ఆగ్రా కోర్టు ముందు కశ్మీరి విద్యార్థులపై దాడి

ABN , First Publish Date - 2021-10-29T02:32:42+05:30 IST

భారతీయ జనతా పార్టీ యువజన విభాగమైన భారతీయ జనతా యువ మోర్చా నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా, ముగ్గురు విద్యార్థులపై రాజద్రోహం కేసు కూడా పడే అవకాశాలు..

ఆగ్రా కోర్టు ముందు కశ్మీరి విద్యార్థులపై దాడి

న్యూఢిల్లీ: కశ్మీర్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులపై ఆగ్రా కోర్టు ముందు దాడి జరిగింది. మంగళవారం వారిని కోర్టుకు హాజరు పరిచేందుకు తీసుకువస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తాజాగా జరిగిన భారత్-పాక్ టీ-20 క్రికెట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలుపును సంబరం చేసుకున్నారన్న ఆరోపణలతో వీరిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ప్రకారం.. పాకిస్తాన్ టీం గెలవగానే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు రావడంతో అర్షీద్ యూసఫ్, అల్తాఫ్ షైక్, షౌకత్ అహ్మద్ గణి అనే ముగ్గురు విద్యార్థుల్ని అరెస్ట్ చేశారు.


భారతీయ జనతా పార్టీ యువజన విభాగమైన భారతీయ జనతా యువ మోర్చా నేత ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా, ముగ్గురు విద్యార్థులపై రాజద్రోహం కేసు కూడా పడే అవకాశాలు ఉన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. అయితే తమ క్యాంపస్ పరిధిలో పాకిస్తాన్‌కు అనుకూలంగా ఎలాంటి నినాదాలు చేయలేదని కాలేజీ యాజమాన్యం చెప్పుకొచ్చింది. క్యాంపస్‌లో బీజేపీ జోక్యాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేసినట్లు కాలేజీ యాజమాన్యం పేర్కొంది. ఇక జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీరి విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

Updated Date - 2021-10-29T02:32:42+05:30 IST