బడుల్లో భయం

ABN , First Publish Date - 2022-01-29T05:55:33+05:30 IST

కరోనా భయం విద్యాసంస్థలను వెంటాడుతోంది. విద్యాసంస్థలను కరోనా వైరస్‌ చుట్టేస్తోంది.

బడుల్లో భయం

పాఠశాలల్ని  చూట్టేస్తున్న కరోనా

చిలకలూరిపేట గురుకులంలో కలకలం

గుంటూరు(విద్య), చిలకలూరిపేట, జనవరి 28:  కరోనా భయం విద్యాసంస్థలను వెంటాడుతోంది. విద్యాసంస్థలను కరోనా వైరస్‌ చుట్టేస్తోంది. జలుబు, జ్వరం, దగ్గులతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో అటు తల్లిదండ్రుల్లో, ఇటు విద్యాశాఖ వర్గాల్లో ఆందోళన నెలకొంది. జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో కొన్ని రోజులుగా కరోనా కేసులు వెలుగు చూస్తోన్నాయి. ధర్మల్‌ స్రీనింగ్‌ లేకపోవడం, గదుల్లో రోజుమార్చి రోజు అయినా శానిటైజ్‌ చేయకపోవడం వంటి కారణాలతో అనేక కరోనా లక్షణాలతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు.  ఈ క్రమంలో కొన్ని కార్పొరేట్‌ కళాశాలలు శనివారం నుంచి ఆఫ్‌లైన్‌ తరగతులు మానేసి ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించేందుకు నిర్ణయించాయి. కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఒంటి పూట తరగతులే నిర్వహిస్తున్నాయి. ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి యాజమాన్యాలపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో వారం నుంచి విద్యార్థులు,  ఉపాధ్యాయుల హాజరు తగ్గుతున్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సంక్రాంతి పండుగ తర్వాత సాంఘిక సంక్షేమశాఖ రెసిడెన్సీయల్‌ స్కూల్స్‌, కేజీబీవీల్లో భారీ సంఖ్యలో విద్యార్థుల హాజరుశాతం తగ్గినట్లు ఉపాధ్యాయులు వెల్లడిస్తున్నారు. గుంటూరులోని మున్సిపల్‌, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయులు అనేక మంది కొవిడ్‌ బారిన పడ్డారని సమాచారం.  పాఠశాలలో ఒక్క కేసు వచ్చినా అందరికీ టెస్టులు, శానిటైజ్‌ చేస్తామని విద్యామంత్రి ప్రటించినా ఆ దిశగా ఎక్కడా చర్యలు లేవు. చికలూరిపేటలోని ఏపీ రెసిడెన్షియల్‌ బాలుర పాఠశాలలో కరోనా కలకలం రేగింది. నాలుగు రోజుల క్రితం ఎనిమిది మంది విద్యార్థులకు పాజిటివ్‌రాగా వారిని ఇంటికి పంపించారు. ఆ తర్వాత మరో 140 మంది విద్యార్థులకు జలుబు, జ్వరం లక్షణాలను గుర్తించారు. దీంతో వారిని కూడా ఇళ్లకు పంపించారు. అద్దె భవనంలో ఉన్న కొద్దిపాటి గదుల్లో మిగిలిన 230 మంది విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు.  

1,625 కేసులు.. 25.05 శాతం పాజిటివ్‌

జిల్లాలో కొత్తగా 1,625 మందికి కరోనా వైరస్‌ సోకింది. శుక్రవారం జరిగిన 6,486 శాంపిల్స్‌ టెస్టుల్లో 25.05 శాతం మందికి వైరస్‌ చేరినట్లు నిర్ధారణ జరిగింది. దీంతో యాక్టివ్‌ కేసులు 12,315కి పెరిగాయి. వారిలో 11,881 మంది హోం ఐసోలేషన్‌లో ఉండగా 403 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 31 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. కొవిడ్‌తో పొన్నూరులో ఒకరు మృతి చెందారు. ఇక గుంటూరులో 686, మంగళగిరిలో 138, తాడేపల్లిలో 97, తెనాలిలో 63,  నరసరావుపేటలో 51, బాపట్లలో 42, పెదకాకానిలో 30, రేపల్లెలో 29, చిలకలూరిపేటలో 28, పిడుగురాళ్లలో 27, చేబ్రోలులో 26, దాచేపల్లిలో 25, పొన్నూరు, నాదెండ్లలో 24, మాచర్లలో 21, సత్తెనపల్లిలో 20, ఫిరంగిపురంలో 18, అమరావతి, కొల్లిపరలో 15, నిజాంపట్నంలో 14, అచ్చంపేటలో 13, వట్టిచెరుకూరులో 11, గుంటూరు రూరల్‌, పెదనందిపాడు, ప్రత్తిపాడు, తాడికొండలో 10, వినుకొండ, పెదకూరపాడు, చుండూరు, క్రోసూరు, గురజాలలో 9, మేడికొండూరు, మాచవరం, రొంపిచర్ల, కాకుమాను, తుళ్లూరులో 7, నకరికల్లు, కొల్లూరు, యడ్లపాడులో 6, దుర్గి, వేమూరు, దుగ్గిరాల, కారంపూడిలో 5, రాజుపాలెం, రెంటచింతల, చెరుకుపల్లి, ఈపూరు, వెల్దుర్తిలో 4, నగరం, పిట్టలవానిపాలెం, నూజెండ్ల, అమర్తలూరు, బొల్లాపల్లిల్లో మూడేసి, భట్టిప్రోలు, బెల్లంకొండ, శావల్యాపురం, ముప్పాళ్ల, కర్లపాలెంల్లో రెండేసి కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. 

Updated Date - 2022-01-29T05:55:33+05:30 IST