Visa Case: కార్తి చిదంబరానికి మూడు రోజుల ఉపశమనం

ABN , First Publish Date - 2022-05-26T22:04:14+05:30 IST

చైనా వీసా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు

Visa Case: కార్తి చిదంబరానికి మూడు రోజుల ఉపశమనం

న్యూఢిల్లీ: చైనా వీసా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తి చిదంబరానికి సీబీఐ అరెస్టు నుంచి మూడు రోజుల ఉపశమనం లభించింది. ఈ నెల 30వ తేదీ వరకు ఆయనను అరెస్టు చేయొద్దంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు సీబీఐని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కేసులో మందస్తు బెయిలు కోరుతూ ఇటీవల కార్తి చిదంబరం (Karti Chidambaram) కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ సీబీఐకి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ ఈ నెల 30న చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. 


ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. పంజాబ్‌లోని మాన్సాలో తల్వాండి సాబో పవర్ లిమిటెడ్‌కు చెందిన 1,980 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించేందుకు చైనాకు చెందిన షాంగ్‌డాంగ్ ఎలక్ట్రిక్ పవర్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌కు ఔట్‌సోర్సింగ్ అప్పగించారు. అయితే, ఈ ప్రాజెక్టు నిర్ణీత  సమయానికి పూర్తయ్యేలా కనిపించకపోవడంతో కంపెనీ అప్రమత్తమైంది. ఆలస్యానికి సంబంధించి జరిమానా నుంచి తప్పించుకునేందుకు చైనా నిపుణులను రప్పించేందుకు ప్రయత్నించింది. 


అయితే, అప్పటికే ప్రాజెక్టు వీసాల పరిమితి దాటిపోవడంతో కంపెనీ కార్తి చిదంబరాన్ని కలిసి 263 మంది చైనా నిపుణులకు అక్రమంగా వీసాలు ఇప్పించేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు గాను కార్తి చిదంబరం ముడుపులు స్వీకరించినట్టు సీబీఐ ఆరోపించింది. పి.చిదంబరం కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన 2011లో ఈ కుంభకోణం జరిగినట్టు సీబీఐ పేర్కొంది. అయితే, ఈ కేసులో చిదంబరాన్ని మాత్రం నిందితుడిగా చేర్చలేదు.

Updated Date - 2022-05-26T22:04:14+05:30 IST