కాశీ యాత్ర

ABN , First Publish Date - 2021-12-15T09:34:41+05:30 IST

కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు మొదటిదశ ప్రారంభోత్సవాన్ని టెలివిజన్‌ చానెళ్ళలో ప్రత్యక్షంగా వీక్షించిన ఓ రాజకీయ విశ్లేషకుడికి దేశ రాజకీయాలను బీజేపీ సమూలంగా మార్చేసిందని తీర్మానించడానికి...

కాశీ యాత్ర

కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు మొదటిదశ ప్రారంభోత్సవాన్ని టెలివిజన్‌ చానెళ్ళలో ప్రత్యక్షంగా వీక్షించిన ఓ రాజకీయ విశ్లేషకుడికి దేశ రాజకీయాలను బీజేపీ సమూలంగా మార్చేసిందని తీర్మానించడానికి ఇంతకంటే గట్టి నిదర్శనం లేదనిపించిదట. కాశీలో మోదీ పర్యటన, కారిడార్ ఆరంభోత్సవ సందర్భంగా చేసిన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలు గమనించినప్పుడు కొన్ని నెలల్లో ఉన్న యూపీ ఎన్నికలే కాక, కాస్తంత దూరంగా ఉన్న సార్వత్రిక ఎన్నికల వైపు సైతం బీజేపీ ఎంత పద్ధతి ప్రకారం వడివడిగా అడుగులు వేస్తున్నదో అర్థమవుతుంది.


అద్భుతవాగ్ధాటి ఉన్నందున నరేంద్రమోదీ ప్రసంగంలోని ప్రతిచిన్నమాట కూడా ఓటరు మనసును కచ్చితంగా చేరుతుంది. అంతర్లీనమైన సందేశాలు ప్రజల మెదళ్ళకు ఎక్కుతాయి. కాశీ కారిడార్ ఆరంభాన్ని ఆయన కొత్త చరిత్రకు, భవ్యమైన భవిష్యత్తుకు నిదర్శనంగా చూపారు. కాశీ విశ్వనాథుడి సమక్షంలో ఆయన అయోధ్య రాముడినీ స్మరించుకున్నారు. ప్రతీ ఔరంగజేబుకూ ఓ ఛత్రపతి శివాజీ ఉద్భవిస్తాడని హెచ్చరించి ప్రజల జేజేలు అందుకున్నారు. సాలార్ మసూద్ వస్తే సుహల్ దేవ్ కత్తిదూస్తాడని గుర్తుచేశారు. సుల్తానులు పోయారు కానీ, కాశీ మాత్రం అక్కడే, అంతే సుదృఢంగా ఉందన్నారు. రాణి అహల్యాబాయి, సిక్కురాజు రంజిత్ సింగ్ ప్రస్తావనలు సందర్భోచితమే అయినా, ప్రస్తుత కాలంలో మరింత ఉపకరిస్తాయి. చరిత్రతెలియనివారు సైతం దానిని తిరగేయాల్సిన రీతిలో మోదీ నోటినుంచి అలవోకగా జారినట్టు కనిపించిన ప్రతీ వాక్యంలోనూ ఒక విస్పష్టమైన సందేశం ఉన్నది. ప్రసంగం ఆది అంతాల్లోనే కాదు, మధ్య మధ్య కూడా ఆయన హరహర మహదేవ్ మంత్రాన్ని జనంతో నినిదింపచేయడం మరిచిపోలేదు. 


మోదీ కాశీయాత్ర ఆద్యంతం ఒక ఆలయం విస్తరణ ఘట్టాన్ని ఇంత జనరంజకంగా మలచవచ్చునా అనిపించే ట్టుగా ఉంది. నాయకుల ఘనస్వాగతాలు, జనం జేజేలు, అక్కడక్కడ భద్రతావలయాన్ని సైతం దాటిజొచ్చిన ప్రజాభిమానం, చంటిపిల్లలనుంచి పండుముదుసలి వరకూ అందరితోనూ పంచుకున్న అప్యాయతలు చూసినప్పుడు విశ్వనాథుడికి ఈయన హారతిపడితే జనం ఈయనకు నీరాజనం పట్టారనిపించకమానదు. గంగానదిలో స్నానాలు, తర్పణాల నుంచి ఆలయంలో పూజల వరకూ ప్రతీ ఘట్టాన్ని టెలివిజన్ చానెళ్ళ ప్రత్యక్ష ప్రసారాల్లో వీక్షించిన చాలామందికి ఇప్పటివరకూ వ్యక్తిగత పూజలనూ, మతాన్ని ఇంతచక్కగా మన ప్రధానులెవ్వరూ ఎందుకు రాజకీయంగా వాడుకోలేక పోయారని విస్మయం కలగడం సహజం. కార్మికులతో సహపంక్తిభోజనాలు, పుష్పార్చనల వెనుక కూడా రాబోయే ఎన్నికల్లో కొన్ని వర్గాలను ఆకర్షించే ఓట్ల లెక్కలే కొందరికి కనిపిస్తున్నాయి.ఆధ్యాత్మికమే కాదు, అభివృద్ధికీ తాము కట్టుబడి ఉన్నామని చెప్పుకొనేందుకు అర్థరాత్రి తనిఖీలు ఉపకరిస్తాయి.


ప్రధాని మోదీ ఆయోధ్యలోనూ వారణాసిలోనూ తప్ప పార్లమెంటులో కనిపించరని చిదంబరం వంటి విపక్ష నాయకులు విమర్శిస్తున్నారు కానీ, యూపీ ఎన్నికల కాలంలో కాశీ, సార్వత్రక ఎన్నికల నాటికి అయోధ్య ఎంత అవసరమో బీజేపీకి తెలుసు. యూపీలో బీజేపీ విజయం ఖాయమని దాదాపు అన్ని సర్వేలు తేల్చేశాయి. కానీ, కొద్దిదూరంలోనే ఉంటూ సమాజ్ వాదీ పార్టీనుంచి గట్టిపోటీ ఉన్నదని కూడా అవి హెచ్చరిస్తున్నాయి. ఢిల్లీ గద్దెమీద మోదీని మళ్ళీ చూడాలంటే యూపీలో యోగి అత్యధిక మెజారిటీతో రావాలని అమిత్ షా ఈ మధ్యనే బీజేపీ కార్యకర్తలను హెచ్చరించారు. దేశంలోనే పుట్టిగిట్టిన ఔరంగజేబును చొరబాటుదారుడు అనవచ్చునా, ఛత్రపతి శివాజీకీ ఆయనకూ పోటీపెట్టవచ్చునా, పోలికలు తేవచ్చునా అన్నవి చరిత్రకారుల వాదనలే తప్ప, సామాన్యజనానికి అంతగా పట్టవని బీజేపీ నాయకులకు తెలుసు. సాగుచట్టాలను ఉపసంహరించుకున్నంత మాత్రాన జాట్ల ఓట్లు వర్షిస్తాయన్న నమ్మకం వారికి లేదు. సమాజ్ వాదీపార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్ మధ్య కుదిరిన రాజకీయ ఒప్పందం యాదవులనూ, జాట్లను దగ్గర చేసింది. మరోపక్క దళితులపై జరుగుతున్న దాడుల ప్రభావమూ ఎన్నికల మీద కాదనలేనిది. ఘన విజయానికి ఈ కాశీయాత్రను మించిన దారి మరొకటి లేదన్న వారి నమ్మకం ఓట్లు  కురిపిస్తుందో లేదో చూడాలి.

Updated Date - 2021-12-15T09:34:41+05:30 IST