కరోనా మరణాలెన్ని?

ABN , First Publish Date - 2021-12-07T06:18:57+05:30 IST

కొవిడ్‌ మృతుల సంఖ్య విషయంలో జిల్లా అధికారులు అడ్డంగా దొరికిపోయారు.

కరోనా మరణాలెన్ని?

1,318 మందని అధికారిక లెక్క

2,030 మందికి పరిహారం ఇచ్చామన్న కలెక్టర్‌

ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచన

కరోనా మృతుల సంఖ్యలో అడ్డంగా దొరికిన అధికారులు

గుంటూరు, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ మృతుల సంఖ్య విషయంలో జిల్లా అధికారులు అడ్డంగా దొరికిపోయారు. కరోనా ఫస్టువేవ్‌, సెకండ్‌ వేవ్‌ సమయంలో శ్మశానవాటికలు శవాల దిబ్బలుగా మారినప్పటికీ అవన్ని కొవిడ్‌ మృతులు కాదని జిల్లా అధికారులు కొట్టిపారేశారు. సోమవారం వరకు కూడా రెండు వేవ్‌లలో చనిపోయింది 1,318 మంది మాత్రమేనని చెబుతున్నారు. గుంటూరు డివిజన్‌లో 402, అర్బన్‌లో 315, గురజాల డివిజన్‌లో 140, నరసరావుపేట డివిజన్‌లో 194, తెనాలి డివిజన్‌లో 267 మంది మాత్రమే కొవిడ్‌తో మృతి చెందారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అధికారుల నివేదికలు ఇలా ఉంటే ఇప్పటి వరకు కొవిడ్‌తో మృతి చెందిన 2,030 మంది కుటుంబాలకు రూ.50 వేల వంతున నగదుని జమ చేసినట్లు కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ రెండు రోజుల క్రితం ప్రకటించారు. దీనిని పరిగణనలోకి తీసుకుంటే ఇప్పటికే 712 మంది బాధిత కుటుంబాలు అదనంగా వచ్చాయి. ఇంకా ఎవరికైనా నగదు జమ కాకపోతే వారు కలెక్టరేట్‌లోని డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ రూంలో సంప్రదించాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఇంకా బాధిత కుటుంబాలున్నట్లే లెక్క. 

లెక్కల్లోకి రానివారెందరో..

కొవిడ్‌ తొలి, రెండో దశలు ఉచ్ఛస్థితికి చేరుకున్న సమయంలో కనీసం కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా చేయించుకోలేని నిస్సహాయ పరిస్థితి తలెత్తింది. దాంతో ఎలాంటి పాజిటివ్‌ టెస్టు లేకుండానే ఆస్పత్రులకు రోగులను తీసుకెళ్లి చ నిపోయిన వారు ఉన్నారు. దాంతో ఆ మృతులు కొవిడ్‌ లెక్కలోకి రాలేదు. పైగా ఆ సమయంలో ఎవరికైనా కొవిడ్‌ సోకిందని తెలిస్తే చుట్టుపక్కల వారే కాకుండా కనీసం రక్త సంబంధీకులు కూడా వచ్చి పలకరించలేని పరిస్థితి. ఇక ఎవరైనా కొవిడ్‌తో చనిపోతే వారి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు కూడా చేయించకుండా క్వారంటైన్‌ సెంటర్లలో ఉండిపోయారు. దాంతో వివిధ ఛారిటబుల్‌ ట్రస్టులు అంతిమ సంస్కారాలు నిర్వహించాయి. ఆయా మృతులు కూడా కొవిడ్‌ గణాంకాలలోకి వచ్చి చేరలేదు. 

18 మందికి కరోనా

జిల్లాలో కొత్తగా 18 మందికి కరోనా వైరస్‌ సోకింది. సోమవారం నిర్వహించిన 416 టెస్టుల్లో పాజిటివ్‌ శాతం 4.33గా నమోదైంది. సోమవారం గుంటూరులో 7, రేపల్లెలో 2, తాడేపల్లిలో 2, క్రోసూరులో 1, మంగళగిరిలో 1, తుళ్లూరులో 1, పిడుగురాళ్లలో 1, యడ్లపాడులో 1, భట్టిప్రోలులో 1, కొల్లూరులో 1 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. 

Updated Date - 2021-12-07T06:18:57+05:30 IST