బెంగళూరు: 'హలాల్' మాంసాన్ని బాయ్‌కాట్ చేయాలంటూ కొన్ని రైట్ వింగ్ గ్రూపులు హిందువులకు పిలుపునివ్వడం కర్ణాటకలో కొద్దిరోజులుగా చర్చనీయాంశమవుతోంది. దీనిపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై బుధవారంనాడు స్పందించారు. హలాల్ మాంసంపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నందున ఆ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు. ఇది (హలాల్ మీట్) ఒక ప్రాక్టీస్‌గా మాత్రమే వస్తోందని, దీనిపై ఎవరైనా తీవ్రమైన అభ్యంతరాలు లేవనెత్తినప్పుడు ఆ అంశాన్ని పరిశీలించాల్సి వస్తుందని అన్నారు. ఆయా గ్రూపులు చేస్తున్న డిమాండ్‌పై ప్రభుత్వం అధ్యయనం చేసి, వారు చెబుతున్నది నిజమా కాదా అనేది అంచనా వేస్తుందన్నారు. త్వరలోనే ఈ అంశంపై ప్రభుత్వం ఒక స్పష్టతనిస్తుందని తెలిపారు. రైట్ వింగ్ డిమాండ్ చేసిందా, లెఫ్ట్ వింగ్ డిమాండ్ చేసిందా అనేది తమకు ప్రధానం కాదని, అభివృద్ధి, శాంతి, ప్రజాభద్రత అనేవే ప్రభుత్వానికి వింగ్స్ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
కాగా, రాష్ట్రంలో హలాల్ మాంసాన్ని బహిష్కరించాలంటూ హిందూ రైట్ వింగ్ గ్రూప్స్ కొద్దిరోజులుగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ ప్రధాన కార్యదర్శి సీటీ రవి సైతం దీనిపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. హలాల్ ఫుడ్‌ను 'ఎకనామిక్ జీహాద్'గా ఆయన అభివర్ణించారు. ఇదొక జీహాద్‌గా ముస్లింలు వాడుకుంటున్నారని, బలవంతంగా రుద్దుతున్నారని, వాళ్ల హలాల్‌ను ఇందుకోసం వాడాలని అనుకుంటే, అలా వాడుకోవడం కుదరదని చెప్పడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. ''హిందువుల నుంచి మాసం కొనేందుకు ముస్లింలు నిరాకరిస్తున్నప్పుడు, మా దగ్గర మాసం కొనమని హిందువులను ఎలా వాళ్లు పట్టుపడతారు?'' అని రవి ప్రశ్నించారు.