బాలీవుడ్లో స్వశక్తితో ఎదిగిన నటుడు కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan). ‘ప్యార్ కా పంచ్ నామా’ (Pyaar Ka Punchnama), ‘లుకా చప్పీ’(Luka Chuppi), ‘పతి, పత్నీ ఔర్ వో’ వంటి సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘భూల్ భూలయ్యా-2’ (Bhool Bhulaiyaa 2). కియరా అడ్వాణీ (Kiara Advani) హీరోయిన్గా నటించారు. టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో ఏప్రిల్ 20న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఐదువారాల్లో దాదాపుగా రూ. 185కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది.
‘భూల్ భూలయ్యా-2’ హిట్ కావడంతో భూషణ్ కుమార్ హీరో కార్తిక్ ఆర్యన్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. కోట్ల విలువ జేసే విలాసవంతమైన మెక్ లారెన్ జీటీ(McLaren GT) కారును బాహుమతిగా ఇచ్చారు. దీంతో కార్తిక్ ఆర్యన్ తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. కారుతో దిగిన ఫొటోలను షేర్ చేశారు. ‘‘కష్టానికి ఫలితం తప్పకుండా ఉంటుంది. కానీ, భారత్‌లోనే మొదటి లగ్జరీ కారు మెక్ లారెన్ జీటీని బాహుమతిగా ఇస్తారనుకోలేదు. వచ్చే సారి ప్రైవేట్ జెట్ గిఫ్ట్‌గా ఇవ్వాలి సార్’’ అని కార్తిక్ ఆర్యన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ కారు విలువ దాదాపుగా రూ. 4.7కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో కియారా అడ్వాణీ, టబు కీలక పాత్రలు పోషించారు. ‘భూల్ భూలయ్యా-2’ హిట్ కావడంతో కార్తిక్ ఆర్యన్ తన పారితోషికాన్ని భారీగా పెంచేసినట్టు బీ టౌన్ మీడియాలో పుకార్లు షికార్లు కొట్టాయి. ఈ వదంతులపై కార్తిక్ ఆర్యన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన రెమ్యూనరేషన్ పెరగలేదని చెప్పారు.