Kashmirలో మాకు రక్షణ లేదు.. ఇక్కడి నుంచి తరలించండి: కశ్మీరీ పండిట్లు

ABN , First Publish Date - 2022-05-14T22:26:52+05:30 IST

జమ్మూకశ్మీర్‌(Jammu And Kashmir)లోని బుద్గాం జిల్లాలో ప్రభుత్వ కార్యాలయంలో విధుల్లో ఉన్న కశ్మీరీ పండిట్ రాహుల్ భట్‌

Kashmirలో మాకు రక్షణ లేదు.. ఇక్కడి నుంచి తరలించండి: కశ్మీరీ పండిట్లు

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌(Jammu And Kashmir)లోని బుద్గాం జిల్లాలో ప్రభుత్వ కార్యాలయంలో విధుల్లో ఉన్న కశ్మీరీ పండిట్ రాహుల్ భట్‌ (Rahul Bhut)ను ఉగ్రవాదులు కాల్చి చంపిన తర్వాత అక్కడి కశ్మీరీ పండిట్లలో భయాందోళనలు మొదలయ్యాయి. ఎప్పుడేం జరుగుతుందో తెలియక భయాందోళనల మధ్య గడుపుతున్నారు. కశ్మీరీ పండిట్ వర్గానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు తమను అక్కడి నుంచి సురక్షితంగా తరలించాల్సిందిగా కోరుతూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.


ఈ మేరకు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా (Manoj Sinha)కు ఆల్ పీఎం ప్యాకేజీ ఎంప్లాయీస్ ఫోరం లేఖ రాసింది. తాము పీఎం ప్యాకేజ్, నాన్-పీఎం ప్యాకేజ్ ఉద్యోగులమని, తమను కశ్మీర్ ప్రావిన్స్ నుంచి సురక్షితంగా తరలించి రక్షించాలని  అభ్యర్థించింది. కశ్మీర్ తమకు ఎంతమాత్రమూ సురక్షితం కాదని, తమను తరలించలేని పక్షంలో మూకుమ్మడి రాజీనామాలకు  సిద్ధమని స్పష్టం చేసింది. 


ప్రపంచంలో ఎక్కడైనా పనిచేసేందుకు తాము సిద్ధమేనని ఆ లేఖలో పేర్కొన్న ఉద్యోగులు, కశ్మీర్‌లో మాత్రం పనిచేయలేమని తేల్చిచెప్పారు. ఇక్కడ తాము జీవించలేమని, తమను ఇక్కడ రోజువారీ లెక్కన చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, గురువారం సెంట్రల్ కశ్మీర్‌లోని చదూరాలో తహసీల్దార్ కార్యాలయంలో విధుల్లో ఉండగా రాహుల్ భట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భట్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. రాహుల్‌పై కాల్పలు జరిపింది తామేనని ‘కశ్మీరీ టైగర్స్’ ప్రకటించింది.  


Read more