Roja Reddy Success Story: ఆడపిల్లవి.. ఇలాంటి పనులేంటి అన్నవాళ్లే కంగుతిన్నారు.. లక్షల జీతాన్నిచ్చే జాబ్‌కు ఈ యువతి గుడ్ బై చెప్పి..

ABN , First Publish Date - 2022-09-26T15:25:43+05:30 IST

కుటుంబ సభ్యులు వద్దన్నారు. బందువులు స్నేహితులు పిచ్చితనం అన్నారు. కానీ రోజా తన పట్టు వదల్లేదు. కుంటుంబానికి నచ్చజెప్పి తన ప్రయత్నం మొదలుపెట్టింది.

Roja Reddy Success Story: ఆడపిల్లవి.. ఇలాంటి పనులేంటి అన్నవాళ్లే కంగుతిన్నారు.. లక్షల జీతాన్నిచ్చే జాబ్‌కు ఈ యువతి గుడ్ బై చెప్పి..


బెంగుళూరు మెట్రో సిటీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయడం చాలా మంది యువతీ యువకుల కల. అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. కానీ 26 సంవత్సరాల రోజా రెడ్డి మాత్రం చేతులారా లక్షల సంపాదనను ఇచ్చే ఉద్యోగాన్ని వదిలేసింది. దాని బదులు సేంద్రీయ వ్యవసాయాన్ని ఎంచుకుంది. కుటుంబ సభ్యులు వద్దన్నారు. బందువులు స్నేహితులు పిచ్చితనం అన్నారు. కానీ రోజా తన పట్టు వదల్లేదు. కుంటుంబానికి నచ్చజెప్పి తన ప్రయత్నం మొదలుపెట్టింది. ఆసక్తిని కలిగించే ఈమె వ్యవసాయ  ప్రయాణం ఎలా సాగిందంటే...


కర్ణాటక రాష్ట్రంలోని కరువు ప్రాంతమైన చిత్రదుర్గ జిల్లాలో దొన్నేహళ్లి ప్రాంతానికి చెందిన 26 సంవత్సరాల రోజారెడ్డి కుటుంబం మొత్తం వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంది. ఈమె తండ్రి, సోదరుడు ఇద్దరూ మొదటి నుండి వ్యవసాయాన్నే నమ్ముకున్నారు. వీరికి బోలెడు భూమి ఉన్నా దిగుబడి సరిగా లేక కొద్దిపాటి భూమిలో మాత్రమే దానిమ్మ పంటను సాగు చేస్తూ మిగిలిన భూమిని అలాగే వదిలేశారు. వీరి కుటుంబంలో బాగా చదువుకున్నది కేవలం రోజా రెడ్డి మాత్రమే. ఈమె ఉద్యోగం చేస్తున్నప్పుడే కోవిడ్ భూతం ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసింది. ఉద్యోగంలో బాగంగా ఈమెకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. అప్పుడు రోజా బెంగుళూరు నుండి తిరిగి తన సొంత ఊరికి వెళ్లింది. 


అక్కడ  తండ్రి, అన్నయ్య వ్యవసాయంలో పడుతున్న ఇబ్బందులు గమనించి ఇలాంటి నష్టాలు ఎందుకొస్తున్నాయనే విషయం గురించి ఆలోచించింది. కృత్రిమ రసాయన ఎరువులు, నాణ్యత లేని విత్తనాల వల్ల భూమిలో సారం తగ్గిపోయి పంటల దిగుబడి ఉండటం లేదనే విషయం అర్థమయ్యాక ఆమెకు తన చిన్నతనంలో వాళ్శ తాతయ్య సేంద్రీయ వ్యవసాయం చేసేవాడు అనే విషయం గుర్తుకొచ్చింది. వెంటనే తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి సేంద్రీయ వ్యవసాయం చేస్తానని అడిగింది. ఆ మాట వినగానే రోజాను పిచ్చిదాన్ని చూసినట్టు చూసారు. ఆడపిల్ల వ్యవసాయం చేయడం  ఏమిటని చదువుకున్న చదువుకు ఉద్యోగం చేయకుండా  పిచ్చి ఆలోచనలు వద్దని చెప్పారు. అయినా రోజా రెడ్డి పట్టువదల్లేదు. ‘వ్యవసాయం చేయకుండా వృథాగా ఉన్న భూమిలో ఆరు ఎకరాలు నాకు ఇవ్వండి.. దానిలో ప్రయత్నం చేస్తాను, నేనేమీ ఉద్యోగం వదిలిపెట్టను. నా ఆఫీస్ వర్క్ అయిపోయాక మిగిలిన సమయంలో నేను వ్యవసాయ పనులు ప్రయత్నిస్తాను..’ అని చెప్పి ఒప్పించింది. 


