పాఠశాలల్లో కొవిడ్‌ ఇన్‌చార్జి తప్పనిసరి

ABN , First Publish Date - 2021-04-16T05:10:47+05:30 IST

జిల్లాలో రోజు రోజుకు కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ తాజాగా నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది.

పాఠశాలల్లో కొవిడ్‌ ఇన్‌చార్జి తప్పనిసరి

నిబంధనలపై విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ

గుంటూరు(విద్య), ఏప్రిల్‌ 15: జిల్లాలో రోజు రోజుకు కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాశాఖ తాజాగా నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రతి పాఠశాలలో కొవిడ్‌ ఇన్‌చార్జిగా ఒక ఉపాధ్యాయుడిని తప్పనిసరిగా నియమించాలని ఆదేశించారు. అదేవిధంగా పాఠశాలకు వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, శానిటైజర్‌ బాటిల్‌ దగ్గర ఉంచుకోవాలని, భౌతిక దూరం పాటించేలా చూడాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలుంటే తల్లిదండ్రులకు వెంటనే తెలియజేయాలి. మధ్యాహ్న భోజనం పంపిణీ చేసే సమయంలో భౌతిక దూరం పాటించేలా చూడాలి. విద్యార్థులు ముందుగా చేతుల్ని సబ్బుతో శుభ్రం చేసుకున్న తరువాతే భోజనం చేయాలి. భోజనం ప్లేట్‌ మరోసారి శుభ్రం చేసుకోవడం లేదా ఇంటి వద్ద నుంచే ప్లేట్‌ తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ఎవరి మంచినీటి బాటిల్‌ వారే తెచ్చుకోవాలి. పెన్నులు, పెన్సిళ్లు, పుస్తకాలు మార్చుకోవడం సరికాదు. సాధ్యమైనంత వరకు విద్యార్థులు ప్రతిరోజు రెండుపూటల స్నానం చేసేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు దిశానిర్ధేశం చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో  విద్యార్థుల హాజరును యాప్స్‌ద్వారా ఏరోజుకారోజు అప్‌లోడు చేయాలి. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల హాజరును ప్రతి రోజు బయోమెట్రిక్‌ ద్వారా యాప్స్‌లో అప్‌లోడు చేయాలి. ఉపాధ్యాయుల ఓడీ, సెలవులను తప్పనిసరిగా యాప్స్‌లో నమోదు చేయాలి. మధ్యాహ్న భోజన పథకం వివరాలు యాప్‌లో నమోదు చేయాలి. ప్రతిపాఠశాలలో ఉపాధ్యాయులు వ్యక్తిగత శ్రద్ధతో కొవిడ్‌ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని డీఈవో ఆర్‌ఎస్‌ గంగాభవాని సూచించారు.

Updated Date - 2021-04-16T05:10:47+05:30 IST