కర్ణాటక టు తెలంగాణ

ABN , First Publish Date - 2022-05-20T04:31:32+05:30 IST

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కర్ణాటక నుంచి వడ్లు అక్రమంగా తరలొస్తున్నాయి.

కర్ణాటక టు తెలంగాణ
బుధవారం రాత్రి నందిన్నె చెక్‌పోస్టు వద్ద పట్టుకున్న లారీలు

ఆ రాష్ట్రం నుంచి అక్రమంగా ధాన్యం రవాణా

అక్కడ ఏర్పాటు చేయని కొనుగోలు కేంద్రాలు

తెలంగాణలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అక్కడి కంటే ఎక్కువ ధర

సొమ్ము చేసుకునేందుకు దళారులు, మిల్లర్ల పన్నాగం

అక్కడ ధాన్యం కొని, ఇక్కడికి తీసుకొచ్చి విక్రయం

అధికారుల తీరుపై అనుమానాలు


ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు కర్ణాటక నుంచి వడ్లు అక్రమంగా తరలొస్తున్నాయి. ఇక్కడి సొసైటీల నిర్వాహకులతో దళారులు కుమ్మక్కై, ధాన్యాన్ని తెచ్చి మద్దతు ధర పొందుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో స్థానిక మిల్లర్లు కర్ణాటకలో ధాన్యం కొని, ఇక్కడి కేంద్రాల్లో స్థానిక రైతుల పేర విక్రయిస్తున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా ధాన్యం లారీలు రావడం పట్ల పలు విమర్శలు వస్తున్నాయి.

- గద్వాల,(ఆంధ్రజ్యోతి)


ఇతర రాష్ర్టాల నుంచి ధాన్యం జిల్లాలోకి రాకుండా ప్రభుత్వం పోలీసు, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖల సమన్వయంతో చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసినా ఫలితం ఉండటం లేదు. అక్కడ నిత్యం తనిఖీలు జరుగుతున్నప్పటికీ, రాత్రి వేళల్లో కర్ణాటక నుంచి దళారులు ధాన్యం తరలిస్తున్నారు. ఇటీవల నారాయణపేట జిల్లా మక్తల్‌ నియోజకవర్గంలో పోలీసులు 16 లారీల ధాన్యాన్ని పట్టుకుని, సీజ్‌ చేశారు. జరిమానా కూడా విధించారు. తాజాగా బుధవారం రాత్రి 10 గంటల సమయంలో జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం నందిన్నె చెక్‌పోస్టు వద్ద మరో నాలుగు లారీల్లో ధాన్యం తరలిస్తుండగా, స్వాధీనం చేసుకున్నారు. చెక్‌పోస్టు వద్ద కాపలాగా ఉన్న వీఆర్‌వో రవి మొదట ఆపే ప్రయత్నం చేసినా ఆగకుండా వెళ్లడంతో వీఆర్‌వో పోలీసులకు సమాచారం అందించారు. ఐదు లారీల్లో ధాన్యం తెలంగాణలోని కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయగా, ఒక్క లారీ తిరిగి కర్ణాటక వైపు వెళ్లింది. నాలుగు లారీలను స్వాధీనం చేసుకున్నారు. 


ఇక్కడి వారే అక్రమార్కులు..

గత సీజన్‌లో ధాన్యం విరివిగా కొనుగోలు కేంద్రాలకు రావడం, సరైన సమయంలో ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో మెజారిటీ రైతులు కర్ణాటకలోని రాయిచూర్‌ మార్కెట్‌ వ్యాపారులకు ధాన్యాన్ని విక్రయించారు. ఆ సమయంలో అక్కడ ధర కూడా ఎక్కువగా రావడంతో రైతులకు గిట్టుబాటు లభించింది. అయితే ఈ సీజన్‌లో రైతులు పండించే ధాన్యం తక్కువగా ఉండటంతో గతం కంటే కొనుగోలు కేంద్రాలు తక్కువగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీన్ని ఆసరాగా చేసుకున్న స్థానికంగా ఉండే కొందరు మిల్లర్లు, దళారులు కర్ణాటకలో రైతులు పండించిన ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి, తెలంగాణలోని కొను గోలు కేంద్రాల్లో విక్రయించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. స్థానికంగా ఉండే కొన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నిర్వాహకులతో కుమ్మక్కై స్థానిక రైతుల పేరుతో విక్రయిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం వరి వేయొద్దని యాసంగి సీజన్‌ ఆరంభం ముందు చెప్పడంతో ఉమ్మడి జిల్లాలో వరి సాగు గణనీయంగా తగ్గింది. చాలామంది రైతులు పొలాలను బీడుగా ఉంచడమో లేక ఆరుతడి పంటలు వేయడమో చేశారు. అయితే గతంలో రైతులు కొనుగోళ్ల సమయంలో అందజేసిన పత్రాలతో సాగు చేయకపోయినా చేసినట్లు చూపించి వారి పేరుతో విక్రయించే ఏర్పాట్లు చేసుకుం టున్నట్లు తెలుస్తోంది. ఖాతాల్లో డబ్బులు జమ అయిన తర్వాత ఎంతోకొంత రైతుకు ముట్టజెప్పి, మిగిలిన మొత్తాన్ని కాజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కర్ణాటకలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేకపోవడం వల్ల అక్కడ వ్యాపారులు పెట్టిందే ధర అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఈ కారణంగా రైతులు క్వింటాల్‌కు రూ.1300 వరకే విక్రయిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రూ.1960 మద్దతు ధర వస్తుండటం వల్ల ఒక్కో క్వింటాల్‌పై దళారికి రూ.660 వరకు లాభం వస్తోంది.


