- ద్రావిడ తరహా పాలనపై శిక్షణా శిబిరాలు
- డీఎంకే జిల్లా నేతల సభలో తీర్మానం
చెన్నై: వచ్చే యేడాది దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శతజయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనం నిర్వహించాలని డీఎంకే నిర్ణయించింది. ఆ సందర్భంగా రాష్ట్ర మంతటా ద్రావిడ తరహా పాలనపై శిక్షణా శిబిరాలను పెద్ద యెత్తున నిర్వహించాలని డీఎంకే జిల్లా కార్యదర్శుల సమావేశం తీర్మానించింది. తేనాంపేటలోని అన్నా అరివాలయంలో డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అధ్యక్షతన శుక్రవారం ఉదయం జరిగిన సమావేశంలో మంత్రులు దురైమురుగన్, పొన్ముడి, ఎంపీలు టీఆర్ బాలు, ఎ.రాజా, పార్టీ ప్రముఖులు ఆలందూరు భారతి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో డీఎంకే యేడాది పాలనలో అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు, నెరవేర్చిన ఎన్నికల హామీలపై రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా శాఖ నేతలు ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఓ తీర్మానం చేశారు. ఇదే విధంగా నగరంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహావిష్కరణ చేసేందుకు అంగీకరించిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ధన్యవాదాలు తెలుపుతూ మరొక తీర్మానం చేశారు. ఇక వచ్చే ఏడాది కరుణాధి శతజయంతి వేడుకలను వాడవాడలా భారీ ఎత్తున నిర్వహించేందుకు జిల్లా కార్యదర్శులు తగు సన్నాహాలు చేపట్టాలని కోరుతూ తీర్మానం చేసి ఆమోదించారు. కరుణ శతజయంతి వేడుకల్లో భాగంగానే ద్రావిడ తరహా పాలనపై నగరాలలో, జిల్లా కేంద్రాల్లో శిక్షణా సభలు ఏర్పాటు చేయాలని ఆ తీర్మానంలో పేర్కొన్నారు. కరుణ విగ్రహావిష్కరణ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన సేవలను కీర్తిస్తూ మరొక తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. సామాజిక న్యాయాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ పెరియార్, అన్నాదురై, కరుణానిధి ఆశయాలకు అనుగుణంగా డీఎంకే ప్రభుత్వ పాలన కొనసాగుతోందని, ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో దేశవిద్రోహశక్తులు, దుష్టశక్తులు శాంతి భద్రతలకు విఘాతం కల్పించేందుకు సిద్ధమవుతున్నాయని, వీటిని నిరోధించే దిశగా పార్టీ శ్రేణులు, ప్రత్యేకించి జిల్లా కార్యదర్శులు అప్రమత్తంగా వ్యవహరించి ఆ దుష్టశక్తుల బారి నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు సిద్ధం కావాలని పిలుపునిస్తూ మరో తీర్మానం చేశారు.
ఇవి కూడా చదవండి