Apr 16 2021 @ 23:19PM

కార్తీక్‌ ఆర్యన్‌పై కరణ్‌ కన్నెర!

యువ కథానాయకుడు కార్తీక్‌ ఆర్యన్‌పై దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌ కన్నెర చేశారా? తమ సంస్థ నిర్మించే చిత్రాల్లో కార్తీక్‌ ఆర్యన్‌ నటించడానికి వీలు లేకుండా ఆయన అనధికార నిషేధం విధించారా? అంటే... ముంబై వర్గాలు ‘అవును’ అనే అంటున్నాయి. కార్తీక్‌ ఆర్యన్‌, జాన్వీ కపూర్‌, ఓ కొత్త నటుడితో ‘దోస్తానా 2’ చేస్తున్నట్టు 2019లో కరణ్‌ జోహార్‌ ప్రకటించారు. ఆ ఏడాది ఆఖరులో కొంతభాగం చిత్రీకరణ చేశారు. కరోనా కారణంగా తర్వాత చేయలేదు. ఈ చిత్రానికి డేట్స్‌ అడ్జస్ట్‌ చేయకుండా, కొన్ని మార్పులు చేయమని కార్తీక్‌ ఆర్యన్‌ కోరాడట. దాంతో అతడిని సినిమా నుంచి తప్పించారు. దీని వల్ల కరణ్‌ జోహార్‌ ధర్మ ప్రొడక్షన్స్‌కు నష్టమే.


కార్తీక్‌ ఆర్యన్‌తో చిత్రీకరించిన సన్నివేశాలను పక్కనపెట్టి, మరొకరితో మళ్లీ ష్రెష్‌గా షూటింగ్‌ చేయాలి. అందుకు, బోల్డంత ఖర్చవుతోంది. ఈ సినిమా విషయంలో ఏర్పడిన పరిస్థితులతో ఇకపై కార్తీక్‌ ఆర్యన్‌తో సినిమాలు చేయకూడదని కరణ్‌ జోహార్‌ నిర్ణయించుకున్నారట. ‘గుంజన్‌ సక్సేనా’ దర్శకుడు శరణ్‌ శర్మ, కార్తీక్‌ ఆర్యన్‌ కాంబినేషన్‌లో చేయాలనుకున్న ‘లక్ష్య’ను క్యాన్సిల్‌ చేశారట.


‘దోస్తానా 2’ను బాయ్‌కాట్‌ చేస్తారా?

‘దోస్తానా 2’ నుంచి కార్తీక్‌ ఆర్యన్‌ను తప్పించారనే వార్త వచ్చిన తర్వాత, ట్విట్టర్‌లో ఆ సినిమాను బాయ్‌కాట్‌ చేయాలని కొందరు నెటిజన్లు ట్రెండ్‌ చేశారు. సుశాంత్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత పలు హిందీ చిత్రాలను, ముఖ్యంగా స్టార్‌కిడ్స్‌ నటించినవి బాయ్‌కాట్‌ చేయాలనే ట్రెండ్‌ నడిచింది. అది సినిమాలపై ప్రభావమూ చూపింది. కార్తీక్‌ ఆర్యన్‌కి మద్దతుగా మొదలైన ‘బాయ్‌కాట్‌ దోస్తానా 2’ ఎంతదూరం వెళుతుందో చూడాలి.