చెక్‌పోస్టులు ఉన్నా ఆగని తరలింపు

పొరుగు రాష్ర్టాల నుంచి ధాన్యం అక్రమ రవా ణాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట జిల్లాల్లో సరిహద్దు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఏడు, నారాయణపేట జిల్లాలో రెండు, నాగర్‌కర్నూల్‌ జి ల్లాలో ఒక చెక్‌ పోస్టు ఉంది. ఇన్ని చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసు, వ్యవసాయ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో సిబ్బందిని నియమించినా అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. ఇటీవల నారా యణపేట జిల్లాలో కూడా చెక్‌పోస్టుల నుంచి దాటిన తర్వాత లారీలను పోలీసులు పట్టుకున్నారు. నందిన్నె చెక్‌పోస్టు వద్ద కూడా తర చూ అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పౌరసరఫరాలు, రెవెన్యూ, పోలీసుశాఖల అండ లేకుండా ఇదంతా సాధ్యకాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. బుధవారం అర్ధరాత్రి ధాన్యం పట్టుకున్నప్పటికీ.. గురువారం సాయంత్రం వరకూ వాటికి సంబంధించి పంచానామా పూర్తి చేయలేదు. రాత్రి సమయంలో పంచనామా పూర్తి చేసి, ఆ ధాన్యం అక్రమంగా తరలిస్తున్నదేనని అధికారులు నిర్ధారించారు. పట్టుబడిన నాలుగు లారీల్లో 1,091 క్వింటాళ్ల ధాన్యం ఉన్నట్లు అధికారులు తెలిపారు. గద్వాల పట్టణంలోని పలువురు రైస్‌మిల్లర్లు ఈ తరహా దందా చేస్తున్నట్లు సమాచారం. బుధవారం రాత్రి పట్టుకు న్న లారీలు కూడా గద్వాల ప్రాంతం వారివేనని తెలుస్తోంది. ప్రభుత్వం ఓ వైపు అక్రమ రవాణాను కట్టడి చేయాలని చూస్తుంటే.. స్థానికంగా కొందరు వ్యాపారులు దానికి తిలోదకాలు ఇస్తున్నారు. అయితే బుధవారం లారీలను ఆపబోయిన వీఆర్‌వోపైకి ఒక లారీ దూసుకొచ్చిందని అధికారులు చెప్తుండగా, సదరు వీఆర్‌వో మాత్రం అలాంటి ఘటన జరగలేదని తెలిపారు. ఏది నిజమో.. ఏదీ అబద్ధమో అధికారులే స్పష్టత ఇవ్వాల్సి ఉంది. 


విచారణ చేస్తున్నాం

పొరుగు రాష్ర్టాల నుంచి ధాన్యం తీసుకువచ్చి ఇక్కడి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించకుండా చెక్‌పోస్టులను ఏర్పాటు చేశాం. నందిన్నె దగ్గర లారీలను పట్టుకోవడం ఇదే మొదటిసారి. గతంలో అలా జరుగ లేదు. లారీలను ఆపేందుకు ప్రయత్నించిన వీఆర్‌వోపైకి డ్రైవర్‌ లారీని దూకించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. విచారణ చేసిన తర్వాత చర్యలు తీసుకుంటాం. 

- రేవతి, డీఎస్‌వో, జోగుళాంబ గద్వాల



Updated Date - 2022-05-20T04:31:32+05:30 IST