Abn logo
Sep 21 2020 @ 04:14AM

కర్ణుడు తల్లిపోలిక

Kaakateeya

కుంతి - కర్ణుల మధ్య పోలికను కేవలం పాదాలకు సరిపెట్టడం తిక్కనకు 

అంత సహజంగా అనిపించలే దనుకుంటాను, సందర్భాన్ని 

అలానే వుంచి పోలికను 

మొత్తం రూపానికి 

ఆపాదించి సందిగ్ధాన్ని 

తొలగించి స్పష్టత 

చేకూర్చి కర్ణుడిని 

‘తల్లి పోలికలతో 

పుట్టిన కొడుకు’గా 

చెప్పేశాడు. 


మహాభారత కథలో ముఖ్య పాత్రలు కౌరవ పాండవులు, వారికి గురు స్థానీయులైన భీష్మ, ద్రోణ, కృపాచార్య, అశ్వ థ్థామలు, దృతరాష్ర్టుడు అయిఉండగా, ‘‘కర్ణు తల భారతం’’ అనే నానుడి తెలుగు నాట ప్రసిద్ధమై ఉంది. భారత రణాన్ని కౌరవుల పక్షాన భీష్ముడు పది రోజులు, ద్రోణుడు ఐదు రోజులూ నడుపగా కర్ణుడు రెండు రోజులు మాత్రమే నడిపాడు. అయినప్పటికీ, తిక్కన రచిత ఆంధ్ర భారతంలో కర్ణ పర్వానికి ఉన్న ప్రాముఖ్యం మిగతా వాటికి లేదనే అభిప్రాయం కూడా ప్రసిద్ధమైవుంది. పుట్టిన దగ్గర నుంచీ కూడా మహాభారతంలో కర్ణుడిది ఒక వింత జీవితం. స్వతహాగా అపారమైన మానవీయతతో నిండిన జాలిగుండె కలిగిన మనిషి కర్ణుడు. మాట తప్పడం ప్రాణం పోవడంతో సమానమని భావించి, శరీరంపై పుట్టుకతో సహజంగా వచ్చిన అబేధ్యమైన రక్షణ కవచాన్నే వొలిచి ఇచ్చి తనను తాను బలహీనపరుచుకోవడానికి, మృత్యుముఖాన పడవేసుకోవడానికి సైతం వెనుకాడని వ్యక్తి అతడు. విధి కల్పిత పరి స్థితుల ప్రభావం అతడిని జన్మనెత్తిన మొదటి క్షణం నుంచీ వెంటాడింది; మరణం దాకా వెంటాడుతూనే వుంది. పాండవులకు ప్రబల శత్రువుగా, దుర్యోధనునికి అత్యంత సన్నిహితు డైన, నమ్మకముంచిన వ్యక్తిగా పరిణమించ డానికి కారణమయేలాచేసినవీ విధికల్పిత వింత పరిస్థితులే! చివరికి ‘కర్ణుతలభారతం’ అనే నానుడి స్థిరపడే అంతగా మహాభారతంలో కర్ణుడి ప్రాముఖ్యం పెరిగితే, అతడి జీవితంపై విధి కల్పిత పరిస్థితుల ప్రభావం, యుద్ధ రంగంలో దయనీయ పరిస్థితులలో అతని మరణం, సామాన్య ప్రజానీకానికి కర్ణునిపై అంత ఆత్మీయత పెరగాడినికి కారణమయ్యాయి!


చూపులకు కర్ణుడు తల్లి పోలిక! ధర్మరాజు తానుగా ఈ సంగతిని చెబుతాడు మహా భారతం శాంతి పర్వంలో. యుద్ధం ముగిసి, యుద్ధంలో మరణించినవారందరికీ తర్పణాలు వదిలి, ఒక నెల రోజులపాటుగంగా తీరంలో ధృతరాష్ట్ర విదురాది ముఖ్యు లందరినీ వస్త్రాలతో నిర్మించబడిన డేరాలలో ఉంచి కాలం గడుపుతూం డగా, ధర్మరాజును పరామర్శించడానికివచ్చిన నారద మహా మునితో సంభాషణలోనిది సందర్భం! తర్పణాలు వదిలే సందర్భంలో కుంతి నోటినుంచే బయటపడిన సత్యం కర్ణుడు పాండవులలో అగ్రజుడు అన్నది! అది తెలుసుకున్న ధర్మరాజు మనసులో ఎంతగానో దుఃఖి స్తాడు. కర్ణుని రూపాన్ని తలుచుకుంటూ అన్న మాటలు క్రింది పద్యం:

అతనిమేను కుంతి యట్టుల కైవడి

యరయ నేను జూచి యాత్మ నెద్ది

కారణంబొయిట్లుగా ననుచుండుదు; 

నేమి సేయువాఁడ నింకఁ జెపుమ! 

