‘రఫేల్’ త్వరగా రావడంలో కీలక పాత్ర ఈ కశ్మీరీ అధికారిదే

ABN , First Publish Date - 2020-07-29T00:00:15+05:30 IST

భారత దేశ యుద్ధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం, శత్రు దుర్భేద్యం చేసే

‘రఫేల్’ త్వరగా రావడంలో కీలక పాత్ర ఈ కశ్మీరీ అధికారిదే

న్యూఢిల్లీ : భారత దేశ యుద్ధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం, శత్రు దుర్భేద్యం చేసే రఫేల్ యుద్ధ విమానాలు బుధవారం భారత వాయు సేన (ఐఏఎఫ్)కు చేరబోతున్నాయి. భారత్-ఫ్రాన్స్ మధ్య నాలుగేళ్ల క్రితం కుదిరిన ఒప్పందం మేరకు మొదటి దశలో 5 యుద్ధ విమానాలను భారత్‌కు అప్పగించారు. ఈ విమానాలు ఫ్రాన్స్ నుంచి ఈ నెల 27న బయల్దేరాయి. 


ఈ యుద్ధ విమానాలు సకల హంగులతో నిర్మితమై మన దేశానికి సకాలంలో రావడంలో ఓ కశ్మీరీ ఐఏఎఫ్ అధికారి కీలక పాత్ర పోషించారు. ఆయన పేరు హిలాల్ అహ్మద్ రాథర్. ఆయన ప్రస్తుతం భారత దేశపు ఎయిర్ అటాచ్‌ టు ఫ్రాన్స్‌గా సేవలందిస్తున్నారు. 


ఎయిర్ కమొడోర్ హిలాల్ అహ్మద్ రాథర్ 1988 డిసెంబరు 17న ఐఏఎఫ్ ఫైటర్ స్ట్రీమ్‌లో విధుల్లో చేరారు. ఎటువంటి ప్రమాదాలకు గురికాకుండా 3000 గంటలకు పైగా విమానయానం చేశారు. మిగ్-21లు, మిరేజ్-2000, కిరణ్ విమానాల్లో ఆయన విధులు నిర్వహించారు. ఆయన ఫైటర్ కంబాట్ లీడర్, అనుభవజ్ఞుడైన ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్ కూడా.


ఎయిర్ కమొడోర్ రాథర్ రఫేల్ యుద్ధ విమానాలు సత్వరమే భారత దేశానికి రావడానికి విశేష కృషి చేశారు. భారత దేశానికి అనుకూలమైన ఆయుధాలను ఈ యుద్ధ విమానాల్లో అమర్చేలా చేయడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. 


ఎయిర్ కమొడోర్ రాథర్ స్వస్థలం జమ్మూ-కశ్మీరులోని అనంతనాగ్ జిల్లా, బక్షియాబాద్‌. ఆయన సైనిక్ స్కూల్‌లో విద్యనభ్యసించారు. డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పొందారు. అమెరికాలోని ఎయిర్ వార్ కాలేజీలో అకడమిక్ డిస్టింక్షన్ సాధించారు. 


వింగ్ కమాండర్‌గా ఉన్న కాలంలో 2010లో రాథర్ కర్తవ్య దీక్ష, విధుల పట్ల అంకితభావాలకు గుర్తుగా వాయు సేన పతకం పొందారు. 2016లో గ్రూప్ కెప్టెన్‌గా ఉన్న కాలంలో విశిష్ట సేవా పతకం పొందారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో  ‘స్వోర్డ్ ఆఫ్ ఆనర్’ పొందారు. ఆయన డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో డైరెక్టింగ్ స్టాఫ్‌గా సేవలందించారు. మిరేజ్-2000 స్క్వాడ్రన్‌కు నాయత్వం వహించారు. 


శిక్షణ పూర్తి చేసుకున్న 12 మంది పైలట్లు

మన దేశం 36 సూపర్‌సోనిక్ ఒమ్నిరోల్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ కోసం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధ విమానాలను నడిపేందుకు భారత వాయు సేనకు చెందిన 12 మంది పైలట్లు ఫ్రాన్స్‌లో శిక్షణ పూర్తి చేసుకున్నారు. మరికొందరు పైలట్లు దశలవారీగా శిక్షణ పొందుతున్నారు. ఒప్పందం ప్రకారం 36 మంది పైలట్లకు ఫ్రాన్స్‌లో శిక్షణ ఇస్తారు.


Updated Date - 2020-07-29T00:00:15+05:30 IST