టెక్నాలజీకి కరోనా ముప్పు!

ABN , First Publish Date - 2020-02-08T05:30:00+05:30 IST

యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ టెక్నాలజీ రంగం మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఎలకా్ట్రనిక్‌ వస్తువుల ఉత్పత్తికి ప్రధాన కేంద్రమైన...

టెక్నాలజీకి కరోనా ముప్పు!

యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ టెక్నాలజీ రంగం మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఎలకా్ట్రనిక్‌ వస్తువుల ఉత్పత్తికి ప్రధాన కేంద్రమైన చైనాలో ఈ వైరస్‌ విజృంభిస్తుండడంతో స్మార్ట్‌ఫోన్ల నుంచి అనేక ఎలక్ర్టానిక్‌ వస్తువుల అమ్మకాలపైన ప్రభావం పడుతోంది. అదే సమయంలో కరోనా వైరస్‌ గురించి జాగ్రత్తల పేరుతో ఫిషింగ్‌ దాడులు మొదలయ్యాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా డేటా మొత్తం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.


స్మార్ట్‌ఫోన్లు, ఇతర డివైజ్‌లలో స్టోరేజ్‌ కోసం నాండ్‌ మెమరీ చిప్‌లను ఉపయోగిస్తుంటారు. వీటి తయారీలో శాంసంగ్‌, హైనిక్స్‌ వంటి సంస్థలదే ఎక్కువ మార్కెట్‌ వాటా. ఆయా స్టోరేజ్‌ చిప్‌ల ఉత్పత్తి కేంద్రాలు చైనాలో ఉన్నాయి. కరోనా వైరస్‌ విస్తరించిన వూహాన్‌ నగరానికి అవి కేవలం 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. దీనివల్ల కొన్ని నెలలపాటు స్టోరేజ్‌ డివైజ్‌లు, స్మార్ట్‌ఫోన్ల ధరలపై ప్రభావం ఉంటుందని ప్రముఖ మార్కెట్‌ పరిశోధనా సంస్థ ట్రెండ్‌ ఫోర్స్‌ భావిస్తోంది. మెమరీ కార్డులు, హార్డ్‌ డిస్కులు, ఇతర స్టోరేజ్‌ డివైజ్‌ల ధరలపై కూడా ప్రభావం ఉండబోతోంది. కొన్నిచోట్ల మెకానికల్‌గా ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ, రవాణా ఏర్పాట్లు సక్రమంగా లేకపోవడం కూడా ఇబ్బందికరంగా మారింది. మరోవైపు యాపిల్‌ ఐఫోన్‌లను చైనాలో తయారుచేసే ఫాక్స్‌కాన్‌ సంస్థ రెండు వారాల పాటు అక్కడ పనిచేసే ఉద్యోగులను క్వారంటైన్‌ చేయటం వల్ల కూడా యాపిల్‌ ఐఫోన్‌ల తయారీ బాగా తగ్గనుంది. 


ఫిషింగ్‌ దాడులు

కరోనా వైరస్‌ గురించి ప్రజల్లో నెలకొన్న ఆందోళనను సొమ్ము చేసుకునేందుకు పలురకాల ఫిషింగ్‌ ఇ-మెయిల్స్‌ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఇన్‌ బాక్స్‌లకు వస్తున్నాయి. కరోనా వైరస్‌ గురించి కొన్ని జాగ్రత్తలు అంటూ ఒక మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌ డాక్యుమెంట్‌ని అటాచ్‌ చేసి పంపిస్తున్నారు. దాన్ని డౌన్‌లోడ్‌ చేసి ఓపెన్‌ చేస్తే, అందులో రహస్యంగా ఒక మాక్రో దాగి ఉండి కంప్యూటర్‌ని ఇన్‌ఫెక్ట్‌ చేస్తుంది. ఆ తర్వాత కంప్యూటర్‌లో ఉండే సమాచారం మొత్తం హ్యకర్‌కి చేరవేయడంతో పాటు, ఎల్లప్పుడూ కమాండ్‌ కంట్రోల్‌ సర్వర్‌కి కనెక్ట్‌ అయి మన కంప్యూటర్‌ను పూర్తిగా కంట్రోల్‌లోకి తీసుకునే ప్రమాదం ఉంది. ఫిషింగ్‌ లింకులను క్లిక్‌ చేస్తే యూజర్లకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని డేటా మైనింగ్‌ చేసే వీలుంది. కరోనా వైరస్‌ పేరిట ఒక ఎగ్జిక్యూటబుల్‌ ఫైల్‌ కూడా సర్క్యులేట్‌ అవుతోంది. దీన్ని క్లిక్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకున్న యూజర్లకు ఎమోటెంట్‌ అనే ట్రోజాన్‌ కంప్యూటర్‌లోకి వస్తోంది.


ఫోన్లకి అతుక్కుపోతున్నారు

గత నెల రోజులుగా చైనాలో అధిక శాతం మంది టిక్‌టాక్‌ వంటి షార్ట్‌ వీడియో అప్లికేషన్లు చూస్తూ, గేమ్స్‌ ఆడుతూ ఇంట్లోనే సమయం గడుపుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ప్రజలు గ్యాడ్జెట్స్‌తో గడుపుతున్నట్లు నిరూపితమైంది. కచ్చితంగా టెక్నాలజీ రాకముందు ఇలాంటి ఉపద్రవం వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులకు, ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉందనే చెప్పాలి. చైనా మాత్రమే కాదు, ఇండియాలో కూడా ఇటీవల కొన్ని రోజులుగా ఎలాంటి అవసరం లేకపోతే ప్రజలు బయటకు వెళ్లడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. అధిక సమయం గ్యాడ్జెట్స్‌, నెట్‌ఫ్లిక్స్‌,  అమెజాన్‌ ప్రైమ్‌లో వీడియోలు చూస్తూ గడుపుతున్నారు.


మెషిన్‌ లెర్నింగ్‌కి పని!

మరోవైపు మెషిన్‌ లెర్నింగ్‌ అల్‌గారిథమ్స్‌ ఆధారంగా కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా ఎంతమందికి విస్తరించే అవకాశం ఉందో అంచనా వేస్తున్నారు. ఈ వైరస్‌ ఎలా విస్తరిస్తోందో తెలుసుకునేందుకు భారీ మొత్తంలో డేటా సెట్స్‌ ఆధారంగా విశ్లేషించే ప్రయత్నాలు చేస్తున్నారు. టెక్నాలజీ సాయంతో ప్రజలను అప్రమత్తం చేయడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. 


కరోనా వైరస్‌ తాజా సమాచారం తెలుసుకోవాలంటే ఈ లింక్‌ని క్లిక్‌ చేయండి అంటూ కొంతమంది వాట్సా్‌పలో కొన్ని లింకులను షేర్‌ చేస్తున్నారు. వాటిని క్లిక్‌ చేస్తే బాధితుల వ్యక్తిగత సమాచారం తస్కరణకు గురవుతోంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలాంటి లింక్‌లను క్లిక్‌ చేయకండి, ఇతరులకు షేర్‌ చేయకండి. యూట్యూబ్‌లో కూడా హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, వైజాగ్‌ వంటి నగరాల్లో కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయని జనాలను భయపెట్టే విధంగా కొందరు వీడియోలు అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఆరోగ్యశాఖ, అధికారులు అధికారికంగా ప్రకటన చేసేంత వరకు ఇలాంటి వదంతులను ఎట్టి పరిస్థితిల్లోనూ నమ్మకండి.



- నల్లమోతు శ్రీధర్‌

fb.com/nallamothusridhar

Updated Date - 2020-02-08T05:30:00+05:30 IST