(శాంతి పర్వం, ప్రథమాశ్వాసం, 12వ పద్యం.)

‘‘ ‘అతని మేను’ (అంటే కర్ణుని రూపురేఖలు అనే అర్థంలో) చూపు లకు కుంతిని పోలి వుండడాన్ని చూసి, ‘దీనికి ఏమిటి కారణం?’ అని మనసులో తలపోస్తూ వుండేవాడిని! ఇప్పుడు తెలిసి ఏమి చేయగ లను?’’ అని బాధపడిన ధర్మరాజు మాటలను బట్టి కర్ణుడు రూపంలో కుంతి పోలికతో వుండడాన్ని ధర్మరాజు చాలా సార్లు తన మనసులో అనుకుంటూ వుండేవాడని తెలుస్తుంది.

సంస్కృత భారతంలో ఈ విషయాన్ని వ్యాస మహర్షి తన మాటల్లో ఈ పోలిక కర్ణుని పాదాల వరకే చెప్పబడి కనిపిస్తుంది, ఈ క్రింది శ్లోకాలలో (వ్యాసభారతం, శాంతిపర్వం, ప్రథమాధ్యాయం):

సభాయాం గదతో ద్యూతే దుర్యోధనహితైషిణ !

తదా నశ్యతి మే రోషః పాదౌ తస్య నిరీక్ష్య హ!!41 !!

కున్త్యా హి సదృశౌ పాదౌ కర్ణస్యేతి మతిర్మమ!

సాదృశ్యహేతుమన్విచ్ఛన్‌ పృథాయాస్తస్య చైవ హ !!42 !!

కారణం నాధిగచ్ఛామి కథంచిదపి చిన్తయన్‌ !

‘‘కౌరవసభలో కపటద్యూతం జరుగుతున్న సంద ర్భంలో దుర్యోధనునికి ఇష్టం కలిగే విధంగా కర్ణుడు మాట్లాడినప్పుడు అతని కఠోరమైన మాటలను విని చాలా బాధపడ్డాను. కానీ, ఆ సమయంలో అతడి పాదాల మీదికి నా దృష్టి మరలగానే, నాలో పెరిగిన కోపం అంతా ఒక్కసారిగా చల్లారిపోయేది. కర్ణుని రెండు పాదాలు మా తల్లి కుంతీదేవి పాదాలను పోలి ఉండేవి అని నా నమ్మకం. వారి ఇరువురి పాదాలు అంతగా ఒకే పోలికలతో ఎలా వున్నాయి? అని కారణం ఆలోచిస్తూ నేను చాలా కాలం గడిపే వాడిని. కానీ, ఎంత ఆలోచించినా ఆ కారణం అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు’’ - అని పై శ్లోకాల భావం. 


కుంతి - కర్ణుల మధ్య పోలికను కేవలం పాదాలకు సరిపెట్టడం తిక్కనకు అంత సహజంగా అనిపించ లేదనుకుంటాను, సందర్భాన్ని అలానేవుంచి పోలికను మొత్తం రూపానికి ఆపాదించి సందిగ్ధాన్ని తొలగించి స్పష్టత చేకూర్చి కర్ణుడిని ‘తల్లి పోలికలతో పుట్టిన కొడుకు’గా చెప్పేశాడు. లోకంలో ప్రసిద్ధమై నిలిచున్న నమ్మకాలలో ‘తల్లి పోలికలతో పుట్టిన కొడుకు ఐశ్వర్య వంతుడు, కీర్తిమంతుడు ఔతాడన్నది’ ఒకటి. ఈ నమ్మకానికి అత్యుత్తమమైన ఉదాహరణగా కర్ణుడు నిలుస్తాడనడంలో సందేహం లేదు. 

భట్టు వెంకటరావు

Advertisement
Advertisement
Advertisement