కొవిడ్‌ నిబంధనలు గాలికి!

ABN , First Publish Date - 2021-11-29T05:40:03+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ నిబంధనలు పూర్తిగా వదిలేశారు. వివాహాలు, రాజకీయ సమావేశాలు, ఇతర కార్యక్రమాల్లో ఏమాత్రం నిబంధనలు పాటించడం లేదు.

కొవిడ్‌ నిబంధనలు గాలికి!

ఒమైక్రాన్‌ వేరియంట్‌ని ఎదుర్కొనేందుకు సన్నద్ధత ఏది?

మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం లేదు

గుంటూరు, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొవిడ్‌ నిబంధనలు పూర్తిగా వదిలేశారు. వివాహాలు, రాజకీయ సమావేశాలు, ఇతర కార్యక్రమాల్లో ఏమాత్రం నిబంధనలు పాటించడం లేదు. బయటకు వచ్చినప్పుడు మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం, చేతులు శానిటైజేషన్‌ చేసుకోవడం వంటివి తూతూ మంత్రంగా మారిపోయాయి. మాల్స్‌, విద్యాసంస్థలు, మార్కెట్లలో థర్మల్‌ స్ర్కీనింగ్‌ మానేశారు. గతంలో నిత్యం వేలల్లో నిర్వహించిన కరోనా టెస్టులు ఇప్పుడు ఎక్కడ నిర్వహిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. కలెక్టరేట్‌ ఎదుట ఉన్న 24 గంటల కొవిడ్‌ పరీక్ష కేంద్రాన్ని మూసేశారు.  కాగా ఒమైక్రాన్‌ వేరియంట్‌ ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న నేపథ్యంలో జిల్లాలో వ్యాప్తి చెందితే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. 

కరోనా తొలి దశ తర్వాత నిర్లిప్తత చోటు చేసుకోవడం వలనే సెకండ్‌ వేవ్‌ సమయంలో జిల్లాలో విపత్కరమైన పరిస్థితులు తలెత్తాయి. ఆస్పత్రుల్లో పడకలు దొరకక, ప్రాణవాయువు నిల్వలు లేక అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.  నిత్యం అధికారికంగానే 2 వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు జిల్లాలో నమోదయ్యాయి. దాని నుంచి ఇంకా గుణపాఠం నేర్చుకోవడం లేదు. మాస్కులు పెట్టుకోకపోతే కొద్ది రోజులు  కేసులు నమోదు చేయించారు. అయితే క్రమేపీ నిఘా కొరవడటంతో పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చాయి. ఆస్పత్రుల సన్నద్ధత కూడా లేదు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పరంగా చూసుకొంటే ఒక్క డోసు మాత్రం 38 లక్షల వరకు చేయించుకొన్నారు. రెండు డోసు మాత్రం ఇందులో సగం శాతం కూడా పూర్తి కాలేదు. దీనిని పరిగణనలోకి తీసుకొంటే కరోనావైరస్‌ కొత్త వేరియంట్‌ దాడి చేయడం ప్రారంభిస్తే జిల్లా అంత సురక్షితమన జోన్‌లో ఉన్నట్లు కాదు. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్‌ వ్యాప్తి చెందకుండా కొవిడ్‌ నిబంధనలు అందరూ పాటించేలా చేయాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంది. 


Updated Date - 2021-11-29T05:40:03+05:30 IST