమించారు. కీలక సమయంలో ఇటువంటి అధికారి సేవలు అక్కడ అవసరమని భావించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విశాఖపట్నంలో వరుస ఘటనలు, సీపీగా ఆర్‌కే మీనా సమర్థవంతంగా పనిచేయలేదన్న అసంతృప్తితో ఆయనకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. మంగళగిరి డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 

Updated Date - 2020-08-12T09:36:09+05:30 IST