రోజా రెడ్డి తను అనుకున్నట్టు ఆఫీస్ వర్క్ అయిపోయాక సాయంత్రం నాలుగు గంటల నుండి వ్యవసాయ పనుల మీద దృష్టి పెట్టేది. ఈమె  సేంద్రీయ వ్యవసాయం చేయడానికి మూస పద్దతి ఫాలో అవ్వలేదు. దాని గురించి చాలా విషయాలు ఇంటర్ నెట్ లోనూ, యూట్యూబ్ లోనూ చూసి తెలుసుకుంది. అది మాత్రమే కాకుండా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నకొంతమంది రైతులను కలిసి వారితో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుంది. ఆ తరువాతనే సాగు మొదలుపెట్టింది. భూమి సారవంతం అవ్వడానికి ఆవు పేడ, ఆవు మూత్రం ఉపయోగించి జీవామృతం, వేప నూనె ఉపయోగించి నీమాస్త్రం, అగ్నయాస్త్రం వంటి సేంద్రీయ ఎరువులు, సహజమైన పురుగుల మందులు సొంతంగా తయారుచేసుకుని ఉపయోగించింది. అసలే కరువు ప్రాంతం కావడంతో నీటి సమస్య ఉండేది. దాన్ని అధిగమించడానికి తన పొలంలో ఉన్న నీటి బోర్లకు తోడుగా రెండు చిన్న నీటి చెరువులు తవ్వించి వాటి నుండి డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం ఏర్పాటుచేయించింది. నీటిశాతం తక్కువ ఉన్నా ఆరోగ్యకరమైన ఎరువులు లభించిన ఫలితంగా మంచి పంట దిగుబడి కూడా సాధించింది. 


ఎంతో కష్టమైన వ్యవసాయాన్ని ఇబ్బందులు లేకుండా చేసిన రోజా ఆ పంటను అమ్ముకోవడంలో మాత్రం సమస్యను ఎదుర్కొంది. కరువు ప్రాంతం, పెద్దగా అక్షరాస్యత లేని ప్రాంతం అవడంతో సాధారణ పంటలలో పండించిన వాటికి, సేంద్రీయ సాగులో పండించిన వాటికి తేడా అక్కడి వారు తెలుసుకులేకపోయారు. పరిష్కారం కోసం ఆలోచించినపుడు మార్కెటింగ్ సౌకర్యం లేనపుడు దాన్ని సృష్టించుకోవాలి అనుకుంది రోజా. దానికోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణించింది, సేంద్రీయ వ్యవసాయం చేసే ఎనిమిది మంది రైతులతో  కలిసి ఒక టీమ్ ఏర్పాటుచేసుకుంది. వారందరూ కలసి స్థానిక చిత్రదుర్గ జిల్లా మార్కెటింగ్ అధికారులతో మాట్లాడారు. ప్రతి తాలూకా ఆఫీస్ లో మాట్లాడి తమ వ్యవసాయం గురించి చెప్పి వారు పండించిన కూరగాయలను అమ్ముకోవడానికి కొంచెం స్థలం కేటాయించాలని అడిగారు. అధికారులు ఒప్పుకోవడంతో వారికి మార్గం దొరికింది. కానీ సేంద్రీయ కూరగాయల గొప్పదనం తెలిస్తేనే వాటిని ప్రజలు కొనుగోలు చేస్తారని భావించి ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించారు. 


ఇన్ని చేసాక రోజాకు తను పండించిన పంట అమ్ముడయ్యే దారి క్లియర్ అయ్యింది. ఆమెకు మాత్రమే కాకుండా ఆమెతో కలసి మార్కెటింగ్ కోసం ప్రయత్నం చేసిన వారికి, అక్కడి ప్రాంతాలలో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నవారికి కూడా ఉపయోగపడింది. రోజాను చూసి చుట్టుప్రక్కల ప్రాంతాలలో కొందరు రసాయనాలతో వ్యవసాయం చేయడం మానేసి సేంద్రీయ సాగువైపుకు అడుగులేసారు. వారందరికీ ఎలాంటి మధ్యవర్తుల సహాయం లేకుండా నేరుగా వారే తమ పంటను సులభంగా మార్కెట్ లో అమ్ముకునేందుకు రోజానే సహాయం చేస్తుంది. 


ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం మొత్తం మీద రోజా కు అనుసంధానంగా 500 మంది సేంద్రీయ రైతులు ఉన్నారు. వీరందరూ కలసి పెద్ద మొత్తంలో ఆర్గానిక్ మార్కెట్ లు ఏర్పాటు చేసుకున్నారు. వీరు సంవత్సరం పొడవునా పెద్ద పెద్ద ఆర్డర్లు బెంగుళూరు వంటి పెద్ద నగరాలకు సప్లై చేస్తారు.  ఇంకొక ముఖ్యవిషయం ఏమిటంటే 'నిసర్గ నేటివ్ ఫార్మ్స్' పేరుతో రోజా తన సొంత బ్రాండ్ ను క్రియేట్ చేసుకుంది. ఇది బెంగుళూరు లోని కొన్ని రిటైల్ అవుట్ లెట్ లతో కలసి పనిచేస్తుంది.  ఇలా ఎవరు ఎంత నిరుత్సాహ పరచినా తన ప్రయత్నం ఆపకుండా ముందుకు సాగిన రోజా 6 ఎకరాలతో మొదలు పెట్టి ప్రస్తుతం 50 ఎకరాలలో కూరగాయలు పండిస్తోంది. 


టమాటా, వంకాయ, దోసకాయ, బెండకాయ, క్యారెట్, బీన్స్, సొరకాయ, కాకరకాయ, మిరపకాయలు మొదలయిన వాటితో కలిపి దాదాపు 20 రకాల కూరగాయలు, ఒకసారి దిగుబడిలో 500 నుండి 700 కేజీలు పండిస్తూ సంవత్సరానికి అక్షరాలా కోటి రూపాయలు సంపాదిస్తోంది. తన పొలం చుట్టుప్రక్కల 10 గ్రామాల ప్రజలకు ఆమె ఉపాధిని కల్పించింది. ఈ విజయం ఆమె కళ్ళలో ఎప్పుడూ ప్రతిబింబిస్తూనే ఉంటుంది.

Updated Date - 2022-09-26T15:25:43+05:30 IST