కమనీయ మాసం.. కార్తికం

ABN , First Publish Date - 2020-11-21T09:56:43+05:30 IST

కాలచక్రంలోని తెలుగు మాసాల్లో కార్తిక మాసానికి విశేష ప్రాధాన్యం ఉంది. ఆధ్యాత్మిక సాధనకు అత్యంత అనుకూలమైనది, పవిత్రమైనది ఈ మాసం.

కమనీయ మాసం.. కార్తికం

కాలచక్రంలోని తెలుగు మాసాల్లో కార్తిక మాసానికి విశేష ప్రాధాన్యం ఉంది. ఆధ్యాత్మిక సాధనకు అత్యంత అనుకూలమైనది, పవిత్రమైనది ఈ మాసం. శివకేశవులకు ప్రీతిపాత్రమైనది. అందుకే ఈ మాసంలో ఏదైనా మంచి పని చేసినప్పుడు.. ‘కార్తిక దామోదర ప్రీత్యర్థం’’ అని ఆచరించాలని శాస్త్రవచనం. ఈ మాసంలో నదులు చెరువులు, బావులలో నీరు తేటపడి స్వచ్ఛమై, సూర్యరశ్మి వలన అఖండ తేజస్సును, బలాన్ని కలిగి ఉంటాయని ప్రతీతి. అందుకే ఈ నెలలో నదీస్నానాలు చేయడం మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. జలం పవిత్రమౌతుంది కాబట్టి నదులలో, ప్రవాహజలాల్లో ఉషోదయ స్నానం చేయాలని సూచించాయి.   శరీరాలకు మంచి శక్తినిస్తుంది ఈ స్నానం. 


తులారాశింగతే సూర్యే-గంగా త్రైలోక్యపావనీ

సర్వత్ర ద్రవరూపేణ - సాసంపూర్ణ భవేత్తదా

అనే మంత్రాన్ని పఠిస్తూ కార్తిక మాసంలో స్నానం చేయాలి. కార్తిక మాసం అనగానే శివుడికి ఇష్టమైన మాసం అని చాలామంది అనుకుంటారు. కానీ, ఈ మాసం హరిహరులిద్దరికీ ప్రీతిపాత్రమైనది. జన్మ జన్మాంతర పాపాలను దహించే ఈ మాసం స్నానానికి, దీపదానాలకు ప్రసిద్ధిచెందినది. శరదృతువులో చంద్రుడు పుష్టిమంతుడై తన చల్లని కిరణాల ద్వారా సకల జీవులకూ ధీశక్తిని ప్రసాదిస్తాడు. కార్తిక మాసంలో విష్ణ్వాలయంలోగానీ, శివాలయంలోగాని ఎక్కువగా గడపాలి. భగవత్‌ ధ్యానం, స్తోత్రం జపం చేయాలి. శివ, విష్ణ్వాలయాలు లేనిచో రావిచెట్టు మొదట్లోగానీ, తులసివనంలోగానీ భగవదారాధన చేయాలి.కార్తికంలో దీపదానం ఉత్తమఫలం యిస్తుంది. ఈ మాసంలో శివార్చన చేసిన వారికి ఈతి బాధలు, గ్రహ దోషాలు ఉండవు. కార్తిక పాడ్యమి నాడు గోపూజ విశేషం. శుద్ధ విదియ రోజున సోదరి చేతి వంట తినడం ఆచారం. శుద్ధ చవితిని  నాగుల చవితిగాను, పంచమిని నాగుల పంచమిగాను పాటించి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయడం వల్ల అనారోగ్యాలు, అరిష్టాలు దరిచేరవని నమ్మిక. దేవదానవులు క్షీరసాగర మథనం చేసిన కార్తిక శుద్ధ ద్వాదశిని చిలుకు ద్వాదశిగా, క్షీరాబ్ది ద్వాదశిగా జరుపుకొంటారు.


ఇక కార్తిక పౌర్ణమినాడు గడ్డిని తోరణాలుగ చేసి శివాలయాల్లో మంట వేసి, దాని క్రిందుగా పార్వతీదేవి విగ్రహాన్ని మూడు సార్లు తిప్పుతారు. దీన్నే జ్వాలా తోరణం అంటారు. ఏకాదశి నుండి పూర్ణిమ వరకు ఐదు రోజులు భీష్మపంచక వ్రతం అంటారు. ఈ రోజుల్లో శివ, విష్ణు మంత్రాలను ఉపదేశంగా పొందుతారు. మాసాంతంలో కొన్ని ప్రాంతాల్లో పోలిని స్వర్గానికి పంపడం అనే ప్రక్రియతో కార్తిక దీపాలకు స్వస్తి పలుకుతారు. 


                                                                                పి.వి.సీతారామమూర్తి, 9490386015

Updated Date - 2020-11-21T09:56:43+05:30 IST