కాశీ విశ్వనాథ ఆలయానికి స్థలం అప్పగించిన ముస్లింలు

ABN , First Publish Date - 2021-07-24T01:20:03+05:30 IST

కాశీ విశ్వనాథ ఆలయం-జ్ఞానవాపి మసీదు కేసు అనూహ్య మలుపు తిరిగింది. మతసామరస్యం..

కాశీ విశ్వనాథ ఆలయానికి స్థలం అప్పగించిన ముస్లింలు

వారణాసి: కాశీ విశ్వనాథ ఆలయం-జ్ఞానవాపి మసీదు కేసు మలుపు తిరిగింది. మతసామరస్యం వెల్లి విరిసింది. కాశీ విశ్వనాథ కారిడార్ కోసం 1700 చదరపు అడుగుల స్థలాన్ని ముస్లిం పెద్దలు కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్టుకు అప్పగించారు. ఇందుకు ప్రతిగా, జ్ఞానవాపి మసీదు, కాశీ విశ్వనాథ ఆలయానికి దూరంగా ఉన్న 1000 చదరపు అడుగుల స్థలాన్ని ముస్లింలకు ఆలయ పాలకవర్గం ఇచ్చింది.


''కేసు ఇప్పటికీ కోర్టులోనే ఉంది. ప్రభుత్వం కారిడార్ నిర్మాణం జరుపుతోంది. వాళ్లు స్థల స్వాధీనం చేయాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని మా వాళ్లతో చర్చించాం. కాశీ విశ్వనాథ ఆలయం కారిడార్ కోసం 1700 చదరపు అడుగులు అప్పగించేందుకు మసీదు బోర్డు అంగీకరించింది'' అని అంజుమన్ ఇంతజమియా మసీదు సంయుక్త కార్యదర్శి ఎస్.ఎం.వాసిన్ తెలిపారు.


మసీదు సర్వేకు అనుమతించిన కోర్టు

ఈ ఏడాది ప్రారంభంలో కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలోని మసీదు ప్రాంతంలో సర్వే జరిపేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు వారణాసి కోర్టు అనుమతి ఇచ్చింది. మదిరం-మసీదు వివాదంపై విచారణ జరుపుతున్న కోర్టు ఐదుగురు ఆర్కియాలజికల్ నిపుణులతో కమిటీ ఏర్పాటుకు ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను జ్ఞానవాపి మసీదు మేనేజిమెంట్ కమిటీ హైకోర్టులో సవాలు చేసినట్టు తెలుస్తోంది. కాగా, కాశీ విశ్వనాథ ఆలయాన్ని అప్పటి పాలకుడు ఔరంగజేబు కూల్చివేశాడని, అనంతరం 1669లో జ్ఞానవాపి మసీదు నిర్మాణం జరిగిందని ఆలయం తరఫున పిటిషన్ వేసిన విజయ్ శంకర్ రస్తోగి వాదనగా ఉంది. మసీదు నిర్మించిన స్థలం హిందువులకు చెందినదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2021-07-24T01:20:03+05:30 IST