కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్రంపై అట్టుడికిన పరిషత్‌

ABN , First Publish Date - 2022-03-16T17:24:23+05:30 IST

కశ్మీర్‌ ఫైల్స్‌ అంశం విధానపరిషత్‌ను మంగళవారం కుదిపేసింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలతో అట్టుడికింది. ఒకదశలో సభ పూర్తిగా నియంత్రణ తప్పడంతో కొద్దిసేపు వాయిదా వేయాల్సి వచ్చింది.

కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్రంపై అట్టుడికిన పరిషత్‌

                      - గుజరాత్‌ ఫైల్స్‌ కూడా చూపాలని కాంగ్రెస్‌ సభ్యుల డిమాండ్‌ 


బెంగళూరు: కశ్మీర్‌ ఫైల్స్‌ అంశం విధానపరిషత్‌ను మంగళవారం కుదిపేసింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలతో అట్టుడికింది. ఒకదశలో సభ పూర్తిగా నియంత్రణ తప్పడంతో కొద్దిసేపు వాయిదా వేయాల్సి వచ్చింది. కార్యకలాపాలు ప్రారంభమవుతూనే సభాపతి బసవరాజ్‌ హొరట్టి కశ్మీర్‌ఫైల్స్‌ సినిమాకు సంబంధించి చేసిన ప్రకటనే వివాదానికి కారణంగా మారింది. ఈ సినిమాను వీక్షించాల్సిందిగా సభాపతి కోరడాన్ని ప్రతిపక్షనేత బీకే హరిప్రసాద్‌ మండిపడ్డారు. గుజరాత్‌ మారణహోమంపై కూడా చిత్రాలు వచ్చాయని, వాటిని కూడా సభ్యులకు చూపిస్తే బాగుండేదని బీకే హరిప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం బడ్జెట్‌పై చర్చ జరగనీయకుండా బలవంతంగా ఈ సినిమా చూపిస్తోందని కాంగ్రెస్‌ సభ్యుడు సలీం అహ్మద్‌ మండిపడ్డారు. సహకారశాఖ మంత్రి సోమశేఖర్‌ జోక్యం చేసుకుని ఇష్టం ఉన్నవారు చూడవచ్చునని, తప్పనిసరికాదని బదులిచ్చారు. తమకు అనుకూలంగా ఉండే సినిమాలను చూపించి ప్రజలలో విద్వేషాలు రేపడం బీజేపీకి అలవాటేనంటూ హరిప్రసాద్‌ విరుచుకుపడ్డారు. ఆయన ప్రధాని మోదీపై చేసిన విమర్శలకు బీజేపీ సభ్యులు తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేశారు. సభా నాయకుడు కోట శ్రీనివాసపూజారి మాట్లాడుతూ ప్రతిపక్ష సభ్యులు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. సభలో ఏ సినిమా చూడాలో మీరు చెప్పాల్సిన అవసరం లేదు... గతంలో సభలో నీలిచిత్రాలు వీక్షించిన ఘనత మీదంటూ కాంగ్రెస్‌ సభ్యులు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ సభ్యులు తమ తీరుతోనే ప్రజలకు దూరమవుతున్నారని మంత్రి కోట శ్రీనివాసపూజారి విరుచుకుపడ్డారు. ఒకదశలో కాంగ్రెస్‌ సభ్యులు పోడియంలోకి దూసుకొచ్చి ధర్నా చేపట్టారు. బీకే హరిప్రసాద్‌కు, మంత్రి బైరతి బసవరాజ్‌కు తీవ్ర వాగ్వాదం జరిగింది. సభ పూర్తిగా అదుపు తప్పడంతో హొరట్టి కొద్దిసేపు వాయిదా వేశారు. అనంతరం కూడా ఇదే చర్చ కొనసాగింది. చివరకు సభాపతి జోక్యం చేసుకుని సినిమాను బలవంతంగా ఎవరికీ చూపించడం లేదని, ఇష్టం ఉన్నవారే చూడవచ్చునని చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం సభాపతి ప్రశ్నోత్తరాలు చేపట్టారు. 

Updated Date - 2022-03-16T17:24:23+05:30 IST