Abn logo
Sep 21 2021 @ 14:15PM

బాల్య వివాహాల్లో కర్ణాటక టాప్..

బెంగళూరు: బాల్య వివాహాల నిషేధ చట్టం అమలులో ఉన్నా దానికి తూట్లు పడుతూనే ఉన్నాయి. 2020లో దేశంలో అత్యధిక బాల్య వివాహాలు నమోదైన రాష్ట్రాల్లో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. ఆ ఏడాది కర్ణాటకలో 185 బాల్య వివాహాలు జరగినట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2019లో నమోదైన బాల్య వివాహాల కంటే ఇది 66 శాతం ఎక్కువ. 138 బాల్యవివాహాలతో అసోం రెండు స్థానంలో ఉండగా, తమిళనాడు 77, తెలంగాణ 62 బాల్య వివాహాలతో తరువాత స్థానాల్లో నిలిచాయి.

కర్ణాటక మహిళా, శిశు సంక్షేమ శాఖ వివరాల ప్రకారం, కోవిడ్ మహమ్మారి తారాస్థాయిలో ఉన్న 2020లో ఫిబ్రవరి నుంచి నవంబర్ వరకూ 2,074 బాల్య వివాహాలను ఆ శాఖ అడ్డుకోగలిగింది. బళ్లారిలో అత్యధికంగా 218 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకోగా, ఆ తర్వాత స్థానాల్లో మైసూరు (177), బెళగవి (131). చిక్కబళ్లాపూర (107), చిత్రదుర్క (107) ఉన్నాయి. బెంగళూరులో 20 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకోగలిగారు. ఫిబ్రవరి-నవంబర్ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 108 బాల్యవివాహాల కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హసన్‌లో అత్యధికంగా 26, మాండ్యలో 25, మైసూరులో 24,  బెళగవిలో 19, రామనగరలో 13 బాల్యవివాహాలు జరిగాయి. బెంగళూరు సిటీలో ఐదు బాల్యవివాహాలు జరిగాయి.

నకిలీ ఏజ్‌తో రెండేసి ఆధార్‌లు..

కాగా, పలు కేసుల్లో మైనర్ బాలికలు రెండు ఆధార్ కార్డులు కలిగి ఉండటం కనుగొన్నామని, వాటిలో ఒకటి నకిలీది ఉంటోందని, 18 ప్లస్ ఉన్నట్టుగా అందులో ఉంటుందని చైల్డ్ రైట్స్ ట్రస్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వసుదేవ్ శర్మ తెలిపారు. లాక్‌డౌన్ వల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభ పరిస్థితి కూడా బాల్య వివాహాలు పెరడానికి ఒక కారణమని ఆయన అన్నారు. బాల్యవివాహాల వల్ల ఎదురయ్యే దుష్పరిణామాల పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అవగాహన పెంచుకోవాలని సూచించారు.