భక్తిశ్రద్ధలతో కార్తీక అమావాస్య పూజలు

ABN , First Publish Date - 2021-12-05T05:36:53+05:30 IST

నంద్యాల పట్టణంలోని పలు శివాలయాలలో కార్తీక అమావాస్య సందర్భంగా శనివారం పూజలు నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో కార్తీక అమావాస్య పూజలు
దుర్గాభోగేశ్వరంలో పూజలు చేస్తున్న శారద జ్ఞాన పీఠాధిపతి

  1. భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు


నంద్యాల(కల్చరల్‌), డిసెంబరు 4: నంద్యాల పట్టణంలోని పలు శివాలయాలలో కార్తీక అమావాస్య సందర్భంగా శనివారం పూజలు నిర్వహించారు. వాసవీమాత ఆలయంలో నగరేశ్వరస్వామికి నవధాన్యాలతో అలంకరించారు. 12 మట్టి లింగాలతో ద్వాదశ జ్యోతిర్గింగాల పూజ, తామర గింజలతో మహాలింగార్చన నిర్వహించారు. కార్యక్రమంలో మహిళా మండలి సభ్యులు ఇందుమతి, రోజా రమణి, కల్పన, భక్తులు పాల్గొన్నారు. విశ్వనగర్‌లోని గాయత్రీమాత ఆలయంలో శివుడికి భక్తులు పూజలు నిర్వహించారు. బసవన్నగుడిలో పార్వతీపరమేశ్వరుల కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో విశ్వరూపాచారి, విజయ లక్ష్మీ, భక్తులు పాల్గొన్నారు.


ఓర్వకల్లు: మండలంలోని కొమ్ముచెరువు ఆంజనేయ స్వామి ఆలయం తోపాటు ఓర్వకల్లు, కన్నమడకల, పూడిచెర్ల, నన్నూరు, ఉయ్యాలవాడ, హుశేనాపురం, కాల్వబుగ్గ, కొమ్ముచెరువు, భైరాపురం గ్రామాల్లోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసింది. శనివారం కార్తీక మాసం అమావాస్య సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కొమ్ముచెరువుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి ఆకు పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. మహిళలు భారీగా తరలివచ్చి ఆంజనేయస్వామికి కాయకర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం దీపాలు వెలిగించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ మల్లికార్జున ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించినట్లు నిర్వహకుడు రమేష్‌ తెలిపారు. 


గడివేముల: దక్షిణ కాశీగా పే రు గాంచిన దుర్గాభోగేశ్వరం శనివారం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక అమావాస్య పురస్కరించుకొని శారద జ్ఞానపీఠాధిపతి శివయోగేంద్ర సరస్వతి దుర్గాభోగేశ్వరుడికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆధ్యాత్మిక బోధనలు చేశారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి చంద్రశేఖర్‌రెడ్డి, ఆలయ చైర్మన్‌ గోపాలయ్య శివయోగేంద్రసరస్వతికి భోగేశ్వరుడి ప్రతిమ ఇచ్చి సన్మానించారు. తరలివచ్చిన భక్తులకు నంద్యాల పట్టణానికి చెందిన పాలాది సూర్యనారాయణ అన్నదానం చేశారు. కార్యక్రమంలో ధర్మకర్తలు రమణయాదవ్‌, మహేశ్వర్‌రెడ్డి, సుశీలమ్మ పాల్గొన్నారు. 


చాగలమర్రి: చాగలమర్రి గ్రామంలోని కోదండరామాలయంలో శనివారం కార్తీక అమావాస్య సందర్భంగా పూజలు చేశారు. స్వామివారికి అన్నంతో అలంకరించారు. మహిళలు పార్వతి పరమేశ్వరులకు వడిబియ్యం, లలిత పారాయణం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 


ఉయ్యాలవాడ: మండలంలోని ఉయ్యాలవాడలో వెలసిన కోదండరామాలయంలో శనివారం కార్తీక అమావాస్య పూజలు శనివారం ఘనంగా జరిగాయి. అర్చకుడు తంబళ్ల మోహనక్రిష్ణ స్వామి వారికి అభిషేకం తదితర పూజలు చేశారు. భక్తులు శంఖ చక్రాల ఆకారంలో దీపాలు వెలిగించారు. కార్యక్రమంలో మండల ఎంపీపీ బుడ్డా భాగ్యమ్మ, ఉప సర్పంచ్‌ బుడ్డా భారతి పాల్గొన్నారు.


శిరివెళ్ల: నంద్యాల-గిద్దలూరు ప్రధాన రహదారిలో నల్లమల అటవీలో వెలసిన సర్వలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కార్తీక అమావాస్యను పురస్కరించుకుని స్వామివారికి శనివారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు రంగనాయకులు స్వామి ఆధ్వర్యంలో వేకువజామునే స్వామి వారి మూలవిరాట్‌కు అభిషేకం, ఆకుపూజ, కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జనార్ధన, చైర్మన్‌ కొట్టె జయలక్ష్మమ్మ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కోటపాడు, వెంకటాపురం, యర్రగుంట్ల, బోయలకుంట్ల, శిరివెళ్ల గ్రామాల్లోని శివాలయాల్లో భక్తులు పూజలు చేశారు. 




Updated Date - 2021-12-05T05:36:53+05:30 IST